పిల్లలకు వాహనమిస్తే జైలుకే!

ABN, Publish Date - Feb 09 , 2025 | 11:43 PM

తెలిసీ తెలియని వయస్సు.. పిల్లలకు వాహనం చేతుల్లో ఉంటే దూసుకెళ్లే మనసత్వం.. ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 18 ఇళ్లు నిండని వారికి మన దేశంలో వాహనాలు నడపడానికి అనుమతి లేదు.

పిల్లలకు వాహనమిస్తే జైలుకే!
ప్రజలకు అవగాహన కల్పిస్తున్న బషీరాబాద్‌ ఎస్‌ఐ శంకర్‌
  • 18ఏళ్లు నిండని వారికి బైక్‌ ఇవ్వొద్దని హెచ్చరిస్తున్న పోలీసులు

  • నిబంధనలు తెలియక ప్రమాదాలకు కారణమవుతున్నారని హెచ్చరిక

  • వాహనమిచ్చిన వారిపై చర్యలు

బషీరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): తెలిసీ తెలియని వయస్సు.. పిల్లలకు వాహనం చేతుల్లో ఉంటే దూసుకెళ్లే మనసత్వం.. ఇవన్నీ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 18 ఇళ్లు నిండని వారికి మన దేశంలో వాహనాలు నడపడానికి అనుమతి లేదు. తల్లిదండ్రులు లేదా బంధువుల వాహనాలను తీసుకుని నడపాలని పిల్లలు ఆత్రుత పడుతుంటారు. పెద్దలు ఎదైన పని చెబితే బైక్‌ ఇవ్వాలని తల్లిదండ్రులతో పిల్లలు మారాం చేయడం, మొండి కేయడం వంటివి చేస్తుంటారు. కొన్నిసార్లు తమ పిల్లలను ఏం అనలేక ఉదారత చూపుతూ తాళం చెవి ఇచ్చేస్తారు. అయితే పిల్లలు వాహనంతో బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు ఆందోళన చెందుతుంటారు. ఈ నేపథ్యంలో మైనర్లకు వాహనాలు ఇస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ప్రతీఒక్కరు తెలుసుకోవాలి.

నిబంధనలు తెలియక ప్రమాదాలు

పోలీసుల తనిఖీల్లో 18 ఏళ్లు నిండని వారు కొందరు వాహనలతో పట్టుబడుతుంటారు. రద్దీగా ఉండే ప్రాంతాలు, ప్రధాన రోడ్లు, జాతీయ రహదారి వంటి ప్రాంతాల్లో మైనార్లు చక్కర్లు కొడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. మైనార్లకు నిబంధనలు తెలియక రహదారుల్లో వేగ మార్గదర్శకాలు గుర్తించక బైక్‌పై వెళ్తూ ప్రమాదాల బారిన పడటం లేదా ఎదుటి వారిని ఢీకొట్టడమో వంటివి చేస్తుంటారు. మైనర్లు వాహనాలతో రోడ్లపై వస్తూ ఎదుటి వారి గుండెల్లో దడ పుట్టిస్తున్నారు. మైనార్లు వాహనాలతో రోడ్లపై పోలీసులకు పట్టుబడితే తాళాలు తీసుకొని పోలీ్‌సస్టేషన్‌కు తరలించి, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అయినా తల్లిదండ్రుల్లో ఇంకా మార్పు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు.

ప్రాణహాని కలిగితే జీవిత ఖైదు

లైసెన్సు కలిగిన వారు రోడ్డు ప్రమాదంలో ఎదుటి వ్యక్తి ప్రాణాలు పోవడానికి కారణమైతే బాలుడు, యజమానిపై నాన్‌ బెయిలబుల్‌ కేసు నమోదవుతుంది. కేసుతో పాటు ఐదేళ్ల కారాగార శిక్షలు పడే అవకాశం ఉందని చట్టం చెబుతోంది.

కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం: పి.శంకర్‌, ఎస్‌ఐ బషీరాబాద్‌

మైనార్లు బైక్‌లు నడుపుతూ పట్టుబడితే వాహనాన్ని సీజ్‌చేసి జరిమానా విధిస్తాం. పిల్లలను, వాహనయజమానులు (తల్లిదండ్రులు)ఎవరైనా ఉంటే పోలీ్‌సస్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. మైననర్లను తల్లిదండ్రులు రోడ్లపై పంపించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రసుత్తం రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ఈ విషయమై ఊరూరా ప్రజలకు అవగాహన కల్పించాం.

Updated Date - Feb 09 , 2025 | 11:43 PM