పోలీసులా.. వైసీపీ కార్యకర్తలా?
ABN , First Publish Date - 2021-02-17T08:23:34+05:30 IST
‘రాష్ట్రంలో కొందరు పోలీసులు వైసీపీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారు. పోలీసు చట్టాన్ని మీరే ఉల్లంఘించడం దారుణం. జగన్‌రెడ్డి దుర్మార్గాలకు అండగా నిలిచి, దురాగతాలకు పాల్పడుతూ పోలీస్ వ్యవస్థ ఔన్నత్యాన్ని

పులివెందులలో టీడీపీ అభ్యర్థులకు బెదిరింపులు హేయం
కుప్పంలో హింసకు వైసీపీ పన్నాగం: చంద్రబాబు
అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో కొందరు పోలీసులు వైసీపీకి బానిసలుగా వ్యవహరిస్తున్నారు. పోలీసు చట్టాన్ని మీరే ఉల్లంఘించడం దారుణం. జగన్‌రెడ్డి దుర్మార్గాలకు అండగా నిలిచి, దురాగతాలకు పాల్పడుతూ పోలీస్ వ్యవస్థ ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారు’ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ‘మీరు పోలీసులా? వైసీపీ కార్యకర్తలా?’ అని నిలదీశారు. పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థులు వేసిన నామినేషన్లను ఉపసంహరించుకోవాలని కొందరు పోలీసులు బెదిరింపులకు దిగడం అత్యంత హేయమని మండిపడ్డారు. కడప జిల్లా సింహాద్రిపురం మండలం నంద్యాలపల్లిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థిని విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి చేస్తూ, అభ్యర్థిని భర్త సోమశేఖర్‌రెడ్డి సహా టీడీపీ కార్యకర్తలను తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేయడం ద్వారా సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ అనిల్‌రెడ్డి ప్రజాస్వామాన్ని అవహేళన చేశారని విమర్శించారు.
అలాగే, కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అక్రమాలపై ఎన్నికల సంఘానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. బయట నుంచి అధిక సంఖ్యలో వచ్చిన దుండగులు, సంఘవిద్రోహ శక్తులు కుప్పం, పరిసర గ్రామాల్లో పాగా వేశారని, హోటళ్లు, లాడ్జిల్లో తిష్ఠ వేశారంటూ ఎస్‌ఈసీ, కలెక్టర్, ఎస్పీకి లేఖ రాశారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో ఓటమికి మనస్తాపంతో అనంతపురంజిల్లా శెట్టూరు మండలం చర్లోపల్లిలో టీడీపీ కార్యకర్త ఈడిగ నాగేంద్ర ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. నాగేంద్ర కుటుంబానికి టీడీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. టీడీపీ శ్రేణులెవ్వరూ భావోద్వేగానికి గురికావొద్దని చంద్రబాబు సూచించారు.