Acharya Tummala Ramakrishna: ఆచార్య తుమ్మల రామకృష్ణ కన్నుమూత

ABN, Publish Date - Apr 01 , 2025 | 06:17 AM

ద్రవిడ విశ్వవిద్యాలయం మాజీ ఉపాధ్యక్షుడు, ప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు, రచయిత ఆచార్య తుమ్మల రామకృష్ణ(67) సోమవారం మృతిచెందారు. ఆయన 1988లో తెలుగు సాహిత్యంలో పీహెచ్‌డీ పొందిన తర్వాత అనేక సాహిత్య రచనలను వెలువరించారు.

Acharya Tummala Ramakrishna: ఆచార్య తుమ్మల రామకృష్ణ కన్నుమూత

ద్రవిడ విశ్వవిద్యాలయం వీసీగా సేవలు

తెలుగు సాహిత్యంలో వృత్తి కథలకు నాంది

నేడు లింగంపల్లిలో అంత్యక్రియలు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 31(ఆంధ్రజ్యోతి): కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపాధ్యక్షుడు, ప్రముఖ సాహిత్య విమర్శకుడు, రచయిత ఆచార్య తుమ్మల రామకృష్ణ(67) ఇకలేరు. కొద్దిరోజులుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం లింగంపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. రామకృష్ణ స్వస్థలం చిత్తూరు జిల్లా ఆవులపల్లి. ఆయన శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ‘తెలుగులో హాస్యనవలలు’అనే అంశంపై పరిశోధన చేసి 1988లో పీహెచ్‌డీ అందుకున్నారు. తర్వాత ఏడాది కర్నూలులోని ఎస్వీయూ పీజీ సెంటరులో తెలుగు లెక్చరర్‌గా చేరారు. అక్కడ పనిచేస్తున్న కాలంలోనే మిత్రులతో కలిసి ‘తుంగభద్ర ప్రచురణలు’ పేరుతో ‘పల్లెమంగలి కథలు’ సంకలనాన్ని 1996లో ప్రచురించారు. తెలుగు సాహిత్యంలో వృత్తికథల ప్రయోగాలకు నాంది పలికిన వ్యక్తిగా రామకృష్ణ గుర్తింపు పొందారు. ‘ఫ్యాక్షన్‌ కథలు’, ‘హైంద్రావతి కథలు’ తదితర సంకలనాలకు సంపాదకత్వం వహించారు. రామకృష్ణ రాసిన కథానికలు ‘మట్టిపొయ్యి’ సంపుటిగా వెలువడింది. ‘తెల్లకాకులు’ కథ విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆధునిక తెలుగుసాహిత్య వ్యాసాలు, సమీక్షలు, ప్రసంగాలు ...‘పరిచయం’, ‘బహుముఖం’, ‘అభిచందనం’, ‘అవగాహన’, ‘బారిస్టర్‌ పార్వతీశం - ఒక పరిశీలన’ తదితర పుస్తకాలుగా ప్రచురించారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 2004నుంచి 2020 వరకు తెలుగు ఆచార్యుడిగా, ఆ శాఖ అధ్యక్షుడిగా పనిచేశారు. ద్రవిడ వర్సిటీ వీసీగా 2020 నవంబరు నుంచి మూడేళ్లు సేవలందించారు. రామకృష్ణ మృతికి హెచ్‌సీయూ తెలుగు శాఖాధ్యక్షుడు పిల్లలమర్రి రాములు, సాహితీవేత్తలు సంగిశెట్టి శ్రీనివాస్‌, దార్ల వెంకటేశ్వరరావు, పులికొండ సుబ్బాచారి, ద్రవిడ వర్సిటీ మాజీ వీసీ ఆచార్య లక్ష్మీనారాయణ, తెలుగు వర్సిటీ పూర్వ వీసీ ఎస్వీ సత్యనారాయణ సంతాపం తెలిపారు. తుమ్మల రామకృష్ణ అంత్యక్రియలు మంగళవారం లింగంపల్లిలోని శ్మశానవాటికలో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.


ఈ వార్తలు కూాడా చదవండి

Bandi Sanjay Comments On HCU: ఆ వీడియోలు చూస్తే బాధేస్తోంది

HCU భూములపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

Betting Apps: బెట్టింగ్ యాప్స్‌పై దర్యాప్తు వేగవంతం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 01 , 2025 | 06:17 AM