Summer Heatwave: 28 జిల్లాల్లో 40 డిగ్రీలపైనే

ABN, Publish Date - Mar 18 , 2025 | 05:39 AM

మార్చిలోనే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. పగటిపూట బయటకు అడుగుపెట్టాలంటేనే బాబోయ్‌ అనే పరిస్థితి నెలకొంటోంది. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 42 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది.

Summer Heatwave: 28 జిల్లాల్లో 40 డిగ్రీలపైనే
  • నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు

  • ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 42 డిగ్రీలు

  • హైదరాబాద్‌లో 40.1 డిగ్రీలు నమోదు

  • మానుకోటలో వడదెబ్బతో ఒకరి మృతి

హైదరాబాద్‌, కేసముద్రం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): మార్చిలోనే ఎండలు మాడు పగలగొడుతున్నాయి. పగటిపూట బయటకు అడుగుపెట్టాలంటేనే బాబోయ్‌ అనే పరిస్థితి నెలకొంటోంది. సోమవారం ఆదిలాబాద్‌ జిల్లా బేలలో 42 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. జైనథ్‌లో 41.7, ఆదిలాబాద్‌ రూరల్‌లో 41.6, మావలలో 41.5, ఆదిలాబాద్‌ అర్బన్‌లో 41.2, గాదిగూడ 40.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో ఎన్నడూలేని విధంగా మార్చిలోనే 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. కొత్తగూడెం, నారాయణపేట్‌ జిల్లా మక్తాలలో 41.9, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌, ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బనలో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత జనగాంలో 39.8 డిగ్రీలుగా నమోదైంది.


గతేడాది ఇదే రోజున కేవలం మూడు జిల్లాల్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరగా, మిగతా జిల్లాల్లో సగటు ఉష్ణోగ్రతలు 36-39గా నమోదయ్యాయి. రాగల 2 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాత గరిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. కాగా మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో సోమవారం తెల్లవారుజామున పెద్దవంగర మండలం ఉప్పరిగూడెంకు చెందిన దుంపల రాజు(48) వడదెబ్బతో మృతి చెందారు. మృతుడు నెల రోజుల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయి ఆచూకీ తెలియకుండా వివిధ ప్రాంతాలు తిరుగుతున్నాడని, వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు ఎస్సై మురళీధర్‌రాజ్‌ తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

Updated Date - Mar 18 , 2025 | 05:39 AM