డేంజర్ బెల్స్
ABN, Publish Date - Jan 12 , 2025 | 12:17 AM
ఉమ్మడి జిలాలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వానాకాలం ( ఖరీఫ్) సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ యాసంగి (రబీ) సీజన్‌లో అంతంత మాత్రంగానే వర్షాలు పడడంతో భూగర్భజలాలు పెరగలేదు. మరోవైపు నీటి వినియోగం పెరగడంతో శరవేగంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నవంబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు భూగర్భజలాల పరిస్థితి పరిశీలిస్తే ఒక్క నెలలోనే సగటున మీటర్ లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి.
శరవేగంగా తరిగిపోతున్న భూగర్భజలాలు
ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా 14.11 మీటర్ల లోతుకు..
శివార్లలో పరిస్థితి ఆందోళనకరం
యాసంగి పంటల సాగుపై ప్రభావం
రబీలో లోటు వర్షపాతంతో పెరిగిన తీవ్రత
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. భూగర్భనీటి నిల్వలు శరవేగంగా పడిపోతు న్నాయి. యాసంగి సీజన్‌లో సరిపడా వానలు కురవక, నీటి వినియోగం పెరిగిపోవడంతో గంగమ్మ అడుగంటిపోతోంది. నెల వ్యవధిలోనే మీటర్ లోతుకు జలాలు పడిపోవడంతో పంటల సాగుపై ప్రభావం చూపుతోంది. నీటి వసతి లేక యాసంగిలో సాగు విస్తీర్ణం 50 శాతం కూడా దాటలేదు. బోర్లు ఉన్న రైతులు మాత్రమే పంటలు సాగుచేసుకుంటున్నారు.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి) : ఉమ్మడి జిలాలో భూగర్భజలాలు గణనీయంగా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. వానాకాలం ( ఖరీఫ్) సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురిసినప్పటికీ యాసంగి (రబీ) సీజన్‌లో అంతంత మాత్రంగానే వర్షాలు పడడంతో భూగర్భజలాలు పెరగలేదు. మరోవైపు నీటి వినియోగం పెరగడంతో శరవేగంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. నవంబర్ నెలాఖరు నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు భూగర్భజలాల పరిస్థితి పరిశీలిస్తే ఒక్క నెలలోనే సగటున మీటర్ లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. గడిచిన రెండు నెలల కాలంలో ఉమ్మడిజిల్లాలో సగటు దాదాపు రెండున్నర మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడం గమనార్హం. భవిష్యత్తులో కూడా వర్షాలు పడే అవకాశాలు పెద్దగా లేకపోవడంతో వేసవిలో సాగునీటితో పాటు తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం కనిపిస్తోంది. ముఖ్యంగా నగర శివార్లలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. హయత్‌నగర్, శేరిలింగంపల్లి, సరూర్‌నగర్ తదితర మండలాల్లో భూగర్భనీటి నిల్వలు శరవేగంగా పడిపోతున్నాయి. మరో వైపు వర్షాల లేమి యాసంగి పంటల సాగుపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. సాధారణంగా అక్టోబర్ మొదటి వారం నుంచి పంటలకు యాసంగి సీజన్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో వర్షాలు లేకపోవడం వల్ల యాసంగిలో పంటల సాగు అంతంత మాత్రంగానే ఉంది. కొన్నిచోట్ల సీజన్‌లో కనీస స్థాయిలో కూడా వర్షాలు పడలేదు. దీంతో అనేక మండలాల్లో ఇంకా ఆరుతడి పంటలు మొదలు కాలేదు. బోర్లు ఉన్నవారు మాత్రమే సాగు పనులు చేస్తున్నారు. ఈ కారణంగా యాసంగి పంటలు సాగు విస్తీర్ణం 50శాతం దాటలేదు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో యాసంగి పంటలు సాగు 25శాతం లోపుగానే ఉన్నట్లు వ్యవసాయశాఖ తాజాగా ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొంది. వికారాబాద్ జిల్లాలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా.. ఆశించిన స్థాయిలో పంటలు సాగు చేయలేదు. వికారాబాద్ జిల్లాలో 50శాతం లోపుగానే పంటలు సాగు ఉంది. యాసంగి సీజన్‌లో పంటలు వేసేందుకు సమయం కూడా దాటిపోతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బోర్లు ఉన్న రైతులు మాత్రం ప్రత్యామ్నయ పంటలు వేసేందుకు సిద్ధమవుతున్నారు.
