పరారీలో సుశీల్ హరి స్కూల్ టీచర్లు
ABN , First Publish Date - 2021-07-18T13:24:35+05:30 IST
లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకుని జైలుపాలైన ఆధ్యాత్మిక గురువు శివశంకర్ బాబా సారథ్యంలోని సుశీల్ హరి ఇంటర్నేషనల్ పాఠశాలకు చెందిన ఐదుగురు టీచర్లు తమ ఇళ్ళకు తాళా

అడయార్(చెన్నై): లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకుని జైలుపాలైన ఆధ్యాత్మిక గురువు శివశంకర్ బాబా సారథ్యంలోని సుశీల్ హరి ఇంటర్నేషనల్ పాఠశాలకు చెందిన ఐదుగురు టీచర్లు తమ ఇళ్ళకు తాళాలు వేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సుశీల్ హరి పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థినుల పట్ల శివశంకర్ బాబా అసభ్యంగా నడుచుకున్నట్టు, వారికి అసభ్యకర రీతిలో ఈమెయిల్స్ పంపించినట్టు సీబీసీఐడీ పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే. పైగా శివశంకర్ బాబాకు పాఠశాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులు సహకరించినట్టు తేలింది. దీంతో ఇప్పటికే ముగ్గురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుతో సంబంధం ఉన్నట్టుగా భావిస్తున్న మరో ఐదుగురు టీచర్లను పిలిచి విచారించాలని సీబీసీఐడీ పోలీసులు భావించారు. అయితే, ఆ ఐదుగురు టీచర్లు తమ గృహాలకు తాళం వేసి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న సీబీసీఐడీ పోలీసులు వారి ఇళ్ళకు నోటీసులు అంటించి, ఈనెల 19వ తేదీన విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.