రూ.475 కోట్లతో ప్రభుత్వ మదనపల్లె వైద్య కళాశాల
ABN , First Publish Date - 2021-05-30T05:41:11+05:30 IST
రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల మదనపల్లె మండలంలో నిర్మించనున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మిస్తున్న ఈ కళాశాల నిర్మాణానికి ఈనెల 31న వర్చువల్ విధానంలో సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు.

30 నెలల్లో నిర్మాణం పూర్తి
శంకుస్థాపన ఏర్పాట్లను పరిశీలించిన జేసీ
మదనపల్లె టౌన్, మే 29: రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గానికి మంజూరైన ప్రభుత్వ వైద్య కళాశాల మదనపల్లె మండలంలో నిర్మించనున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నిర్మిస్తున్న ఈ కళాశాల నిర్మాణానికి ఈనెల 31న వర్చువల్ విధానంలో సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. మదనపల్లె మండలం ఆరోగ్యవరం వద్ద 95.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ప్రభుత్వ వైద్యకళాశాలకు రూ.475 కోట్ల నిధులు కేటాయించారు.. ఏపీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో 13.31 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ భవనాల నిర్మాణాలను 30 నెలల్లో పూర్తి చేయనున్నారు.
మెడికల్ కళాశాలలో నిర్మించనున్న భవనాలు
మెడికల్ కళాశాల, టీచింగ్ హాస్పిటల్, రెసిడెన్షియల్ స్టాఫ్(టీచింగ్, నాన్ టీచింగ్) క్వార్టర్స్, మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు హాస్టళ్లు, జూనియర్, సీనియర్ రెసిడెంట్స్ హాస్టల్, నర్సింగ్ కళాశాల, నర్సింగ్ విద్యార్థుల హాస్టల్, వర్కింగ్ స్టాఫ్ నర్సుల క్వార్టర్స్, బయో మెడికల్ వేస్ట్ ప్లాంట్, సెంట్రల్ కిచెన్, డైనింగ్ హాల్, మార్చురీ, సెంట్రల్ డ్రగ్ స్టోర్, ఎంజీపీఎస్ ప్లాంట్‌రూం, లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ నిర్మించనున్నారు. వీటితో పాటు తరగతి గదులు, లాబొరేటరీలు, లైబ్రరీ, విశాలమైన లెక్చర్, పరీక్ష హాల్లు నిర్మించనున్నారు. భవిష్యత్‌లో తృతీయ నుంచి ఫైనలియర్ విద్యార్థులకు కూడా హాస్టళ్లను నిర్మిస్తారు.
మెడికల్ కళాశాలతోఅందనున్న వైద్యం
మదనపల్లె మెడికల్ కళాశాల పూరైతే పడమటి మండలాల ప్రజలకు అన్ని రకాల వైద్యం అందుబాటులోకి రానుంది. ఈ కళాశాలలో జనరల్ మెడిసన్ పడకలు 100, జనరల్ సర్జరీ పడకలు 100 పడకలు, చిన్నపిల్లల వార్డులో 60 పడకలు, ఎముకలు కీళ్లు విభాగంలో 50 పడకలు, కంటి విభాగంలో 10 పడకలు, టీబీ విభాగంలో 10, మానసిక వ్యాధిగ్రస్థుల చికిత్సకు 10 పడకలు అందుబాటులో ఉంటాయి. ఈ పడకల్లో రోగులకు చికిత్సలందించేందుకు సరిపడ ప్రొఫెసర్లు, వైద్యసిబ్బంది నియామకం కానున్నారు.
ఏర్పాట్ల పరిశీలన
ఈనెల 31వ తేది వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టనున్న నేపథ్యంలో ఆరోగ్యవరం వద్ద మెడికల్ సెంటర్ మైదానంలో ఏర్పాటు చేసిన టెంట్లను శనివారం జేసీ వీరబ్రహ్మం పరిశీలించారు. కార్యక్రమం సందర్భంగా ప్రొజెక్టర్, వీడియో, ఆడియో పరికరాల్లో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సబ్‌కలెక్టర్ జాహ్నవి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ ధనుంజయ రెడ్డి, డీఈ రమేష్, తహసీల్దార్ కుప్పుస్వామి తదితరులు పాల్గొన్నారు.