భూములను లాక్కోవద్దు..
ABN , First Publish Date - 2021-01-09T04:18:59+05:30 IST
భూములను లాక్కోవద్దు..

మానుకోటలో వాటర్‌ట్యాంక్ ఎక్కిన దళితులు
మహబూబాబాద్ టౌన్, జనవరి 8 : అభివృద్ధి పేరిట తమ భూములను లాక్కొవద్దంటూ దళితులు మహబూబాబాద్ గాంధీ పార్కులోని వాటర్ ట్యాంక్ ఎక్కి ఆందోళన నిర్వహించారు. దాదాపు రెండు గంటలకు పైగా ట్యాంక్‌పైనే ఉండడంతో ఉత్కంఠత చోటు చేసుకుంది. స్థానిక డీఎస్పీ, తహసీల్దార్ హామీతో వాటర్‌ట్యాంక్ దిగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వివరాల్లోకి వెళితే..
మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలోని ఎర్రబోడు ప్రాంతంలో 551 సర్వేనంబర్‌లో ఇటీవల ప్రకృతి వైనం, వైకుంఠధామం ఇతరత్రా అభివృద్ధి కోసం శంకుస్థాపన చేశా రు. ఈ భూమిలో తాము 1973 సంవత్సరం నుంచి సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని పట్టణానికి చెందిన దళితులు పుచ్చకాయల మధుసూదన్, దాసరి అంబరీష, ఉపేందర్, భాస్కర్‌తో పాటు మరికొంత మంది స్థానిక గాంధీ పార్కులోని వాటర్ ట్యాంక్ ఎక్కారు. ఈ భూమిని తమకు వదిలిపెట్టకుంటే ఆత్మహత్యలే శరణ్యమని పెట్రోల్ బాటిల్, పురుగు మందు డబ్బాలు తీసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కారు. మరికొంత మంది కిందనే ఉండి సుమారు రెండు గంటలకు పైగా ఆందోళన చేపట్టారు. ఉన్నతాధికారులు వచ్చి తమకు హామీ ఇస్తేనే ట్యాంక్ పైనుంచి కిందికి దిగుతామని భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక డీఎస్పీ ఆంగోతు నరే్‌షకుమార్, తహసీల్దార్ రంజిత్‌కుమార్ అక్కడకు చేరుకుని న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి కిందికి దిగారు.