Amaravati Padayatra: జై అమరావతి నినాదాలతో మారుమోగుతున్న రేపల్లె

ABN , First Publish Date - 2022-09-18T23:30:33+05:30 IST

అమరావతి.. అజరా మరంగా నిలవాల్సిన ప్రాంతం. అద్భుతాలకు, అవకాశాలకు అలవాలంగా ఉండాల్సిన చోటు.

Amaravati Padayatra: జై అమరావతి నినాదాలతో మారుమోగుతున్న రేపల్లె

బాపట్ల: అమరావతి.. అజరా మరంగా నిలవాల్సిన ప్రాంతం. అద్భుతాలకు, అవకాశాలకు అలవాలంగా ఉండాల్సిన చోటు.  అయితే పాలకుల మూడు రాజధానుల నిర్ణయంతో మరణ శాసనంగా మారిందని రాజధాని కోసం భూములిచ్చిన రైతులు (Farmers) వాపోతున్నారు. మాకెందుకులే అని ఊరుకోని అమరావతి (Amaravati) రైతులు, మహిళలు ఏకతాటిపైకి వచ్చి మహోద్యమం చేపట్టారు. అవమానాలు.. దాడులు.. దౌర్జన్యాలు.. లాఠీచార్జీలు.. కేసులు.. అరెస్టులకు వెరవ కుండా శాంతియుతంగా మొక్కవోని దీక్షతో పోరు సాగిస్తున్నారు. ప్రభుత్వం రైతుల ఉద్యమాన్ని తొక్కి పెట్టాలని చూసినా.. కలబడి నిలబడి ముందుకు సాగుతున్నారు. ఆంధ్రుల ఏకైక రాజధాని అమరావతి పరిరక్షణే ధ్యేయంగా రైతులు చేపట్టిన మహాపాదయాత్ర జనజాతరను తలపిస్తోంది. ఆదివారం సాయంత్రం రేపల్లెకు మహాపాదయాత్ర చేరుకుంది. ‘జై అమరావతి’ నినాదాలతో రేపల్లె మారుమోగుతోంది. ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ (Satya prasad) ఆధ్వర్యంలో భారీగా ప్రజలు తరలివచ్చారు. పాదయాత్రలో మాజీమంత్రి దేవినేని ఉమ (Devineni uma), ఆలపాటి రాజా, నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. జైభీమ్ పార్టీ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. 


అమరావతి నిర్మాణానికి 29 గ్రామాల పరిధిలో ఉన్న 34,322 ఎకరాలను 29,881 మంది రైతులు భూ సమీకరణ కింద ఇచ్చారు. వారిలో ఐదెకరాలలోపు భూములు ఇచ్చిన వారు 8,500 మంది, ఎకరంలోపు ఉన్నవారు 20 వేల మంది ఉన్నారు. రైతుల ఉద్య మానికి అధికార వైసీపీ మినహా మిగిలిన పార్టీలన్నీ సంఘీభావం ప్రకటించాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడు, జనసేనాని పవన్‌కల్యాణ్‌, అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీపీఐ, సీపీఎం కార్యదర్శులు రామకృష్ణ, మధు తదితరులు రాజదాని గ్రామాల్లో పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. మొత్తం ఉద్యమ క్రమంలో 600 మందిపై పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. ఉద్యమకాలంలో 214 మంది ఉద్యమకారులు అశువులు బాశారు. ఉద్యమకారుల పోరాటాలు, త్యాగా లు, ఆత్మబలిదానాలతో ఉద్యమం అంతకంతకూ బలంగా ముందుకు సాగుతూనే ఉంది.

Updated Date - 2022-09-18T23:30:33+05:30 IST