వరి మంటలు!

ABN , First Publish Date - 2021-09-15T09:37:33+05:30 IST

చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వరి దిగుబడులు సాధించిన తెలంగాణ పంజాబ్‌ను తలదన్ని దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని ఇటీవల సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

వరి మంటలు!

  • ఇప్పటి వరకూ వరికి ప్రోత్సాహం..
  • ఇప్పుడు వద్దంటూ నిరుత్సాహంసర్కారు తీరుపై రైతుల్లో ఆందోళన
  • ప్రతిపక్షాల విమర్శలతో రాజకీయ కాక
  • ప్రభుత్వ ప్రత్యామ్నాయాలకు మద్దతు ఏదీ!?
  • ఆయిల్‌ పామ్‌ వేస్తే అప్పుడు పరిస్థితి ఏంటీ?
  • ప్రభుత్వం హామీ ఇవ్వాలని నిపుణుల సూచన
  • విదేశాలకు రవాణాతో సమస్యలకు పరిష్కారం
  • కానీ, అదనపు భారంతో మిల్లర్ల కుదేలు
  • ఇన్సెంటివ్‌ ఇవ్వాలని సర్కారుకు ప్రతిపాదన
  • మక్కల్లా టెండర్ల ద్వారా అమ్మాలని డిమాండ్‌
  • జనవరిలోనే ప్రభుత్వానికి డీపీఆర్‌ సమర్పణ
  • పంజాబ్‌కు లేని ఆంక్షలు తెలంగాణకా?
  • బాయిల్డ్‌ బియ్యం కొనాల్సిందే: గంగుల 


ఉప్పుడు బియ్యాన్ని కొనేది లేదని కేంద్రం తెగేసి చెప్పిన దరిమిలా వచ్చే యాసంగి నుంచి వరి పంట వేయడం అంటే రైతులు ఉరి వేసుకోవడమే! ప్రత్యామ్నాయ పంటలు వేస్తేనే రైతులకు లాభాలు.


సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన భేటీలో వ్యక్తమైన అభిప్రాయం కేంద్రం దొడ్డు వడ్లు కొనబోమని చెబుతోంది. రైతులు ఓవైపు నిరసనలు తెలుపుతూనే ఆయిల్‌పామ్‌, పత్తి, వేరుశనగ, చీనీ తోటల వైపు మళ్లాలి.

గద్వాలలో మంత్రి కేటీఆర్‌ 


వరి వేస్తే ఉరే అంటూ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఐదుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 

అవి సీఎం చేసిన హత్యలే.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌


ఆఖరి గింజ వరకూ ధాన్యం కొంటామని చెప్పిన సీఎం ఇప్పుడు వరి వద్దని ఎలా అంటున్నారు? 

వరి పండించకపోతే లక్షల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులు ఎందుకు!?

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో వరి దిగుబడులు సాధించిన తెలంగాణ పంజాబ్‌ను తలదన్ని దేశంలోనే సరికొత్త రికార్డు సృష్టించిందని ఇటీవల సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇందుకు కారణం తమ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు.. రైతు బంధు వంటి తమ ప్రభుత్వ విధానాలని చెప్పారు. అదే సమయంలో వరి వేస్తే ఉరేనని, ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాలని ప్రభుత్వం రైతులకు పదే పదే సూచిస్తోంది. ఉప్పుడు బియ్యం కొనేది లేదని కేంద్రం తెగేసి చెబుతోందని, ప్రస్తుత సమస్యకు కేంద్రమే కారణమని స్పష్టం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆందోళనలు చేయాలని కూడా పిలుపునిస్తోంది. దీంతో, ఈ అంశం ఇప్పుడు రాజకీయంగా కాక రేపుతోంది. రైతుల్లో ఆందోళనకారకమైంది. ప్రభుత్వ వ్యవసాయ విధానాలపై ప్రశ్నలను రేపుతోంది. ప్రభుత్వ లీకులు, ప్రకటనలపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని చెబుతున్న ప్రభుత్వం.. తమ ఎదుట ఉన్న ప్రత్యామ్నాయాలను మాత్రం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నాయి.


