ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ మృతి

ABN , First Publish Date - 2022-01-28T14:39:59+05:30 IST

తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న, ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో

ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ మృతి

తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న,ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్  శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఆయన గుండె పోటుతో మరణించారు. ప్రముఖ రచయిత్రి, కవి స్వర్గీయ డా.పుట్ల హేమలత, సుధాకర్ గారి జీవిత భాగస్వామి. వీరికి ఇద్దరు కుమార్తెలు- ప్రముఖ యువ కథా రచయిత్రి మానస, చిన్న కుమార్తె మనోఙ్ఞ.


‘వర్తమానం’, ‘నల్లద్రాక్ష పందిరి’, ‘పుష్కర కవితలు’, "ఆటా"జనికాంచె..’ వంటి కవితాసంపుటులు, ‘కావ్యత్రయం’, ‘కొత్త గబ్బిలం’, ‘ గోసంగి’, ‘వర్గీకరణీయం’ వంటి దళిత దీర్ఘ కావ్యాలు, జాషువా' నాకథ ' వంటి ఎం.ఫిల్ పరిశోధన, జాషువా సాహిత్యం- దృక్పథం - పరిణామం- పిహెచ్. డి సిద్ధాంత గ్రంథం, 'నా అక్షరమే నా ఆయుధం'- డా .శరణ్ కుమార్ లింబాలే ఆత్మ కథకి అనువాదం, 'మల్లె మొగ్గల గొడుగు' వంటి మాదిగ కథలు సుధాకర్ రచించారు.


ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 21, 1959న నిజామాబాద్‌లోని పాముల బస్తిలో జన్మించారు. ఎండ్లూరి దేవయ్య, శాంతాబాయిలకు ప్రథమ సంతానం . హైదరాబాద్ వీధి బడిలో ప్రారంభమైన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరాబాద్‌లోనే సాగింది. నల్లకుంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. ఎం.ఫిల్, పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్ .డి చేశారు.



1985 నుంచి 1990 వరకు సికింద్రాబాద్‌లోని వెస్లీ బాయ్స్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా ఉద్యోగం చేశారు.1990 అక్టోబరు 6 వ తేది నుంచి నేటి వరకు వివిధ పదవుల్ని నిర్వహిస్తున్నారు. 2004 సం. నుంచి 2011 వరకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించే 'వాఙ్మయి' సాహిత్య పత్రికకి సహాయ సంపాదకుడిగా, సంపాదకుడిగా వ్యవహరించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా, అసోసియేట్ ప్రొఫెసర్‌గా, ప్రొఫెసర్‌గా శాఖాధిపతిగా, (1994 నుంచి 2012 వరకు) పదవుల్ని నిర్వహించారు. తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి సాహిత్య పీఠంలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పని చేశారు. 2009, సెప్టెంబరు 5వ తేదీ నుంచి అదే రాజమండ్రి సాహిత్య పీఠానికి ఆచార్యులుగా, డీన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.


సుమారు 100 మంది పైగా విద్యార్థులకు గైడ్‌గా వ్యవహరించారు. ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ, తెలుగు యూనివర్సిటీ కౌన్సిల్, తెలుగు సలహా మండలి, తెలుగు అకాడమీలలో సభ్యులుగా ఉన్నారు. ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకుడుగా కూడా ఉన్నారు.

Updated Date - 2022-01-28T14:39:59+05:30 IST