అందని హాస్టల్ బిల్లులు
ABN, Publish Date - Jan 13 , 2025 | 01:31 AM
నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర ప్రత్యేక వసతిగృహం నిర్వహణ కేటగిరీపై నెలకొన్న గందరగోళానికి తెరదించిన శాఖా అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం మరిచారు.
అందని హాస్టల్ బిల్లులు
ప్రీమెట్రిక్‌గా గుర్తించి ప్రొసీడింగ్స్ ఇవ్వపోవడమే కారణం
నార్కట్‌పల్లి బీసీ బాలుర ప్రత్యేక హాస్టల్ పరిస్థితి
నార్కట్‌పల్లి, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండల కేంద్రంలోని బీసీ బాలుర ప్రత్యేక వసతిగృహం నిర్వహణ కేటగిరీపై నెలకొన్న గందరగోళానికి తెరదించిన శాఖా అధికారులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం మరిచారు. దీంతో హాస్టల్ నిర్వహించినందుకు ఇవ్వాల్సిన బకాయి బిల్లులను ఏడాది కావస్తున్నా చెల్లించలేదు. బకాయి బిల్లుల మంజూరుకు ప్రొసీడింగ్స్‌కు ముడిపెట్టడమే ఇందుకు కారణం. దీంతో హాస్టల్ నిర్వహణకు తన సొంత డబ్బులను వెచ్చించిన వార్డెనకు బిల్లుల కోసం ఎదురుచూపులు, ఇబ్బందులు తప్పడం లేదు.
పోస్టుమెట్రిక్‌గా మార్చి...
హాస్టల్ నిర్వహణకు ప్రతీ సంవత్సరం జిల్లా అధికారి రెన్యూవల్ చేయాల్సి ఉంది. ఈ ప్రకారమే 2023-24 విద్యా సంవత్సరానికి కూడా నార్కట్‌పల్లి బీసీ బాలుర హాస్టల్‌ను ప్రీమెట్రిక్ (పదో తరగతి విద్యార్థుల కోసం)గా ఏఎ్‌సడబ్ల్యూవో రెన్యూవల్ చేశారు. దీంతో కొత్తగా మరో 20 మంది విద్యార్థులు కూడా చేరారు. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2023-24 విద్యా సంవత్సరంలో నార్కట్‌పల్లి మండల కేంద్రానికి జూనియర్ కాలేజీ మంజూరైంది. ఫలితంగా నార్కట్‌పల్లి బీసీ బాలుర హాస్టల్‌ను (కాలేజీ విద్యార్థుల కోసం) 25 ఆగస్టు 2023న పోస్టుమెట్రిక్ హాస్టల్‌గా గుర్తిస్తూ అధికారులు మధ్యంతర ఆదేశాలిచ్చారు. ప్రీమెట్రిక్ హాస్టల్ విద్యార్థులను సమీప వసతిగృహాలకు బదిలీ చేయాలని సూచించారు. అయితే సదరు ప్రీమెట్రిక్ విద్యార్థులు సమీప వసతిగృహాలకు వెళ్లేందుకు అయిష్టత చూపగా అప్పటి జిల్లా అధికారుల సూచన మేరకు ఇటు ప్రీమెట్రిక్‌గా అటు పోస్ట్‌మెట్రిక్‌గా రెండు కేటగిరీల విద్యార్థులకు భోజనాన్ని సమకూర్చారు.
పోస్ట్‌మెట్రిక్ కోడ్ ఇవ్వడం వల్లే...
అధికారుల ఆదేశాలతో హాస్టల్‌ను ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్‌గా నిర్వహించినా కోడ్ నెంబర్ మాత్రం పోస్ట్ మెట్రిక్‌గా ఇచ్చారు. కానీ కాలేజీ విద్యార్థుల సంఖ్య 18 ఉంటే ప్రీమెట్రిక్ విద్యార్థుల సంఖ్య మాత్రం దాదాపు 80గా ఉంది. దీంతో పోస్ట్‌మెట్రిక్ కోడ్‌పై బిల్లు పెడితే డబ్బులు నష్టపోతానని చెప్పిన వార్డెన ప్రీమెట్రిక్ హాస్టల్‌గా గుర్తించాలని బీసీ సంక్షేమ శాఖ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. వార్డెన విజ్ఞప్తికి తోడు వాస్తవ పరిస్థితులను పరిశీలించిన శాఖాధికారులు పోస్టుమెట్రిక్ హాస్టల్ నుంచి తిరిగి ప్రీమెట్రిక్ హాస్టల్‌గా 2024 మార్చిలోనే మార్చారు. కానీ దీనికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను నేటికీ ఇవ్వలేదు. ఈ కారణంగా 2023-24 సంవత్సరపు బకాయి బిల్లులు సుమారు రూ.5లక్షలకు పైగా నేటికీ అందలేదు. ఫలితంగా పాలు, కూరగాయలు, చికెన, కిరాణ, గుడ్లను సరఫరా చేసిన వారికి బిల్లులను ఇవ్వకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు.
బకాయి బిల్లులు ఇస్తామన్నారు
2023-24 సంవత్సరంలో పోస్టుమెట్రిక్‌గా మార్చిన అధికారులు తిరిగి ప్రీమెట్రిక్ హాస్టల్‌గా గుర్తించారు. ఐతే ఆ సమయానికి సం బంధించి ప్రొసీడింగ్స్ ఇవ్వాల్సి ఉంది. అది ఇస్తేనే పాఠశాల, కాలేజీ విద్యార్థులకు హాస్టల్‌లో భోజన వసతిని సమకూర్చిన బిల్లుల బకాయిలు వస్తాయి. ప్రొసీడింగ్స్ ఇస్తామని శాఖ జిల్లా అధికారులు హామీ ఇచ్చారు.
యాదగిరిరెడ్డి, వార్డెన, నార్కట్‌పల్లి
Updated Date - Jan 13 , 2025 | 01:31 AM