Share News

Chandra Babu: కార్యకర్తలను చూస్తే కొండంత ధైర్యం

ABN , Publish Date - Mar 02 , 2025 | 02:26 AM

‘కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది. 8 నెలలుగా పాలనలో నిమగ్నమై పార్టీ శ్రేణులతో సమావేశం కాలేకపోయా. మళ్లీ కుటుంబ సమానులైన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.

Chandra Babu: కార్యకర్తలను చూస్తే కొండంత ధైర్యం
ప్రజావేదిక గ్రామసభకు హాజరైన జనం, టీడీపీ నేతలు, కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు

కార్యకర్తలకు ఎమ్మెల్యేలు, ఎంపీలు అందుబాటులో ఉండాలి

గంగాధరనెల్లూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ‘కార్యకర్తలను చూస్తే నాకు కొండంత ధైర్యం వస్తుంది. 8 నెలలుగా పాలనలో నిమగ్నమై పార్టీ శ్రేణులతో సమావేశం కాలేకపోయా. మళ్లీ కుటుంబ సమానులైన కార్యకర్తలను కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు.గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా బీసీ, ఎస్సీ కాలనీల్లో వాసు, వసంతమ్మలకు ఆయన పెన్షన్లను పంపిణీ చేశారు. అనంతరం ఎస్సీకాలనీలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటుచేసిన స్టాళ్లను పరిశీలించారు.అక్కడే ఏర్పాటుచేసిన ప్రజావేదికలో ప్రసంగించాక సమీపంలోని రామానాయుడుపల్లె వద్ద శనివారం మండల టీడీపీ శ్రేణులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘30 ఏళ్ల తర్వాత గంగాధరనెల్లూరులో టీడీపీ జెండా ఎగరేశాం. పార్టీ విజయం కోసం కార్యకర్తలు ప్రాణం పెట్టి పనిచేశారు. మీకు నేను పూర్తిగా సహకరిస్తా. ఈ నియోజకవర్గాన్ని పార్టీకి కంచుకోటగా మార్చాలి. తంబళ్లపల్లె, పుంగనూరులో కాస్త గురి తప్పాం.. తప్ప జిల్లా అంతటా టీడీపీ జెండా ఎగిరింది. మొన్నటి ఎన్నికల్లో సరిగా చేసుకుని ఉంటే పులివెందులలో కూడా మనమే గెలిచేవాళ్లం. 2014-19 మధ్య అవిశ్రాంతంగా పనిచేసి 13.5 గ్రోత్‌రేట్‌ సాధించాం. అయినా ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిందంటే దానికి కారణం ప్రజలకు మంచి చేయకపోవడం వల్ల కాదు.. కార్యకర్తల్లో అసంతృప్తి వల్లే. మీలో అణువణువూ పసుపు రక్తం తప్ప మరోటి ఉండదు. మీతో నేను మాట్లాడకుంటే నాపై అసంతృప్తి చెందుతారు. అందుకే కార్యకర్తల కోసం సమావేశం ఏర్పాటు చేయించా. ఇక నుంచి నాకూ,కార్యకర్తలకు మధ్య దూరం ఉండదు. పర్యటనకు వెళ్లిన ప్రతిచోటా కార్యకర్తలతో సమావేశమవుతా’ అన్నారు.ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలతో అనుసంధానం కావడంతో పాటు కార్యకర్తలకూ అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. జనసేన, బీజేపీ నాయకులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలన్నారు. వన్‌టైమ్‌ ఎంపీ, ఎమ్మెల్యేగా భావించకుండా రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు ప్రజాప్రతినిధులుగా ఉండేలా పనిచేయాలని ఉద్భోదించారు.వైసీపీ నేతలకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఉపకారం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్నారు.వారికి ఉపకారం చేయడమంటే పాముకు పాలు పోసినట్లే. అని గుర్తించాల న్నారు.

నీరూచెట్టు బిల్లులను త్వరలోనే చెల్లిస్తాం

నీరూచెట్టు పెండింగ్‌ బిల్లులను త్వరలోనే చెల్లిస్తామని చం ద్రబాబు ప్రకటించారు.టీడీపీ శ్రేణులు కూడా ఇష్టానుసారంగా కాకుండా నాయకత్వం కింద పనిచేయాలని సూచించారు.ఇక మీదట కార్యకర్తలకు, నేతలకు ఏ పనులు కావాలన్నా బూత్‌కమిటీ, గ్రామకమిటీ, మండల కమిటీ, తర్వాత జిల్లా కమిటీ ద్వారా వస్తేనే మంజూరు చేస్తామన్నారు.జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి నియోజకవర్గాల్లో సరిగా పర్యటించడంలేదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు సీ.ఆర్‌.రాజన్‌, పెనుమూరు మండల అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు పార్టీ కార్యక్రమాల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు వారి జోరు తగ్గిందన్నారు. పాలసముద్రం మండల టీడీపీ అధ్యక్షుడు రాజేంద్ర అలకబూని పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకుండా పోతున్నారని, అవసరమైతే నేరుగా అతని పరిస్థితి తెలుసుకుని తగిన విధంగా ముందుకు సాగాలన్నారు.


