నీలగిరిలో పార్కింగ్ పరేషాన
ABN, Publish Date - Mar 14 , 2025 | 01:03 AM
నల్లగొండ పట్టణంలో పార్కింగ్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నీలగిరిలో పార్కింగ్ పరేషాన
వాహనం నిలపడానికి ప్రజల ఇబ్బందులు
షాపింగ్ కాంప్లెక్స్‌లకు పార్కింగ్ కరువు
జరిమానాలు వేస్తున్న పోలీసులు
నల్లగొండ క్రైం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ పట్టణంలో పార్కింగ్ సమస్యతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా కావడంతో జిల్లా కేంద్రం ప్రజలు, వాహనదారులతో నిత్యం రద్దీగా ఉంటుంది. జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కూడా తమ సొంత వాహనాలతోనే పట్టణానికి వచ్చి తమ పనులను చేసుకుని తిరిగి వెళ్తుంటారు. దీనికి తోడు పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్‌కు వచ్చే వారు సైతం టూ వీలర్, ఫోర్ వీలర్లను మాత్రమే వినియోగిస్తున్నారు. దీంతో పట్టణంలో రోజు రోజుకూ వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోంది. జిల్లా కేంద్రంలో వివిధ పనుల నిమిత్తం బయటికి వెళ్లే వారు ఆ పనులు చేసుకోవాలంటే బండి ఎక్కడ పార్కింగ్ చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. జిల్లా కేంద్రంలో ఉన్న షాపింగ్ మాల్స్‌కు సింహభాగం 85 శాతం పార్కింగ్ సదుపాయం లేదు. షాపింగ్ మాల్స్ సెల్లార్‌లో కొంత పార్కింగ్‌కు కేటాయిస్తుండగా అక్కడికి అధికసంఖ్యలో ప్రజలు వస్తుండటం తో పార్కింగ్ సరిపోక ఎ క్కువ మంది రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. ఇకపోతే జిల్లా కేంద్రం కావడంతో పాటు మునిసిపాలిటీ ఉన్నా కానీ పట్టణంలో ఏ ప్రాంతంలో కూడా ప్రభుత్వ పార్కింగ్ స్థలం లేకపోవడం వాహనదారులకు ఇబ్బందిగా మారింది.
రోడ్డుపై పార్క్ చేస్తే పోలీసుల జరిమానాలు
వివిధ పనుల నిమిత్తం బయటకు వచ్చిన సమయంలో పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లపై వాహనాలు నిలిపితే పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. గతంలో రూ.200 ఉన్న జరిమానా ప్రస్తుతం రూ.1000కి చేరడంతో షాపుల ఎదురుగా, రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రకాశంబజార్‌తో పాటు అక్కడ ఉన్న ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, కూరగాయల దుకాణాలు, హోటళ్లు, ఇతర వ్యాపార సముదాయాల వద్ద విపరీతంగా వాహనాలు రోడ్లపైనే నిలుపుతున్నారు. దీంతో పాటు హైదరాబాద్ రోడ్డులో షాపింగ్ మాల్స్, మద్యం దుకాణాలు, వస్త్ర, వ్యాపార దుకాణాలు, బేకరీలు, రెస్టారెంట్ల వద్ద సైతం పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో రోడ్లపైనే వాహనాలను నిలుపుతున్నారు. దీంతో పోలీసులు ఇట్టే ఫొటోలు కొట్టి జరిమానాలు విధిస్తుండగా వాహనదారులు పని చూసుకొని వచ్చే వరకు జరిమానా మెసేజ్ సెల్‌కు వచ్చేస్తుంది. పట్టణంలోని ప్రకాశంబజార్, హైదరాబాద్ రోడ్డు, రామగిరి, దేవరకొండ రోడ్డులోని మార్ట్‌లు, హాస్పిటల్స్ వద్ద పార్కింగ్ సమస్య అధికంగా ఉంది. కనీసం వ్యాలెట్ పార్కింగ్ సదుపాయం సైతం లేకపోవడంతో వాహనదారులకు జరిమానాలు, ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు ప్రత్యేక చొరవ చూపి పట్టణంలో పార్కింగ్ సమస్యకు పుల్‌స్టాప్ పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు.
పెరుగుతున్న వాహనాల సంఖ్య
నల్లగొండ పట్టణంలో వాహనాల వినియోగం పెరిగింది. ప్రతీ ఇంటికి ఒకటి రెండు ద్విచక్ర వాహనాలు ఉండటంతో పాటు ఫోర్ వీలర్ల సంఖ్య సైతం పెరిగింది. వాహనదారులు ప్రతీ రోజూ ఉదయం నుంచి సాయంత్రం సమయంలో ఏదో ఒక పని మీద బయటికి వస్తుంటారు. పార్కింగ్ చేయాలంటే స్థలం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే షాపింగ్ మాల్స్ వద్ద 85 శాతానికి పైగా పార్కింగ్ లేదు. మాల్స్ ఎదుటనే అధిక సంఖ్యలో వాహనాలు పార్క్ చేయడంతో రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి.
రోడ్లపై నిలిపితే జరిమానా
నల్లగొండ పట్టణంలో వాహనదారులు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. షాపింగ్, ఇతర విక్రయాలకు వచ్చిన సమయంలో పార్కింగ్ స్థలంలోనే వాహనాలను పార్కింగ్ చేసుకోవాలి. రోడ్లపై నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ చేస్తే జరిమానాలు తప్పవు. పట్టణంలో ప్రకాశంబజార్, హైదరాబాద్ రోడ్డు, దేవరకొండ రోడ్డు, రామగిరితో పాటు పలు ప్రాంతాల్లో ఈ సమస్యను గుర్తించాం. కానీ రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేసి ఇతర వాహనదారులను, ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
- శివరాంరెడ్డి, డీఎస్పీ, నల్లగొండ
పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపాలి
పట్టణంలో బైక్‌పై బయటకు వెళ్లాలంటేనే భయంగా ఉంది. షాపింగ్‌కు వెళ్లి ఏమైనా కొనుగోలు చేయాలంటే ఎక్కడ పార్కింగ్ చేయాలో అర్థం కావడం లేదు. అక్కడ ఉన్న పార్కింగ్ స్థలం కొద్దిగానే ఉండటంతో సరిపోవడం లేదు. రోడ్లపై బైక్ పార్కింగ్ చేస్తే పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. పార్కింగ్ సౌకర్యం కల్పించని యజమానులపై చర్యలు తీసుకోవాలి. పట్టణంలో పార్కింగ్ సమస్యకు అధికారులు చొరవ చూపి పరిష్కారం మార్గం ఆలోచించాలి.
- చింతపల్లి లింగమయ్య, శాంతినగర్, నల్లగొండ
Updated Date - Mar 14 , 2025 | 01:03 AM