Seethakka: నేను మీ మంత్రి సీతక్కను.. మీ సమస్య ఏంటి.!
ABN , Publish Date - Mar 11 , 2025 | 04:04 AM
నేను మీ మంత్రి సీతక్కను మాట్లాడుతున్నా.. మీ సమస్య ఏంటి..’ అంటూ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం డయల్ 181కు ఫోన్ చేసిన ఓ బాధితురాలితో మాట్లాడారు.

డయల్ 181కు మహిళ ఫోన్.. మాట్లాడిన మినిస్టర్
హైదరాబాద్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ‘నేను మీ మంత్రి సీతక్కను మాట్లాడుతున్నా.. మీ సమస్య ఏంటి..’ అంటూ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం డయల్ 181కు ఫోన్ చేసిన ఓ బాధితురాలితో మాట్లాడారు. సమస్యను విన్న వెంటనే పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని మధురానగర్‌లో ఏర్పాటు చేసిన ఉమెన్ హెల్ప్‌లైన్ కాల్ సెంటర్‌ను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అదే సమయంలో డయల్ 181కు ఫోన్ రాగానే.. ఆ ఫోన్‌ను స్వయంగా మంత్రి సీతక్క ఎత్తారు. సమస్య ఏంటి, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారని అడగ్గా.. దేవరకొండ నుంచి ఫోన్ చేస్తున్నానని, తన పేరు లలిత అని.. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని తెలిపింది. తనను, తన ఇద్దరు పిల్లలను ఇంటి నుంచి బయటకు పంపించారని, దేవరకొండ బస్‌స్టేషన్‌లో ఉన్నానని మంత్రికి వివరించింది. స్పందించిన మంత్రి వెంటనే.. సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.