ప్రాంతాలు వేరైనా సంకల్పం ఒక్కటే
ABN, Publish Date - Jan 09 , 2025 | 12:08 AM
భారతదేశం మొత్తాన్ని సైకిల్‌పై చుట్టి రావాలని యువకులు సంకల్పించారు. ముగ్గురు యువకులు వేర్వేరు చోట్ల వేర్వేరు సమయాల్లో సైకిల్‌యాత్రకు శ్రీకారం చుట్టినప్పటికీ అనుహ్యంగా ముగ్గురు కేరళలోని కొచ్చిలో కలిసి చేయి, చేయి కలిపి ఒక్కటిగా యాత్రకు సాగుతున్నారు.
సైకిల్‌యాత్ర చేస్తున్న యువకులు
(ఆంధ్రజ్యోతి-డిండి)
భారతదేశం మొత్తాన్ని సైకిల్‌పై చుట్టి రావాలని యువకులు సంకల్పించారు. ముగ్గురు యువకులు వేర్వేరు చోట్ల వేర్వేరు సమయాల్లో సైకిల్‌యాత్రకు శ్రీకారం చుట్టినప్పటికీ అనుహ్యంగా ముగ్గురు కేరళలోని కొచ్చిలో కలిసి చేయి, చేయి కలిపి ఒక్కటిగా యాత్రకు సాగుతున్నారు. భాషలు, ప్రాంతాలు వేరైనా సమైక్యత, సౌభ్రాతృత్వమే తమ అభిమతం అంటూ ఆ యువకులు ముందుకు సాగుతున్నారు. సిక్కిం రాష్ట్రానికి చెందిన మిలానసుబ్బు, నేపాల్ దేశానికి చెందిన డానియెల్, బిహార్ రాష్ట్రానికి చెందిన సురజ్ సుమన బుధవారం ఉదయం సైకిల్‌పై జాతీయ రహదారిపై ప్రయాణిస్తూ అల్పాహరం కోసం నల్లగొండ జిల్లా డిండి మండల కేంద్రంలో కొద్దిసేపు ఆగారు.
ఇప్పటికే 16 రాష్ట్రాల్లో పర్యటించా
మాది సిక్కిం రాష్ట్రం. సైకిల్‌పై దేశయాత్రను 11 జూలై 2024న పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిల్‌గుడి నుంచి బయలుదేరా. సిక్కింలో కొండలు, గుట్టలు ఉండడం వల్ల సరిహద్దులోని సిల్‌గుడి నుంచి యాత్రచేపట్టా. ఇప్పటివరకు సిక్కిం రాష్ట్రం నుంచి దేశంలోని 28 రాష్ట్రాల్లో పర్యటించినవారులేరు. ఆ రికార్డును సొంతం చేసుకునేందుకే సైకిల్‌పై యాత్ర ప్రారంభించా. ప్రస్తుతం సిక్కిం అవాజ్ అనే దినపత్రికలో పనిచేస్తున్నా. ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లో 900 కిలోమీటర్లు ప్రయాణించి ఛత్తీ్‌సఘడ్ మీదుగా ఇక్కడికి వచ్చా. సిక్కిం రాష్ట్రంలో వ్యవసాయమంతా ఆర్గానిక్ పద్ధతిలో చేస్తాం. ప్రభుత్వం కూడా ఆర్గానిక్ వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తోంది.
మిలానసుబ్బు, సిక్కిం రాష్ట్రం
సైకిల్ యాత్ర అంటే సరదా
సైకిల్‌యాత్ర అంటే నాకు సరదా. ఈ యాత్ర రికార్డు నెలకొల్పేందుకే చేస్తున్నాను. నేపాల్ దేశంలోని పర్నాలి రాష్ట్రంలోని సురకేత నుంచి 2024 సెప్టెంబరు 2న సైకిల్ యాత్ర మొదలుపెట్టా. ఇప్పటివరకు భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో 6,400 కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నా. ఈరోజు హైదరాబాద్‌కు చేరుకొని విశ్రాంతి తీసుకుంటా.
డానియెల్, నేపాల్
సేవ్ ఎర్త్ నా నినాదం
బిహర్‌లోని సింహరి నుంచి 2024 జూన 13న సైకిల్ యాత్ర ప్రారంభించా. సేవ్ ఎర్త్, సేవ్ హెల్త్ అనే నినాదంతో సైకిల్‌యాత్ర ద్వారా ప్రచారం చేసేందుకు శ్రీకారం చుట్టా. ప్రకృతిని కాపాడుకోవాలి. 16 రాష్ట్రాల్లో 9వేల కిలోమీటర్లు ప్రయాణించి డిండి మీదుగా హైదరాబాద్‌కు వెళుతున్నా.
సురజ్ సుమన, బిహార్ రాష్ట్రం
Updated Date - Jan 09 , 2025 | 12:08 AM