ఆక్సిజన్‌ లేమి మనందరికీ ఒక గుణపాఠం!

ABN , First Publish Date - 2021-05-23T05:30:00+05:30 IST

ఏడాది క్రితం కొవిడ్‌ తొలి వేవ్‌లో అందరికీ ఆహారం అందించటమే ముఖ్యమైన విషయంగా మారింది. సెకండ్‌ వేవ్‌లో ప్రాధమ్యాలు మారాయి. ఆక్సిజన్‌ సరఫరా ప్రధానమైన అంశంగా మారింది. కొవిడ్‌ రోగులకు ఊపిరి పోస్తున్న ఈ ఆక్సిజన్‌ను అందించటానికి అనేక మంది తమ వంతు సాయం చేస్తున్నారు.

ఆక్సిజన్‌ లేమి మనందరికీ ఒక గుణపాఠం!

ఏడాది క్రితం కొవిడ్‌ తొలి వేవ్‌లో అందరికీ ఆహారం అందించటమే ముఖ్యమైన విషయంగా మారింది. సెకండ్‌ వేవ్‌లో ప్రాధమ్యాలు మారాయి. ఆక్సిజన్‌ సరఫరా ప్రధానమైన అంశంగా మారింది. కొవిడ్‌ రోగులకు ఊపిరి పోస్తున్న ఈ ఆక్సిజన్‌ను అందించటానికి అనేక మంది తమ వంతు సాయం చేస్తున్నారు. కొందరు ధన సాయం చేస్తుంటే.. మరి కొందరు ప్రత్యక్షంగా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొని తమకు చేతనైనంత సాయం అందిస్తున్నారు. అలాంటి వారిలో పాప్‌ సింగర్‌ స్మిత ఒకరు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొవిడ్‌ పరిస్థితులను.. తన అనుభవాలను స్మిత ‘నవ్య’తో పంచుకున్నారు. 


‘‘గత ఏడాది కొవిడ్‌ బాగా వ్యాపించినప్పుడు వలస కార్మికులకు ఆహారాన్ని అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాం. సైబరాబాద్‌ పోలీసులతో కలిపి మేము నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు రెండు లక్షల మందికి పైగా ఆహారాన్ని అందించగలిగాం. కొవిడ్‌ వ్యాప్తి తగ్గిందనుకున్న సమయంలో సెకండ్‌ వేవ్‌ వచ్చింది. కొన్ని లక్షల మంది ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి ఆహారం కన్నా ఆక్సిజన్‌ కొరతే ఎక్కువ ఉంది. ఆక్సిజన్‌ లేకుండా ఇబ్బంది పడుతున్న వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో దాదాపు నెలరోజుల క్రితం నుంచి పని ప్రారంభించాం. మేము చేస్తున్న పని చెప్పే ముందు- అలీయ ఫౌండేషన్‌ గురించి కూడా చెప్పాలి. దీనిని నేను ఆరేళ్ళ క్రితం ప్రారంభించా. దివ్యాంగుల కోసం.. గ్రామీణ ప్రాంతాల్లో పేదల కోసం మేము ఇప్పటి దాకా అనేక కార్యక్రమాలు నిర్వహించాం.


ఆహారం అందించటం.. ఇతర సేవాకార్యక్రమాలు చేయటం మాకు అలవాటే. కానీ ఆక్సిజన్‌ను అందించటం మాకు కొత్త. దీని గురించి మాకు ఏమి తెలియదు. నాకు తెలిసిన వారు ఒకరు పుణేలో ఉన్నారు. వారి స్నేహితుడికి ఆక్సిజన్‌ సిలిండర్స్‌ను సరఫరా చేసే వ్యాపారముంది. మొదట వాళ్లతో మాట్లాడితే ఆక్సిజన్‌ను సంపాదించటమనేది ఎంత కష్టమో అర్థమయింది. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే- ఎంటర్‌ప్రెన్యూర్స్‌ ఆర్గనైజేషన్‌ (ఈఓ)-వారు కూడా ఆక్సిజన్‌ను అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిసింది. ఆ సంస్థలో నేను కూడా సభ్యురాలినే! దీనితో ఈఓ బెంగళూరు చాప్టర్‌ సభ్యులతో మాట్లాడితే ఆక్సిజన్‌ సరఫరా గురించి కొంత సమాచారం తెలిసింది. దీని ఆధారంగా నేను, మా స్నేహితులు తెలుగు రాష్ట్రాల్లో ఆరు ప్రాంతాల్లో ఆరువందల సిలిండర్స్‌ అందించాలని అనుకున్నాం. నేను హైదరాబాద్‌, విజయవాడ సెంటర్లకు ఛాంపియన్‌గా (బాఽధ్యురాలిగా) .. మిగిలిన వారు మిగిలిన సెంటర్లకు ఛాంపియన్‌లుగా పని ప్రారంభించాం. 