ఇప్పుడు కూడా ఆరు తడి పంటలే సాగు చేసుకుంటే.. ఇక లక్షల కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు కట్టి ఉపయోగం ఏమిటని నిలదీస్తున్నాయి. నిజానికి, వరి సాగు విస్తీర్ణం రాష్ట్రంలో అసాధారణ స్థాయిలో పెరిగిపోయింది. రెండు పంటలు కలిపి ఏడాదికి కోటి ఎకరాలకు పైగా వరి సాగవుతోంది. సుమారు 2.75 కోట్ల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది. గతంలో వానాకాలం వరి సాధారణ విస్తీర్ణం 22-23 లక్షల ఎకరాలుగా ఉండేది. గత ఏడాదికి వచ్చేసరికి 53.34 లక్షల ఎకరాలకు పెరిగింది. యాసంగి విస్తీర్ణం కూడా కనీవినీ ఎరుగని రీతిలో 52.79 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంది. 


ఇందుకు కారణం లేకపోలేదు. గోదావరి జిల్లాల తరహాలో తెలంగాణ అన్నపూర్ణ కావాలన్న ఉద్దేశంతో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రైతుకు, వ్యవసాయానికి పెద్దపీట వేసింది. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. దీనితో నీటి లభ్యత భారీగా పెరిగింది. గతంలో బీడు పడిన భూముల్లోనూ ఇప్పుడు పంటలు పండుతున్నాయి. ఎనిమిది గంటల బదులు 24 గంటలపాటు నిరంతరాయంగా, ఉచిత విద్యుత్తు ఇస్తోంది. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుతున్నాయి. రైతు బంధు కింద రైతుకు పెట్టుబడి సాయం చేస్తోంది. వీటికితోడు, పౌర సరఫరాల సంస్థను నోడల్‌ ఏజెన్సీగా నియమించి, ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తోంది. ఎమ్మెస్పీకి గ్యారెంటీ ఉండడం; ఇంటి ముంగిటకు వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుండడంతో రైతులకు మార్కెటింగ్‌ సమస్య లేకుండాపోయింది. దాంతో, రైతులంతా వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. సాగు విస్తీర్ణం అసాధారణంగా పెరగడానికి కారణమిదే. ఈ నేపథ్యంలోనే, వరికి బదులు ప్రత్యామ్నాయాలకు మళ్లాలని సూచిస్తుండడంతో ఆందోళన నెలకొంటోంది.


ఆ పంటలకు మద్దతు ఏదీ!?

భారతదేశం నూనెలను పెద్దఎత్తున దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, ఆయిల్‌ పామ్‌, నూనె గింజల సాగుకు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉందని, వాటిని పండించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఇది నూటికి నూరు శాతం నిజమే. కానీ, ఆయిల్‌ పామ్‌ను పెద్దఎత్తున సాగు చేస్తే నూనె తీయడానికి మిల్లుల్లేవు. వాటికి మద్దతు ధర ఎంత ఉంటుందో తెలియదు. దీనికితోడు, ఈ సాగు చేస్తే మూడేళ్లపాటు రైతుకు ఆదాయం ఉండదు. ఆ తర్వాత కూడా పరిస్థితి అనిశ్చితే. పంట చేతికి వచ్చిన తర్వాత మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నుంచి హామీ రావడం లేదు. దాంతో, రైతులు ఆయిల్‌ పామ్‌కు మళ్లడానికి సంశయిస్తున్నారు. ఇక, శనగలు, వేరు శనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు వంటి పంటలను పెద్దఎత్తున సాగు చేస్తే.. మద్దతు ధర లభించే అంశంపైనా స్పష్టత లేదు. వీటిలో, కొన్నిటికి కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తోంది. కొన్నిటికి లేదు. కేంద్రం మద్దతు ధర ప్రకటించని పంటలకు ఏపీ వంటి కొన్ని రాష్ట్రాలు సొంతంగా మద్దతు ధర ప్రకటిస్తున్నాయి. కానీ, రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు. దీంతో, వాటి సాగుకు రైతులు మొగ్గు చూపడం లేదు.


