94 ఏళ్ల క్రితమే చీరకట్టుతో విమానం నడిపిన భారతీయ వనిత!

ABN , First Publish Date - 2020-03-08T14:26:44+05:30 IST

ప్రస్తుత యుగంలో మహిళలు అన్నిరంగాలలోనూ మగవారితో సమానంగా రాణిస్తున్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

94 ఏళ్ల క్రితమే చీరకట్టుతో విమానం నడిపిన భారతీయ వనిత!

న్యూఢిల్లీ: ప్రస్తుత యుగంలో మహిళలు అన్నిరంగాలలోనూ మగవారితో సమానంగా రాణిస్తున్నారు. ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉన్నత  శిఖరాలను అధిరోహించిన మహిళలను గుర్తుచేసుకుంటున్నారు. అలాంటి మహిళలో ఒకరే శరళా ఠక్రాల్. ఆమె సుమారు 94 ఏళ్ల క్రితం 1936లో విమానాన్ని నడిపి, మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఆమె చీరకట్టుతో విమానాన్ని నడిపారు. శరళ 1914లో ఢిల్లీలో జన్మించారు.


1936లో దేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాని సమయంలో ఆమె తొలి భారతీయ మహిళా పైలెట్ అయ్యారు. ఆ సమయంలో ఆమె నడిపిన విమానం పేరు ‘జిప్సీ మాథ్’. అది అప్పట్లో ఎంతో అభివృద్ధి చెందిన విమానం. ఆమె సహ పైలెట్ లేకుండా ఈ విమానాన్ని నడిపారు. అయితే ఆ సమయంలో ఆమెకు నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. శరళకు 16 ఏళ్ల వయసులోనే పీడీ శర్మతో వివాహమయ్యింది. అప్పట్లో పీడీ శర్మ కూడా పైలెట్‌గా ఉండేవారు. శర్మ ప్రోత్సాహంతోనే ఆమె పైలెట్‌గా శిక్షణ పొందారు. వెయ్యి గంటలపాటు విమానాన్ని నడిపి ‘ఏ’ లైసెన్స్ పొందిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతిగాంచారు. ఒక విమాన ప్రమాదంలో భర్త మరణించాక శరళ తాను మంచి పైలెట్‌గా మారాలనుకున్న కలను విడిచిపెట్టారు. తరువాత ‘మెయో స్కూల్ ఆఫ్ ఆర్ట్’లో చేరి పెయిటింగ్, ఫైన్ ఆర్ట్స్ డిప్లమో కోర్సు చేశారు. దేశ విభజన అనంతరం ఆమె తన ఇద్దరు కుమార్తెలతో పాటు ఢిల్లీలో స్థిరపడ్డారు. 1948లో పీపీ ఠక్రాల్‌ను వివాహం చేసుకున్నారు. 2008లో ఆమె కన్నుమూశారు.

Updated Date - 2020-03-08T14:26:44+05:30 IST