51శాతం లోటు వర్షపాతం
మూడు జిల్లాల్లో యాసంగి సీజన్‌లో కనీస స్థాయిలో కూడా వర్షాలు లేకపోవడంతోనే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు సగటు 123.5 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా.. 62మి.మీ వర్షపాతమే కురిసింది. అంటే దాదాపు 51శాతం లోటు వర్షపాతం నమోదైంది. అలాగే మేడ్చల్ జిల్లాలో 42శాతం, వికారాబాద్ 16శాతం తక్కువ వర్షం కురిసింది. యాసంగి పంటల సాగుకు కీలకమైన నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇబ్రహీంపట్నంలో అత్యధికంగా...
ఇబ్రహీంపట్నం మండలంలో అత్యధికంగా 14.11 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. సరూర్‌నగర్ మండలంలో 12.66 మీటర్లు, శేరిలింగంపల్లి మండలంలో 12.59 మీటర్లు, తలకొండపల్లి మండలంలో 12.43 మీటర్లు, హయత్‌నగర్ మండలంలో 10.95 మీటర్లు, మంచాలలో 10.29 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పతనమయ్యాయి.
శేరిలింగంపల్లిలో శరవేగంగా ..
గత ఏడాదితో పోలిస్తే 16 మండలాల్లో భూగర్భజలాలు పెరగగా 11 మండలాల్లో భూగర్భజలాలు పడిపోయాయి. నవంబరుతో పోలిస్తే అన్ని మండలాల్లో భూగర్భజలాలు గణనీయంగా తగ్గాయి. ఒక్క నెలలో అత్యధికంగా శేరిలింగంపల్లి మండలంలో 2.48 మీటర్ల భూగర్భజలాలు పడిపోయాయి. అలాగే సరూర్‌నగర్‌లో 1.79మీటర్లు, ఇబ్రహీంపట్నంలో 1.61 మీటర్లు, హయత్‌నగర్‌లో 1.09 మీటర్లు నీటి మట్టాలు తగ్గాయి.
శరవేగంగా పడిపోతున్న భూగర్భజలాలు
రంగారెడ్డిజిల్లాలో వానాకాలం 32శాతం అధిక వర్షపాతం నమోదైంది. అలాగే వికారాబాద్ జిల్లాలో 41శాతం, మేడ్చల్ జిల్లాలో 21శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఉమ్మడి జిల్లాలో భూగర్భజలాలు గణనీయంగానే పెరిగాయి. అయితే యాసంగి సీజన్‌లో కనీస స్థాయిలో కూడా వర్షాలు పడలేదు. ఈ సీజన్‌లో రంగారెడ్డిజిల్లాలో 40శాతం లోటు వర్షపాతం నమోదైంది. అలాగే మేడ్చల్ జిల్లాలో 38శాతం, వికారాబాద్ జిల్లాలో 10శాతం తక్కువ వర్షాలు పడ్డాయి. ఒక వైపు లోటు వర్షపాతంతో పాటు మరో వైపు విచ్చలవిడిగా నీటి వాడకం పెరగడంతో భూగర్భజలాలు శరవేగంగా పడిపోతున్నాయి.
యాసంగిలో వర్షపాతం వివరాలు (మి.మీ)
జిల్లా సాధారణ వర్షపాతం ఇప్పటి వరకు కురిసిన వర్షపాతం తగ్గుదల శాతంలో
రంగారెడ్డి 128.2 77.5 -40
మేడ్చల్ 126.6 72.8 -38
వికారాబాద్ 102.7 86.6 -10
Updated Date - Jan 12 , 2025 | 12:17 AM