ఉదాహరణకు, పప్పుధాన్యాల సాధారణ సాగు విస్తీర్ణం గతంలో 3 లక్షల ఎకరాలు ఉంటే... గత యాసంగిలో 4.59 లక్షల ఎకరాలకు పెరిగింది. నూనె గింజల సాగు విస్తీర్ణం కేవలం 3.72 లక్షల ఎకరాలే ఉంది. ఇటీవల చిరుధాన్యాల (కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, జొన్నలు) వినియోగం, డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. కానీ, జొన్నలు, సజ్జలు మినహా ఇతర మిల్లెట్స్‌ సాగు విస్తీర్ణం రాష్ట్రంలో వేయి ఎకరాలు కూడా లేదు. ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వం సూచించే పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని, పంట ఉత్పత్తుల కొనుగోలుకు (ప్రొక్యూర్‌మెంట్‌) రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలని వ్యవసాయ రంగ నిపుణులు సూచిస్తున్నారు. రైతులకు ప్రోత్సాహకాలు, మార్కెట్‌ సెక్యూరిటీ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పంటల బీమాకు ధీమా లేకపోవడమూ సమస్యేనని నిపుణులు చెబుతున్నారు. నిర్దిష్ట విధానాలతో రాష్ట్రంలో పంటల బీమాను అమలు చేయాలని సూచిస్తున్నారు. ధరల ఆటుపోట్ల సమస్య పరిష్కారానికి ధరల స్థిరీకరణ నిధి ఉండాలని డిమాండ్‌ చేస్తున్నారు. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగుకు రాష్ట్రంలో అనుకూల వాతావరణ ఉండటంతో వీటి సాగు పెంచితే మేలని చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు ఇలాంటి పద్ధతినే అవలంభిస్తున్నారు. పంజాబ్‌, మధ్య ప్రదేశ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ తదితర రాష్ట్రాల్లో యాసంగి సీజన్‌లో గోధుమలు పండిస్తారు. వానాకాలంలో వరి వేస్తారు. ఫలితంగా, ఆయా రాష్ట్రాల్లో వరి ధాన్యంతో సమస్యలు రావటం లేదు. మార్కెట్‌ స్థిరంగా ఉంటోంది.


ఉప్పుడు సమస్య ఎవరిది!?

రాష్ట్రంలో ఈ ఏడాది 2.75 కోట్ల మెట్రిక్‌ టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా. ఇందులో రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలకు ఏడాదికి 80 లక్షల టన్నుల ధాన్యం అవసరం. మరో 45 లక్షల టన్నుల ధాన్యం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతాయి. మిగిలిన ధాన్యాన్ని గతంలో ఎఫ్‌సీఐ సేకరించేది. ఇందుకు గతంలో ఎలాంటి చిక్కులు ఉండేవి కావు. ఏ బియ్యమిచ్చినా, ఎంత పరిమాణంలో ఇచ్చినా... ఎఫ్‌సీఐ ఏనాడు నిరాకరించలేదు. నిరుడు వానాకాలంలో ఎఫ్‌సీఐ సేకరించిన బియ్యంలో 63 శాతం వాటాను తెలంగాణ రాష్ట్రమే భర్తీ చేసింది. యాసంగికి వచ్చేసరికి బాయిల్డ్‌ రైస్‌ వద్దని, రా రైస్‌ కావాలని మెలిక పెట్టింది. ఇందుకు కారణం బాయిల్డ్‌ రైస్‌ నిల్వలు దేశవ్యాప్తంగా పెరిగిపోవటం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బాయిల్డ్‌ రైస్‌ వినియోగం తగ్గటం! దాంతో, తెలంగాణ నుంచి ఆయా రాష్ట్రాలకు బాయిల్డ్‌ రైస్‌ పంపించే అవకాశం ఉండట్లేదు. గతంలో నెలకు 6 లక్షల టన్నుల బాయిల్డ్‌ రైస్‌ తెలంగాణ నుంచి తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపించేవారు.


ఇప్పుడక్కడ డిమాండ్‌ తగ్గటంతోఎ్‌ఫసీఐ ఉప్పుడు బియ్యాన్ని నిరాకరిస్తోంది. వానా కాలంలో ఉత్పత్తయ్యే 1.25 కోట్ల టన్నులను మిల్లర్లు పచ్చి బియ్యంగానే ఇస్తుండడంతో సమస్య రావడం లేదు. యాసంగిలో ఉత్పత్తయ్యే ధాన్యాన్ని ఉప్పుడు బియ్యంగా మారుస్తున్నారు. ఈ ధాన్యాన్ని పచ్చి బియ్యంగా మార్చాలా? ఉప్పుడు బియ్యంగా మార్చాలా? అనేది రైస్‌మిల్లర్లకు సంబంధించిన అంశమని, రైతులకు ఈ సమస్యతో సంబంధంలేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ సమస్యను రైతులకే ముడిపెడుతోంది.