చాలా కష్టం..

ప్రస్తుతం మన దేశంలో ఎక్కడా ఆక్సిజన్‌ దొరకటం లేదు. ఆక్సిజన్‌ సరఫరాదారులందరూ తమ వద్ద ఉన్న స్టాక్‌ను ప్రభుత్వానికే అందిస్తున్నారు. దీనితో మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీని కోసం తైవాన్‌, థాయ్‌లాండ్‌, చైనా, క్రొయేషియా వంటి దేశాల్లో ఉన్న  ఆక్సిజన్‌ సరఫరాదారులతో మాట్లాడి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను తెప్పించాల్సి వచ్చింది. సాధారణ పరిస్థితుల్లో మనం అసలు ఆక్సిజన్‌ ఎక్కడి నుంచి వస్తుందనే విషయాన్ని కూడా పట్టించుకోం. అలాంటి ఆక్సిజన్‌ అందుబాటులో లేకపోతే ఏం జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆక్సిజన్‌ లేమి మనందరికీ గుణపాఠం. ప్రస్తుతం ఎవరైనా నన్ను ఆక్సిజన్‌కు సంబంధించి ఏది అడిగినా టక్కుమని చెప్పేయగలను. ఆక్సిజన్‌ కాన్సట్రేటర్లను తెప్పించటం ఒక ఎత్తైతే- వాటిని అవసరమైన వారికి అందించటం మరో ఎత్తు. దీని కోసం తక్కువ ఖర్చుతో మౌలిక సదుపాయాలను ఎలా రూపకల్పన చేయాలనే విషయంపై కూడా అధ్యయనం చేయాల్సి వచ్చింది. ఉదాహరణకు కొవిడ్‌ సెంటర్లలో కొన్ని వందల పడకలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీని కోసం కార్డ్‌బోర్డ్‌తో తయారుచేసిన మంచాలు.. ఎక్కువ సార్లు వాడినా ఎటువంటి ఇబ్బంది ఉండని పరుపులు.. ఇతర సామగ్రిలను వెతికి పట్టుకున్నాం.


ఒక కార్డ్‌బోర్డ్‌ మంచం.. దానిపై పరుపు.. దాని పక్కనే అవసరమైన ఇతర సామగ్రి.. ఆక్సిజన్‌ అందించటానికి పైపులు.. ఇలా అన్నింటికీ కలిపి ఒకో సెటప్‌కు రూ. 3500 దాకా ఖర్చు అవుతోంది. మన తెలుగు రాష్ట్రాల్లో వాటర్‌ఫ్రూపింగ్‌ ఉన్న ఈ కార్డ్‌బోర్డ్‌ మంచాలు వాడటం ఇదే తొలిసారి. వీటిని రీసైక్లింగ్‌ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని కూడా ఉండదు. ప్రస్తుతం ఈ మంచాలను విజయవాడలోని వెన్యూ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉన్న కొవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉపయోగిస్తున్నాం. సుజనా ఫౌండేషన్‌, కేర్‌ ఫౌండేషన్‌లు 100 ఆక్సిజన్‌ బెడ్‌లు ఏర్పాటు చేశాయి. మేము మరో 100 ఆక్సిజన్‌ బెడ్‌లు ఏర్పాటు చేశాం. అక్కడ ఉన్న వారందరికీ అక్షయపాత్ర ఫౌండేషన్‌ తరుపున రుచికరమైన ఆహారాన్ని కూడా అందిస్తున్నాం. హైదరాబాద్‌లో కూడా సైబరాబాద్‌ పోలీసులతో కలిపి త్వరలోనే కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ప్రారంభిస్తాం. దీనిలో కూడా ఆక్సిజన్‌ బెడ్‌లు ఉంటాయి.


కార్డ్‌బోర్డ్‌ మంచాలను మంగుళూరు సమీపంలో తయారుచేస్తున్నారు. వీటిలో రెండు రకాలున్నాయి. మొదటి రకంలో బ్యాక్‌రెస్ట్‌ ఉండదు. వాటర్‌ ఫ్రూప్‌ కోటింగ్‌ ఉండదు. వీటి ఖరీదు సుమారు రూ.500 దాకా ఉంటుంది. ఇక బ్యాక్‌రెస్ట్‌, వాటర్‌ఫ్రూప్‌ కోటింగ్‌ ఉన్న మంచాల ఖరీదు రూ. 850 దాకా ఉంటుంది. ఈ మంచాలు సుమారు 300 కేజీల దాకా బరువును ఆపుతాయి. చాలా కాలం ఎటువంటి సమస్య లేకుండా ఉంటాయి. గత ఏడాది కోవిడ్‌ సీజన్‌ వన్‌ సమయంలోని మంచాలను ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు.  

Updated Date - 2021-05-23T05:30:00+05:30 IST