అవీ ఇవీ

టీడీపీ కార్యకర్తల సమావేశంలో చివరగా క్లస్టర్‌, యూనిట్‌, బూత్‌ స్థాయిలో కృషి చేసిన శ్రేణుల పేర్లను చంద్రబాబు చదివి అభినందించడంతో చప్పట్లతో సమావేశం మార్మోగిపోయింది.

హెలిప్యాడ్‌లో ఎమ్మెల్యే థామస్‌ తన ఇద్దరు కుమారులను చంద్రబాబుకు పరిచయం చేశారు.

పెన్షన్ల పంపిణీతో పాటు సెల్వి అనే మహిళతో పాటు ఆమె మనవరాళ్ల చదువుకు, సొంతింటికి ఆర్థిక సాయం చేయడం, ప్రజావేదికలో పాల్గొనడం గురించి సీఎం చంద్రబాబు సోషల్‌ మీడియాలో ఫొటోలతో సహా పోస్టు చేశారు. ఆయా కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.

టీడీపీ కార్యకర్తల మీటింగులో వేదిక మీద ఇన్‌ఛార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే థామస్‌, పార్టీ అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌లతో పాటు గతంలో నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా పనిచేసిన భీమనేని చిట్టిబాబుకు కూడా అవకాశం దక్కింది.

చంద్రబాబు బస్సులో వుండగా టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు లోపలికెళ్లి కాసేపు మాట్లాడారు.

హెలిప్యాడ్‌లో ఎల్‌1, ఎల్‌2 విభాగాల్లో టీడీపీ నాయకులు ప్రాధాన్యతను బట్టి సీఎం చంద్రబాబును కలిశారు. ఎల్‌1లో ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు కలవగా.. అందరి భుజాలపై చేతులేసి చంద్రబాబు పేర్లతో పలకరించడంతో వారంతా మురిసిపోయారు.

2 వేల ఎకరాల్లో ఇండస్ర్టియల్‌ పార్కు

ఎన్టీఆర్‌ జలాశయం, కృష్ణాపురం ప్రాజెక్టుల అనుసంధానం

అన్నక్యాంటీన్‌, బాలుర గురుకుల పాఠశాల ఏర్పాటుకు హామీ

గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు వరాలు

గంగాధరనెల్లూరు, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ‘చిత్తూరు- తచ్చూరు హైవే పూర్తయితే చెన్నైకి 45 నిమిషాల్లో, బెంగళూరుకు ఒకటిన్నర గంట లో వెళ్లిపోవచ్చు. దానికి అనుగుణంగా చిత్తూరు- తచ్చూరు హైవే సమీపంలో ఇండస్ర్టియల్‌ పార్కు కోసం 2 వేల ఎకరాలను సేకరించమని కలెక్టర్‌కు చెప్పా. బయటి ప్రాంతాల నుంచి పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగ సమస్య తీరుస్తా’అని సీఎం చంద్రబాబు ప్రజావేదిక పేరుతో ఏర్పాటు చేసిన గ్రామసభలో హామీ ఇచ్చారు.ఎన్టీఆర్‌ జలాశయం, కృష్ణాపురం ప్రాజెక్టులను అనుసంధానం చేసి సాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు.గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి బాలుర గురుకుల పాఠశాలను మంజూరు చేస్తామన్నారు. జిల్లాలో సాగు, తాగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని, హార్టికల్చర్‌ పంటలు పెరిగిన నేపథ్యంలో మామిడి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి సౌకర్యాలను పెంచుతామన్నారు. జీడీనెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇన్‌ఛార్జి మంత్రి రామ్‌ప్రసాద్‌రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యేలు థామస్‌, అమరనాథ రెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్‌, గురజాల జగన్మోహన్‌, మురళీమోహన్‌,టీడీపీ జిల్లా అధ్యక్షుడు సీఆర్‌ రాజన్‌, చుడా ఛైర్‌పర్సన్‌ హేమలత, పుంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి, మేయర్‌ అముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్యేలు సీకే బాబు, ఆర్‌.గాంధీ, ఏఎస్‌ మరోహర్‌, టీడీపీ నాయకులు చంద్రప్రకాష్‌, భీమనేని చిట్టిబాబు నాయుడు, కాజూరు బాలాజి, వైవీ రాజేశ్వరి, సప్తగిరి ప్రసాద్‌, ఎన్‌పీఎ్‌స జయప్రకాష్‌, నాగేశ్వరరాజు, జనసేన ఇన్‌ఛార్జి పొన్న యుగంధర్‌, బీజేపీ నేత జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 02 , 2025 | 02:26 AM