షేర్లలో 10 శాతం పాలసీదారులకే...
ABN , First Publish Date - 2022-03-03T06:35:27+05:30 IST
ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూలో పాలసీదారుల వాటా గరిష్ఠంగా 10 శాతం వరకు ఉండవచ్చు. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు భారీగా

ఎల్‌ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ మినీ ఇపే
హైదరాబాద్: ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూలో పాలసీదారుల వాటా గరిష్ఠంగా 10 శాతం వరకు ఉండవచ్చు. ఉక్రెయిన్ పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు భారీగా ఊగిసలాడుతున్నందు వల్ల ఇష్యూ జారీపై కూడా నీలిమేఘా లు అవరించి ఉన్నాయి. ఇష్యూలో ఒక్కోటి రూ.10 ముఖవిలువ ఉండే 31.62 కోట్ల షేర్లు మార్కెట్లో జారీ కావచ్చునంటున్నారు. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మినీ ఇపే బుధవారం వర్చువల్ విధానంలో విలేకరులతో మాట్లాడుతూ ఇష్యూ జారీ అయ్యే నాటికి చలామణిలో ఉన్న పాలసీ, పాన్‌కార్డు కలిగి ఉన్న పాలసీదారులందరూ షేర్లకు బిడ్ చేసే అర్హత కలిగి ఉంటారని చెప్పారు. వాస్తవంగా షేరు పరిమాణం ఎంత అనేది షేర్ల ధర నిర్ణయించే సమయంలో ప్రకటిస్తారని ఆమె తెలిపారు. ఇష్యూ తేదీ గురించి తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనని పలువురి ప్రశ్నలకు సమాధానంగా ఆమె చెప్పారు. మొత్తం మీద పాలసీదారులకు గరిష్ఠంగా 10 శాతం షేర్లు కేటాయించే ఆస్కారం ఉన్నదని ఆమె అన్నారు. కొత్త ప్రీమియం వసూళ్లలో ఎల్‌ఐసీదే అగ్రస్థానమని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికీ హామీ ప్రీమియంలో మూడింట రెండు శాతం వాటాతో దేశంలో అగ్రగామిగా కొనసాగుతున్నట్టు ఆమె చెప్పారు. 2020-21లో సంస్థ కొత్త ప్రీమియం వసూళ్లలో 75 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నదని ఆమె తెలిపారు.