బీజేపీపై ఈటల అనాసక్తి!

ABN , First Publish Date - 2021-05-28T08:08:07+05:30 IST

భవిష్యత్తు రాజకీయ మజిలీగా బీజేపీని ఎంచుకోవడానికి మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ పార్టీపై పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ, అందులో చేరడానికి మాత్రం ఆయన అనాసక్తిగా ఉన్నట్లు సమాచారం.

బీజేపీపై ఈటల అనాసక్తి!

అందులో ఇమడలేరని సన్నిహితుల సలహా

ఇది తగిన సమయం కాదన్న కోదండరాం

ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దాడే

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

రాజేందర్‌ చేరికకు బీజేపీ అధిష్ఠానం ఓకే!

నేడో, రేపో స్పష్టత వస్తుందన్న ఆ పార్టీ

జూన్‌ తొలి వారంలో చేరే అవకాశం!

జమున హేచరీస్‌ భూముల్లో రీ సర్వేకు బ్రేక్‌

మాసాయిపేట భూముల సర్వే 

నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ


హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు రాజకీయ మజిలీగా బీజేపీని ఎంచుకోవడానికి మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ సిద్ధంగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ పార్టీపై పెద్దగా వ్యతిరేకత లేనప్పటికీ, అందులో చేరడానికి మాత్రం ఆయన అనాసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఈటల బీజేపీవైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ ముఖ్యులు కొందరు అంతర్గత సంభాషణల్లో ధ్రువీకరిస్తున్నారు. బీజేపీలో ఈటల చేరికపై త్వరలోనే స్పష్టత వస్తుందనీ చెబుతున్నారు. కానీ, దీనిపై ఈటల వైపు నుంచి ఎటువంటి సమాచారం బయటికి రావడం లేదు. పైగా పార్టీ మారే విషయంలో ఇప్పటివరకూ తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఒకవేళ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజురాబాద్‌ నియోజకవర్గ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగితే సహకరించాలంటూ అన్ని పార్టీల నేతలను కలిసినట్లుగానే బీజేపీ నాయకులనూ కలిసినట్లు వివరిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఈటల బీజేపీలో చేరతారంటూ ప్రచారం జరగడంపై ఆయన సన్నిహితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇలా ప్రచారం జరగడం వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది.


భూ కబ్జా ఆరోపణలు రావడంతోపాటు కేబినెట్‌ నుంచి బర్తర్‌ఫకు గురైన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌, ప్రభుత్వం తీరుపై ఈటల విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో నడుచుకోవాల్సిన తీరుపై ఆయన ముందుకు అనేక ప్రతిపాదనలు వస్తున్నాయి. ఎక్కువ మంది కొత్తగా పార్టీ పెట్టాలని ఈటలపై ఒత్తిడి తెస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ‘ఈటల కొత్తగా పార్టీ పెడితే, అణచివేయటానికి కేసీఆర్‌ అన్ని ప్రయత్నాలు చేస్తారు’ అనే అభిప్రాయాలను ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈటలకు ప్రస్తుతం ఒక అండ అవసరమని, అది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి అందితే బాగుంటుందనే సూచనలు వచ్చాయని చెబుతున్నారు. అంతర్గతంగా సాగుతున్న ఈ చర్చ.. బీజేపీవైపు ఈటల అడుగులు అనే దిశగా మళ్లిందని పేర్కొంటున్నారు. కానీ, విశ్వసనీయ సమాచారం ప్రకారం బీజేపీలో చేరడానికి ఈటల సానుకూలంగా లేరని తెలుస్తోంది. 


కలిసి పనిచేద్దాం: కోదండరాం

‘‘నువ్వు కేవలం హుజూరాబాద్‌ నాయకుడివి కాదు. రాష్ట్రంలో పేరున్న.. ప్రభావం చూపగల నాయకుడివి. రాజకీయంగా నిర్ణయం తీసుకునేందుకు ఇది సరైన సమయం కాదు. ప్రజా సమస్యలపైన కలిసి పనిచేద్దాం. మాట్లాడదాం’’ అని ఈటల రాజేందర్‌కు టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం సూచించినట్లు తెలిసింది. బీజేపీలో చేరుతారంటూ బయట ప్రచారం జరుగుతోందని, ఇది సరైన నిర్ణయమూ, తగిన సమయమూ కాదని చెప్పినట్లు సమాచారం. ఈటల రాజేందర్‌ను గురువారం ఆయన నివాసంలో కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కలిశారు. ప్రభుత్వ ఒత్తిళ్లకూ భయపడాల్సిన పనిలేదని, ప్రజా సమస్యలపైన కలిసి మాట్లాడితే ప్రజల మద్దతూ పెరుగుతుందని కోదండరాం చెప్పినట్లు సమాచారం.


బీజేపీ అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌!

ఈటలను బీజేపీలో చేర్చుకునేందుకు పార్టీ జాతీయ నాయకత్వం గురువారం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందంటూ పార్టీ వర్గాలు వెల్లడించాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు మరో ఇద్దరు అగ్రనేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చర్చించినట్లు సమాచారం. ‘‘రాష్ట్రంలో, టీఆర్‌ఎ్‌సలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోంది. ఈటల కూడా ఉద్యమ కారుడే. ఆయనకు అండగా నిలిచి న్యాయం చేయాలి’’ అని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండడం మంచిది కాదు. వారికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తాం’’ అని అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు వెల్లడించాయి. దీంతోపాటు ఈటల వ్యక్తిత్వం, ప్రజాదరణకు సంబంధించిన నివేదికలు జాతీయ నాయకత్వం తెప్పించుకున్నట్లు సమాచారం. మరోవైపు, ఈటల చేరికకు సంబంధించి పార్టీ అగ్రనాయకులు, సీనియర్‌ నాయకులతో చర్చిస్తున్నట్లు తెలిసింది.


ఈటల చేరికపై నేడో, రేపో స్పష్టత రానుందని పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల మొదటి వారంలో జేపీ నడ్డా సమక్షంలో ఈటల కాషాయ కండువా వేసుకునే అవకాశం ఉన్నట్లు చెబుతున్నాయి. ‘‘ఈటల చేరిక వల్ల, కేసీఆర్‌ వైఖరిని వ్యతిరేకిస్తున్న వారంతా కూడా ఇప్పుడు మావైపు చూస్తారు. కేసీఆర్‌ను ఢీ కొట్టాలంటే బీజేపీయే సరైన వేదిక అన్నది... రెండేళ్ల కిందట డీకే అరుణ చేరికతో రుజువైంది’’ అని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు వివరించారు.


ఈటల చేరిక ప్రచారంపై పెద్దిరెడ్డి కినుక!

ఈటల రాజేందర్‌ పార్టీలో చేరుతారన్న ప్రచారంపై హుజూరాబాద్‌ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత పెద్దిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈటల బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని హెచ్చరించారు. తనను సంప్రదించకుండా ఈటలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని మీడియా ప్రతినిధులతో ఆయన అన్నారు. ఆయన చేరిక సమాచారం మీడియా ద్వారానే తనకు తెలిసిందని చెప్పారు.

Updated Date - 2021-05-28T08:08:07+05:30 IST