బీజేపీ ఒక బోగస్‌ పార్టీ

ABN , First Publish Date - 2021-03-13T05:54:42+05:30 IST

బీజేపీ ఒక బోగస్‌ పార్టీ

బీజేపీ ఒక బోగస్‌ పార్టీ
మాట్లాడుతున్న మంత్రి ఎర్రబెల్లి

 బండి సంజయ్‌ది ఐటమ్‌ సాంగ్‌ పాత్ర   

 పరిష్కరించే గొంతు ‘పల్లా’ను గెలిపించండి   

 మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

హన్మకొండ టౌన్‌, మార్చి 12: బీజేపీ ఒక బోగస్‌ పార్టీ అని, ఆ పార్టీలో బండి సంజయ్‌ది ఐటమ్‌ సాంగ్‌ పాత్ర అని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని హరిత హోటల్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిచ్చిపట్టినట్లు వ్యవహరిస్తున్నాడని అన్నారు. సినిమాలో ఐటమ్‌ సాంగ్‌ లాంటివాడు బండి సంజయ్‌ అని.. ఎక్కువ రోజులు రాజకీయాల్లో ఉండలేడని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తుంటే కేంద్రప్రభుత్వం మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని ఆరోపించారు. అవసరమైన స్థలాలు ఇచ్చినప్పటికీ కోచ్‌ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీలు ఇవ్వలేదని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఊసే ఎత్తడంలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం, మిషన్‌భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టులకు కేంద్రం పైసా కూడా సాయం చేయలేదని వివర్శించారు. బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎందుకు నిధులు, ప్రాజెక్టులు తీసుకురావడం లేదని ఆయన ప్రశ్నించారు. పట్టభద్రులు వాస్తవాలు గుర్తించి సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. 

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాక ముందు, వచ్చాక పరిస్థితులను గుర్తించి పట్టభద్రులు ఓటు వేయాలని కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. సంచులు మోసి పదవులు పొందిన కాంగ్రెస్‌ నేతల మాటలను ఎవరూ నమ్మొద్దని పిలుపునిచ్చారు. నిరుద్యోగులు వారి కాళ్లపైనే నిలబడి మరికొందరికి ఉపాధి కల్పించే పథకాన్ని ప్రభుత్వం తీసుకురాబోతోందన్నారు. ఆరేళ్లలో తన పరిధిలో ఉన్న ప్రతీ సమస్యను పరిష్కరించానని, మరోసారి అవకాశం ఇవ్వాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌, ఎంపీలు బండా ప్రకాశ్‌, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు పాల్గొన్నారు. 

 వడ్డెపల్లి: అభివృద్ధి కోసం ఎమ్మెల్సీగా తనకు పట్టం కట్టాలని టీఆర్‌ఎస్‌  ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం హన్మకొండ వడ్డెపల్లిలోని జీఎంఆర్‌ అపార్ట్‌మెంట్‌తో పాటు చైతన్యపురి కాలనీలో 51వ డివిజన్‌ కార్పొరేటర్‌ మిడిదొడ్డి స్వప్నతో కలిసి ప్రచారం నిర్వహించారు. 

 వరంగల్‌ టౌన్‌: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఏనుమాముల బాలాజీనగర్‌లోని ఓ  ఫంక్షన్‌ హాల్‌లో స్థానిక కార్పొరేటర్‌ తూర్పాటి సులోచన సారయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 

  నిరుద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తుందని రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాష్‌ అన్నారు. శుక్రవారం కాశిబుగ్గలోని ఓ  ఫంక్షన్‌ హాలులో మోడల్‌ స్కూల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండు రవి అధ్యక్షతన ఉద్యోగులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మాజీ ఎంపీ గుండు సుధారాణి హాజరై ఉపాధ్యాయులను, ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. 

  ధర్మసాగర్‌: పట్టభద్రుల ఎన్నికల్లో సమస్యలను పరిష్కరించే వ్యక్తినే ఎన్నుకోవాలని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల సమావేశానికి విచ్చేసి మాట్లాడారు. రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.  

Read more