సబ్సిడీపై ధాన్యం కేటాయింపులు చేస్తే మేలు

మక్కలు తరహాలోనే తమకు సబ్సిడీపై ధాన్యం కేటాయించాలని మిల్లర్లు కోరుతున్నారు. రైతుల మద్దతు ఽధరకు గండి పడకుండా మరో ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. యాసంగిలో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో ఎఫ్‌సీఐ కొనుగోలు చేసేది పోగా.. మిగిలిన ధాన్యాన్ని సబ్సిడీపై రైస్‌ మిల్లర్లకు అప్పగించాలని కోరుతున్నారు. మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్‌ ఎమ్మెస్పీకి కొనుగోలు చేసి... పౌలీ్ట్ర పరిశ్రమకు టెండర్ల ద్వారా సబ్సిడీ ధరకు అప్పగిస్తున్నట్లు రైస్‌మిల్‌ ఇండస్ట్రీకి కూడా రాయితీపై ధాన్యాన్ని అప్పగించాలని కోరుతున్నారు. ఎమ్మెస్పీ కంటే రూ.200- రూ.300 తక్కువ ధరకు ధాన్యం లభిస్తే తమకు గిట్టుబాటు అవుతుందని, మిల్లింగ్‌ చేసి విదేశాలకు ఎగుమతి చేస్తామని రైస్‌ మిల్లర్లు చెబుతున్నారు. ఈ పద్ధతిలో చేస్తే ప్రభుత్వం తక్కువ ఆర్థిక భారంతో ప్రొక్యూర్‌మెంట్‌ నుంచి బయటపడుతుందని, ఎఫ్‌సీఐ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని, వడ్డీ భారం మోయాల్సిన పనిలేదని, కేంద్రాన్ని ప్రాధేయపడాల్సిన అవసరం ఉండదని వివరిస్తున్నారు.


ఎగుమతులను ప్రోత్సహించాలి

సాగునీటి వనరులు, ఉచిత విద్యుత్‌ కారణంగా వరి సాగు, ధాన్యం ఉత్పత్తి పెరిగింది. రాష్ట్ర ప్రజల ఆహార అవసరాలు, ఎఫ్‌సీఐ అవసరాలు పోగా ఏడాదికి కోటిన్నర టన్నుల ధాన్యం మిగులుతోంది. బియ్యం ఎగుమతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ సమస్యకు చెక్‌ పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్‌ ధరలకు, రాష్ట్రంలో ఉన్న ధరలతో పోలిస్తే రూ.300-400 తేడా వస్తోంది. ఈ నష్టాన్ని ఇన్సెంటివ్‌ రూపంలో ప్రభుత్వం భర్తీ చేస్తే ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయి. ఎగుమతిదారులను ప్రోత్సహిస్తే బాయిల్డ్‌ రైస్‌ సమస్య తీరుతుంది.

జి. నాగేందర్‌, రైస్‌ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు


టెండర్ల ద్వారా మిల్లర్లకు ఇవ్వాలి 

ఎమ్మెస్పీకి ధాన్యం కొనుగోలు చేసి, మిల్లింగ్‌ చేసి విదేశాలకు బియ్యం ఎగుమతి చేస్తే నష్టాలు వస్తున్నాయి. ఎగుమతులను ప్రోత్సహించాలంటే రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని టెండర్లు పెట్టి మిల్లర్లకు విక్రయించాలి. పౌలీ్ట్ర పరిశ్రమకు మక్కలు సబ్సిడీపై ఇచ్చినట్లు, రైస్‌ మిల్‌ ఇండస్ట్రీకి ధాన్యాన్ని సబ్సిడీపై ఇవ్వాలి. అప్పుడు రైతులకు ఎమ్మెస్పీ లభిస్తుంది. రైస్‌మిల్‌ ఇండస్ట్రీ బాగుపడుతుంది.

ధన్‌పాల్‌ దత్తాత్రి, బియ్యం ఎగుమతిదారుడు, నిజామాబాద్‌


ఎమ్మెస్పీ ప్రకటించి ప్రభుత్వమే సేకరించాలి

ఎమ్మెస్పీకి గ్యారెంటీ ఉండటం, ప్రభుత్వం కొనుగోలు చేస్తుండటంతోనే రైతులు వరి సాగు ఎక్కువగా చేస్తున్నారు. ప్రభుత్వం సూచించే ప్రత్యామ్నాయ పంటలకూ ఎమ్మెస్పీ గ్యారెంటీ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం ఎమ్మెస్పీ ఇచ్చినా, ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. కర్ణాటకలో మిల్లెట్స్‌ సాగు ప్రోత్సహిచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం రాగులకు రూ.2 వేల మద్దతు ధరను ప్రకటించింది. అదే తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా పప్పుధాన్యాలు, నూనె గింజలు, చిరు ధాన్యాలకు ఎమ్మెస్పీ ప్రకటించాలి. మార్కెట్లో డిమాండ్‌ ఉంటే పరవాలేదు. ఒకవేళ ధరలు తక్కువగా ఉంటే ప్రభుత్వమే సేకరిస్తుందనే హామీ ఉండాలి. మార్కెట్‌ భద్రత ఉంటే రైతులు పంటల మార్పిడికి ముందుకు వస్తారు.

