Bhatti Vikramarka : 9న నూతన ఇంధన పాలసీ
ABN, Publish Date - Jan 07 , 2025 | 05:39 AM
రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం కోసం ఆ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈనెల 9న నూతన ఇంధన పాలసీని విడుదల చేయనున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి
పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు స్వీకరిస్తాం
రాష్ట్రం వెలుపల కూడా థర్మల్,
గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు పెడతాం
మన్ముందు మిగులు విద్యుత్తు రాష్ట్రంగా తెలంగాణ: భట్టి
హైదరాబాద్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం కోసం ఆ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈనెల 9న నూతన ఇంధన పాలసీని విడుదల చేయనున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. సోమవారం సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహం ముందు జరిగిన కార్యక్రమంలో ఆయన జెన్‌కోలో ఎంపికైన 315 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, కెమి్‌స్టలకు నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పదేళ్లపాటు ప్రత్యేక విధానం అంటూ లేకపోవడంతో ఇంధన రంగంలో పెట్టుబడులు రాలేదన్నారు. రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గకుండా విద్యుత్తు అందించాలని నిర్ణయించుకున్నామన్నారు. థర్మల్, గ్రీన్ ఎనర్జీని తేవాలని నిర్ణయం తీసుకున్నామని, రాష్ట్రం వెలుపల కూడా ప్లాంట్లు పెట్టనున్నామని పేర్కొన్నారు. ఒడిసాలో నైనీ బ్లాకును కేటాయించినా, గత ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తి దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఆ రాష్ట్ర సీఎంను కూడా కలిసి, నైనీ బ్లాకులో తవ్వకాలు చేపట్టే పనిని చేపట్టామన్నారు. ఆ బ్లాకు వద్ద కూడా థర్మల్ ప్లాంట్‌ను పెట్టనున్నామన్నారు. రాష్ట్రంలో సోలార్, పవన, హైడ్రోజన్, జలవిద్యుదుత్పాదన తేనున్నామన్నారు. 20 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన గ్రీన్ ఎనర్జీని తేనున్నామని, దీనికోసం కొత్త ఇంధన విధానాన్ని మంత్రివర్గంలో ఆమోదించామన్నారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల ప్లాంట్లను పెట్టించనున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో తెలంగాణను మిగులు విద్యుత్తు రాష్ట్రంగా మార్చనున్నామని ప్రకటించారు. ఇంధన రంగంలో తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా ఉండనుందన్నారు. రాష్ట్ర జీఎ్‌సడీపీలో ప్రధాన పాత్ర విద్యుత్తు రంగానిదేనన్నారు. ఈ సందర్భంగా సింగరేణికి చెందిన కార్మికుల పిల్లలకు కార్మికులుగా మిగలకుండా, దేశంలో ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలపై అవగాహన, శిక్షణ కల్పించడానికి వీలుగా ‘చెమట చుక్కలకు తర్ఫీదు’ అనే పథకం లోగోను భట్టి ఆవిష్కరించారు.
సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మె విరమణ
గత 29 రోజులుగా సమ్మె చేపట్టిన తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులు సమ్మె విరమించారు. పొరుగు సేవ, ఒప్పంద ప్రాతిపదికన నాలుగు క్లస్టర్ల పరిధిలో ఉన్న సుమారు 19 వేల మంది ఉద్యోగులు 30 డిమాండ్లతో సమ్మెకు దిగారు. డిసెంబరు 9న స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ చర్చలకు పిలిచినా వీరు వెళ్లలేదు. ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని, అందరినీ టెర్మినేట్ చేయాలనే దిశగా ఆలోచన చేస్తుందనే ప్రచారం జరిగింది. దీంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. సోమవారం సమగ్ర శిక్షా ఉద్యోగ సంఘం నేతలు, టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు, ప్రొఫెసర్ కోదండరాం, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నా రెడ్డి నేతృత్వంలో భట్టి విక్రమార్కను కలిశారు. ఆర్థికేతర అంశాలను పరిశీలిస్తామని, ఆర్థిక పరమైన విషయాలపై కేబినెట్ సబ్‌కమిటీలో చర్చిస్తామని వారికి భట్టి హామీ ఇచ్చారు.
Updated Date - Jan 07 , 2025 | 05:39 AM