అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ఆకాంక్ష!
ABN , First Publish Date - 2021-05-03T06:21:11+05:30 IST
లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు! హోమ్ క్వారంటైన్లో, వండుకునే ఓపిక లేక పస్తులతో కాలం గడిపేవాళ్లు ఉంటారు. 12 గంటల షిఫ్ట్ ముగించుకుని ఇంటికొచ్చి మ్యాగీతో పొట్ట నింపుకునే డాక్టర్లూ...

లాక్డౌన్ సమయంలో ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు! హోమ్ క్వారంటైన్లో, వండుకునే ఓపిక లేక పస్తులతో కాలం గడిపేవాళ్లు ఉంటారు. 12 గంటల షిఫ్ట్ ముగించుకుని ఇంటికొచ్చి మ్యాగీతో పొట్ట నింపుకునే డాక్టర్లూ ఉంటారు. ఆర్ధిక ఇబ్బందులతో, పూట గడవని స్థితిలో, ఆకలితో రోజులు వెళ్లదీసే రోజు కూలీలూ ఉంటారు. వీళ్ల ఆకలి తీర్చడానికి నడుం బిగించింది పుణేకు చెందిన ఆకాంక్ష సడేకర్! ఉచిత ఇంటి భోజనం వాళ్ల ఇళ్లకే చేరుస్తూ, అమ్మలా వారి ఆకలి తీరుస్తోంది!
‘‘ఓ రోజు ట్విట్టర్లో, 12 గంటల షిఫ్ట్ ముగించుకుని ఇంటికొచ్చిన పుణేకు చెందిన ఓ యువ వైద్యుడు, మ్యాగీతో కడుపు నింపుకుని పడుకున్నానని పెట్టిన ట్వీట్ నన్ను కదిలించింది. దానికి బదులుగా కొందరు స్విగ్గీ, జొమాటోలలో ఆర్డర్ ఇవ్వమని రీట్వీట్ చేశారు. కానీ దానికి ఆ వైద్యుడు, తాను ఇంటికొచ్చేసరికి రాత్రి ఎనిమిదిన్నర దాటుతుందనీ, ఫుడ్ డెలివరీ సౌకర్యం రాత్రి ఎనిమిదికే ముగుస్తుందనీ సమాధానమిచ్చాడు. ఇలా లాక్డౌన్ సమయంలో కరోనా సేవలతో అలసి, ఆకలితో ఇంటికొచ్చి, అర్థాకలితోనే పక్క మీదకు ఒరిగిపోయే వైద్యులు ఎందరో! వీళ్లే కాదు, దంపతులిద్దరూ కొవిడ్ బారిన పడినప్పుడు వాళ్లకు వంట చేసి పెట్టేదెవరు? రెక్కాడితే గానీ డొక్కాడని రోజుకూలీల ఆకలి తీరేదెలా? ఒక వైద్యుడు పెట్టిన ట్వీట్ నాలో ఇన్ని ఆలోచనలు రేకెత్తేలా చేసింది. వాళ్ల ఆకలి తీరాలంటే భోజనం అందించాలి. ఇందుకోసం నేనే స్వయంగా వండి, భోజనాన్ని వాళ్ల ఇళ్లకు చేర్చాలని సంకల్పించాను. ఇందుకోసం నిధులు కావాలంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాను. మొదట డాక్టర్లు స్పందించారు. ఆ పోస్ట్ వైరల్‌గా మారి, హెల్త్ కేర్ వర్కర్లు, వైద్య విద్యార్థులు కూడా స్పందించారు. నేను వండి పంపించే భోజనం రెస్టారెంటు భోజనాన్ని మరిపించేలా ఉండదు. రోటీ, కూర లేదా కిచిడి... ఇదే నేను పంపించే భోజనం.’’
వెయ్యికి పైగా భోజనాలు...
‘‘నేను యుకెలో పుట్టి, పెరిగాను. ప్రస్తుతం పుణేలో పెట్రోలియం ఇంజనీర్‌గా పని చేస్తూ, ఒంటరిగా ఉంటున్నాను. నాకు వంట పనిలో ఒక హెల్పర్ ఉంది. ఆమె భర్త రెస్టారెంట్లో పని చేసేవాడు. లాక్డౌన్ కారణంగా పని పోగొట్టుకుని ఖాళీగా ఉన్న అతన్ని పనిలోకి తీసుకున్నాను. భోజనం ప్యాకెట్లను అవసరార్ధుల ఇళ్లకు చేర్చడం అతని పని. ఇలా ఏప్రిల్ ఏడున మొదలుపెట్టి, రోజుకు 80 భోజనాల చొప్పున ఇప్పటివరకూ వెయ్యికి పైగా భోజనాలు అందించాను. నాకు రోజుకు వంద ఫోన్ కాల్స్ వస్తాయి. రోజంతా భోజనాల కోసం నా ఫోన్ మోగుతూనే ఉంటుంది.’’
మర్చిపోలేని అనుభవం!
‘‘ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, దంపతులిద్దరూ కొవిడ్ పాజిటివ్లమనీ, తీవ్ర జ్వరంతో మంచం పట్టి ఉన్నామనీ, భోజనం వండుకునే ఓపిక లేదనీ చెప్పాడు. వాళ్లకు రెండున్నరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. కొవిడ్‌తో బాధపడుతున్న సమయంలో రోగనిరోధకశక్తి పెంచుకోవడం అవసరం. అలాంటప్పుడు హోటల్ భోజనం తింటే ఎలా? హోటల్ నుంచి భోజనం తెప్పించుకునే స్థోమత ఉండి కూడా వాళ్లు ఇంటి భోజనం కోసం ఆరాటపడే తీరు నన్ను కలచివేసింది. వాళ్లు మంచి భోజనం తిని అప్పటికే నాలుగు రోజులు దాటిందని అతని మాటల ద్వారా అర్థమైంది. ఇలాంటి లాక్డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతూ, ఆకలితో అలమటించే కుటుంబాలు ఎన్నో! అందరికీ కాకపోయినా, నా స్థోమత మేరకు ఆకలి తీర్చగలుగుతున్నందుకు తృప్తిగా ఉంది. నాలా ఇంటికొకరు పూనుకోగలిగితే, ఎంతోమంది కొవిడ్ బాధితుల ఆకలిని కొంతైనా తీర్చగలిగినవాళ్లం అవుతాం!’’
