National Meeting : అసంక్రమిత వ్యాధులపై నేడు, రేపు జాతీయ స్థాయి సమావేశం
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:22 AM
అసంక్రమిత వ్యాధుల(ఎన్‌సీడీ)పై బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసింది.
హైదరాబాద్, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : అసంక్రమిత వ్యాధుల(ఎన్‌సీడీ)పై బుధ, గురువారాల్లో హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సమావేశం జరగనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తిచేసింది. శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేటు రిసార్ట్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్‌హెచ్‌ఎమ్)లో భాగంగా ప్రతీ రెండేళ్లకోసారి దేశ రాజధాని ఢిల్లీలో అసంక్రమిత వ్యాధులపై సమావేశాలు జరుగుతుంటాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇంతవరకు ఇటువంటి జాతీయ స్థాయి సమావేశాన్ని ఢిల్లీలో తప్ప ఇతర రాష్ట్రాల్లో ఒక్కసారి కూడా నిర్వహించలేదు. ఒక రాష్ట్రంలో ఇటువంటి జాతీయ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఈ సమావేశానికి కేంద్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సౌరబ్ జైన్(ఎన్‌సీడీ), జాతీయ ఆరోగ్య మిషన్ ఎండీ ఆరాధన పట్నాయక్‌తో పాటు అదనపు డైరెక్టర్ డాక్టర్ ఎల్. స్వస్తిక్ చరణ్, అన్ని రాష్ట్రాలకు చెందిన ఎన్‌హెచ్‌ఎమ్ ఎండీలు, ఎన్‌సీడీ కార్యక్రమ అధికారులు హాజరవుతున్నారు. తొలిరోజు ప్రముఖ వైద్యుల ప్రసంగాలుంటే, రెండోరోజు నాలుగైదు జిల్లాల్లో కేంద్ర బృందంతో పాటు ఆయా రాష్ట్రాల ఎన్‌హెచ్‌ఎమ్ ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయనున్నారు. మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్ జిల్లాల్లో నిర్వహిస్తోన్న ఎన్‌సీడీ పరీక్షలను స్వయంగా పరిశీలించనున్నారు.
Updated Date - Jan 08 , 2025 | 05:26 AM