పుదుచ్చేరికి కదిలిన బస్సులు
ABN , First Publish Date - 2021-07-13T12:42:27+05:30 IST
రాష్ట్రంలో కొత్త సడలింపులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. కొత్త సడలింపుల్లో ప్రధానమైన

- అమల్లోకి వచ్చిన కొత్త సడలింపులు
- రాత్రి 9 గంటల వరకు దుకాణాలు
అడయార్(చెన్నై): రాష్ట్రంలో కొత్త సడలింపులు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. కొత్త సడలింపుల్లో ప్రధానమైన అంశం తమిళనాడు - పుదుచ్చేరి రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి ఇవ్వడం. ముఖ్యంగా చెన్నై కోయంబేడు బస్టాండ్ నుంచి పుదుచ్చేరి సోమవారం ఉదయం నుంచి బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. దాదాపు రెండు నెలల తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య అంతరాష్ట్ర బస్సులు నడవడం మొదలుపెట్టాయి. అదేవిధంగా ఇతర జిల్లాల నుంచి పుదుచ్చేరి బస్సులు నడవడం ప్రారంభించాయి. అయితే, ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రైవేటు బస్సుల రాకపోకలతో పాటు కర్నాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల మధ్య కూడా అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అదేసమయంలో రాష్ట్రంలో అన్ని రకాల దుకాణాలను రాత్రి 9 గంటల వరకు తెరిచివుంచేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సోమవారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈనెల 19వ తేదీ వరకు తెరిచివుంచనున్నారు. ఇప్పటివరకు రాత్రి 8 గంటల వరకు మాత్రమే తెరిచివుంచే అవకాశం వుండేది. అదేవిధంగా హోటల్స్, టీ దుకాణాలు కూడా రాత్రి 9 గంటల వరకు తెరిచివుంచొచ్చు. అయితే ప్రభుత్వం విధించిన కరోనా నింబంధనలను తూ.చ. తప్పకుండా పాటించాల్సివుంది. ఒకే సమయంలో అధిక సంఖ్యలో కస్టమర్లను అనుమతించకూడదు. కేవలం 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలి. అదేవిధంగా చెన్నై నగరంలో మెట్రో రైల్ సర్వీసులు ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడిచేందుకు కూడా అనుమతి ఇచ్చారు.
తిరుచ్చెందూరుకు పోటెత్తిన భక్తులు
మరోవైపు కరోనా ఆంక్షల సడలింపు నేపథ్యంలో తిరుచ్చెందూరు మురుగన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇక్కడకు ఆదివారం నుంచే భక్తులు అధిక సంఖ్యలో రావడం మొదలుపెట్టారు. భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో పలు ప్రాంతాల్లో వాహనరాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో గంటల కొద్దీ ట్రాఫిక్ స్తంభించిపోయింది.