విజయసాయిరెడ్డి ఆఫీసులో.. విశాఖ ప్రజల జీవితాలు నాశనం చేసే మాస్టర్‌ప్లాన్ తయారీ!
ABN , First Publish Date - 2021-07-30T16:24:36+05:30 IST
విశాఖ మహా నగర ప్రాంత..

తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపణ
ముడసర్లోవలో 800 ఎకరాలు కొట్టేసే ప్రణాళిక
భోగాపురం మండలంలో రహదారులకు 3 వేల ఎకరాల సేకరణా!?
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీఏ) ఈ ప్రాంత ప్రజల జీవితాలను నాశనం చేయడానికి మాస్టర్‌ప్లాన్-2041 తయారుచేసిందని తెలుగుదేశం నాయకులు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఆరోపించారు. ఆయన విశాఖలో గురువారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా మాస్టర్‌ప్లాన్ తయారు చేశారన్నారు. ఇది ‘విజయసాయిరెడ్డి మెట్రో రీజియన్ డిస్ట్రక్షన్ ప్లాన్’ అని విమర్శించారు. రెండు నెలల క్రితం ఎంపీ విజయసాయిరెడ్డి నగర మేయర్, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లకు చెప్పకుండా జీవీఎంసీ కమిషనర్‌తో కలిసి ముడసర్లోవ రిజర్వాయరు ప్రాంతాన్ని పరిశీలించి, దానిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పార్కుగా ప్రైవేటు సంస్థతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు. ఇదే వీఎంఆర్డీఏ సంస్థ 2006లో రాజశేఖర్‌రెడ్డి సీఎంగా వున్నప్పుడు ముడసర్లోవలో 800 ఎకరాలను వాటర్బాడీగా, కేచ్‌మెంట్ ఏరియాగా ప్లాన్ చూపించిందన్నారు. ఇప్పుడు అదే సంస్థ కొత్త మాస్టర్‌ప్లాన్-2041లో దానిని ‘రిక్రియేషన్ అండ్ గ్రీన్ బఫర్‌జోన్’గా చూపించిందన్నారు. దేశంలో ఎక్కడైనా వాటర్బాడీని వేరే అవసరాలకు ఉపయోగించడానికి వీలు లేదని, అది చట్టవిరుద్ధమన్నారు. కానీ ఇక్కడ రిక్రియేషన్ పేరుతో 800 ఎకరాలు కాజేయడానికి పెద్ద మాస్టర్ప్లాన్నే సాయిరెడ్డి రూపొందించారని ఆరోపించారు.
భోగాపురంలోనే రహదారులకు 3 వేల ఎకరాలు
భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణానికి ప్రభుత్వం రెండు వేల ఎకరాలు జీఎంఆర్ సంస్థకు ఇచ్చిందని, ఇప్పుడు అదే మండలంలో మాస్టర్‌ప్లాన్ రహదారులు ఇష్టానుసారం ప్రతిపాదించిందని, వాటి కోసం మూడు వేల ఎకరాలు అవసరం అవుతుందన్నారు. అంటే..చిన్న, సన్నకారు రైతులు అంతా ఆ భూములు వదులుకోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ఒక్క మండలంలోనే రహదారులకు 3 వేల ఎకరాలు అవసరమైతే...మూడు జిల్లాల్లో ఇంకెన్ని వేల ఎకరాలు ప్రజల నుంచి లాక్కుంటారో అర్థం చేసుకోవాలన్నారు. ఉత్తరాంధ్రాలో కూల్చివేతలు, స్వాధీనాలే లక్ష్యంగా పనిచేస్తున్న సాయిరెడ్డి ఇప్పుడు మాస్టర్‌ప్లాన్ పేరుతో పేద, మధ్య తరగతి ప్రజలను దోచుకోవడానికి ఈ ప్లాన్ వేశారన్నారు.
వుడా లేఅవుట్లో రహదారి
వీఎంఆర్డీఏ సంస్థ ఇంతకు ముందు వుడాగా ఉండదేని, అప్పుడు 1989లో కాపులుప్పాడంలో ఒక లేవుట్ (102/89) వేసి వేలం ద్వారా స్థలాలు ప్రజలకు విక్రయించిందని, ఇప్పుడు అందులో మాస్టర్‌ప్లాన్ రోడ్డు వేశారని, దాంతో ప్లాట్లు కొనుక్కున్న వారు నష్టపోవసలి వస్తోందన్నారు. వారు విక్రయించిన స్థలాలు మీదుగానే రహదారులు వేస్తే ప్రజలు ఇంకెవరికి చెప్పుకోవాలని ఎమ్మెల్యే వెలగపూడి ప్రశ్నించారు.
రద్దు చేసి కొత్త ప్లాన్ ఇవ్వాలి
సాయిరెడ్డి కనుసన్నల్లో తయారైన ఈ మాస్టర్‌ప్లాన్ వల్ల ప్రజలకు తీవ్రనష్టం జరుగుతున్నందున దీనిని రద్దు చేసి, కొత్తగా వీఎంఆర్డీఏ కన్సల్టెన్సీ ద్వారా కొత్త ప్లాన్ తయారు చేయించి, అప్పుడు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని వెలగపూడి డిమాండ్ చేశారు.