దొంతి నరసింహారెడ్డి, వ్యవసాయరంగ నిపుణులు


ప్రాసెసింగ్‌ చేస్తే మేలు

రాష్ట్రంలో పండించిన పంటలను నేరుగా మార్కెటింగ్‌ చేస్తే వచ్చే లాభం చాలా తక్కువ. అదే వాటిని ప్రాసెసింగ్‌ చేసి విక్రయిస్తే ఎక్కువ లాభం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాసెసింగ్‌, ఎగుమతులపై దృష్టిసారించాలి. పసుపు, మొక్కజొన్న, సోయాబీన్‌, పత్తి, మిర్చి తదితర పంటల ఉత్పత్తికి, ఉప ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది.

పెద్దిరెడ్డి చెంగల్‌ రెడ్డి, రైతు సంఘాల సమాఖ్య సలహాదారుడు


ఎగుమతులకు చాన్సేదీ!?

ఎఫ్‌సీఐ డిమాండ్‌కు అనుగుణంగా బియ్యం ఇవ్వాలంటే వానాకాలంలో పండించిన వరి పంటతోనే సాఽధ్యపడుతుంది. ఈ పరిస్థితుల్లో యాసంగి బియ్యాన్ని ఏం చేయాలో తోచక రాష్ట్ర ప్రభుత్వం వరి సాగు చేయొద్దని చెబుతోంది. కేవలం ఎఫ్‌సీఐపై ఆధారపడకుండా... బియ్యం ఎగుమతులను ప్రోత్సహిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని వ్యవసాయరంగ నిపుణులు, రైస్‌ మిల్లర్లు చెబుతున్నారు. నాన్‌ బాస్మతి రైస్‌ (6 మి.మీ పొడవుండే సన్న బియ్యం)కు విదేశాల్లో మంచి డిమాండ్‌ ఉంది. కానీ, వీటి గత ఐదేళ్లుగా వీటి ఎగుమతుల్లో తెలంగాణ వాటా 0.5 శాతం కంటే తక్కువే. బియ్యం ఎగుమతులపై దేశంలో ఎలాంటి ఆంక్షలు లేవు. బాయిల్డ్‌ రైస్‌కు దక్షిణాఫ్రికా, మస్కట్‌, ఖతార్‌, దుబాయి, బహ్రెయిన్‌, బంగ్లాదేశ్‌ తదితర దేశాల్లో డిమాండ్‌ ఉంది. ఏడాదికి తెలంగాణ నుంచి 5-6 లక్షల టన్నులు, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 3-4 లక్షల టన్నుల బియ్యం ఎగుమతి అవుతున్నాయి. ఎగుమతుల్లో 75ు దక్షిణాఫ్రికా, 25 శాతం గల్ఫ్‌ దేశాలకు పోతున్నాయి. కృష్ణపట్నం, కాకినాడ, వైజాగ్‌, ముంబ యి ఓడరేవుల వద్ద క్వింటా బియ్యం డెలివరీ రేటు లోడింగ్‌ (ఫూట్‌ ఆన్‌ బోట్‌)తో కలిపి రూ.2,650 ఉంది. రైస్‌మిల్‌ రేటు రూ.2,350 ఉంది. ఇతర ఖర్చులు కలిపితే రూ.300 నుంచి రూ.400 వరకు ఎగుమతిదారునిపై అదనపు భారం పడుతోంది.


ఈ భారాన్ని ప్రభు త్వం ఇన్సెంటివ్‌ రూపంలో ఇవ్వాలని బియ్యం ఎగుమతిదారుల అసోసియేషన్‌ గత జనవరిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వరి సేకరణ కారణంగా గడిచిన ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3,995 కోట్ల నష్టం వచ్చిన అంశాన్ని ప్రస్తావించింది. తెలంగాణ, ఏపీల్లో యాసంగి ధాన్యాన్ని కొనుగోలు చేసి, విదేశాలకు ఎగుమతి చేయటానికి సిద్ధంగా ఉన్నామని, క్వింటాలుకు రూ.300-.400 చొప్పున పడుతున్న అదనపు భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఇన్సెంటివ్‌’ రూపంలో ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతోంది.

Updated Date - 2021-09-15T09:37:33+05:30 IST