అపూర్వ సహోదరులు రాజన్ నాగేంద్ర
ABN , First Publish Date - 2020-10-18T06:00:52+05:30 IST
కర్పూర వీణలు కస్తూరి వీణలు కవుల ఊహాగానాలకు పల్లవులు. రాజన్- నాగేంద్ర సంగీతం అమ్మవారి సారణి వీణ

రాజన్-నాగేంద్రలను తలచుకోని నా సినీజీవిత గీతం నిస్వరం, నీరసం. ఈ కన్నడాంధ్ర సోదరులిద్దరూ సంగీత సరస్వతికి రెండు కళ్లు. అందులో చిన్నవారు నాగేంద్ర మన మధ్య ఈనాడు లేరు. కానీ ఆయన చేసిన బాణీలు నేపథ్యం వాద్యవాణీలు చిరంజీవులు.
కర్పూర వీణలు కస్తూరి వీణలు కవుల ఊహాగానాలకు పల్లవులు. రాజన్- నాగేంద్ర సంగీతం అమ్మవారి సారణి వీణ ఝంకారంతో ఓంకార స్వరంగా నినదించింది. వారి రాగాలలో ఆరు రుతువులూ ఉయ్యాలలూగాయి. కృష్ణా తరంగాలు, కిన్నెరసానులు నాట్యం చేశాయి. వాయులీనాలుగా, కంకరరాలను సైతం తేనెవెన్నెల లేహ్యాలతో అనునయించిన లలిత లావణ్య బాణీలవి.
సినీ కవులకు నంది పురస్కారాలు ప్రకటించిన తరువాత తొలి పురస్కారం నాకు తెచ్చిపెట్టింది వారికి నేను రాసిన ‘మానస వీణా మధుగీతం మన సంసారం సంగీతం’ గీతం. రసహృదయులు నవతా కృష్ణంరాజు గారు నిర్మించిన ‘పంతులమ్మ’ చిత్రంలోనిదీ పాట. ఆ పాట నాడు ఎంతగానో ఆదరణ చూరగొన్నది. ఎంవీఎల్ వంటి విజ్ఞులు ఆ పాటను అక్షరాలు ఆరాధించడం, వివిధ పత్రికల్లో రాయడం జరిగింది. అందులో ‘కురిసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమని... తడిసే దాకా అనుకోలేదు తీరని దాహమని’ వంటి చరణాలు వాటి చుట్టూ అలుముకున్న వర్ష గీతావరణం వారికే చెల్లింది.
వాద్య హృదయభాషకు మధురిమలు హత్తిని మెత్తని సరిగములు వారివి. ‘పంతులమ్మ’ చిత్రం ఆనాడు ‘పాటలమ్మ’గా పేరు తెచ్చుకుంది. అందులో ప్రతి పాటా రాగభావాల పూలబాట. అందుకు నిదర్శనాలు... ‘పండగంటి ఎన్నెలంతా సెందరయ్యా దండగైపోయింది సెందెరయ్యా’, ‘ఎడారిలో కోయిలా తెల్లారని రేయిలా’, ‘మనసెరిగినవాడు మా దేవుడు’ తదితర గీతాలు.
దురితమైన స్వరము, దూకుడైన నడక ఏనాడూ వారి స్వర సంప్రదాయంలో కానవచ్చేవి కావు. ఆ సోదరులిద్దరి జీవన విధానం, మాటవరస అందుకు తగినట్లే ఉండేవి. వారి కంపోజింగ్ గది ప్రార్థనా మందిరంలా ఏకాగ్రతకు నిలయంగా భాసించేది. మంత్రాలయ రాఘవేంద్రస్వామి ధ్యానం వారి ప్రథమ ప్రాణం. శ్రుతిలయలు స్వరపదాలు మిగిలిన వారి నాలుగు ప్రాణాలు. పరిమళాచార్యుని ద్వైత సంప్రదాయ పరిమళాలు వెదజల్లే అగరువత్తుల ధూమగంధాలతో ‘సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదే’ అన్న త్యాగరాజ స్వామి కీర్తన రూపుదాల్చినట్లు ఉండేది వారి స్వర కల్పనా ప్రాంగణం.
‘నాగమల్లి, నాలుగు స్తంభాలాట, మూడుముళ్లు, ఇంటింటి రామాయణం, సొమ్మొకడిది సోకొకడిది, వయ్యారి భామలు వగలమారి భర్తలు, అ ఆ ఇ ఈ, మంచుపల్లకి’ వంటి చిత్రాలు సంగీత రంజితాలు కావడానికి రాజన్-నాగేంద్రల తపశ్శక్తి ప్రధాన కారణం. ఆ చిత్రాల్లో సంగీత సాహిత్యాల ఏకత్వం అద్వైత సిద్ధికి ప్రబల నిదర్శనం. అంతటిదీ ఆ స్వరపదసంధానం. అందుకు మూల కారకులు దర్శకులు జంధ్యాల, సింగీతం శ్రీనివాసరావు. కథ, సన్నివేశాలు సజీవమైతే పాటలూ పది కాలాలలపాటు నిలిచి ఉంటాయి.
నైమిశారణ్యాలలో, గంధమాదన పర్వాతాలలో, చిరపుంజి చినుకులలో, సుందర వన సాగరతీరాలలో, మలయానిలాలలో వీచే పవన పరిమళాలు రాజన్ నాగేంద్రల సుస్వరాలు. అవి వాతావరణ కాలుష్య జనితాలు కావు. అతీతమైనవి అతి మధురమైనవి.
‘అల్లో నేరేడు పళ్లు అమ్మాయి కళ్లు’ అంటూ అల్లరి పాట చేసినా, రాగవల్లరిగా తీర్చిదిద్దిన సుకుమారులు రాజన్-నాగేంద్ర. ‘కాస్తందుకో దరకాస్తందుకో ప్రేమ దరకాస్తందుకో’ అనే మనవిని మధురంగా పలికించిన జంటకవులు వారు. అన్నిటికీ మించి ఆప్తమిత్రులు, ఆత్మసాక్షులు ఈ అపూర్వ సహోదరులు.
(ప్రముఖ గీత రచయిత వేటూరి సుందరరామమూర్తి ‘కొమ్మకొమ్మకో సన్నాయి’ పుస్తకం నుంచి)