పద్మజారెడ్డికి నేడు మహిళా వర్సిటీ డాక్టరేట్ ప్రదానం
ABN , First Publish Date - 2022-11-11T02:09:08+05:30 IST
సుమారు ఐదు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యమే ప్రాణంగా ఉన్న డాక్టర్ గడ్డం పద్మజారెడ్డికి పద్మావతి మహిళా యూనివర్సిటీ నేడు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది.

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), నవంబరు 10: సుమారు ఐదు దశాబ్దాలుగా కూచిపూడి నృత్యమే ప్రాణంగా ఉన్న డాక్టర్ గడ్డం పద్మజారెడ్డికి పద్మావతి మహిళా యూనివర్సిటీ నేడు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేయనుంది. యూనివర్సిటీ స్నాతకోత్సవం నేడు 12 గంటలకు ప్రారంభం కానుంది. 1967 జనవరి ఒకటవ తేదీన కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామానికి సమీపంలోని పామర్రులో ఆమె జన్మించారు.కూచిపూడి నృత్యంలోని రూప కళను ఆధునిక నాటకాలుగా ప్రదర్శించి ప్రజా చైతన్యానికి పద్మజారెడ్డి దోహదం చేశారు. హైదరాబాదులో తన కుమారుడు ప్రణవ్ పేరుతో అకాడమీని స్థాపించి, సుమారు 500 మందికి నృత్యంలో శిక్షణ ఇచ్చారు.అనేక దేశాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ప్రఖ్యాత నర్తకి శోభానాయుడి వద్ద ఎనిమిదో ఏటనే శిక్షణ పొందారు. శివహేల, భ్రూణ హత్యలు, కల్యాణ శ్రీనివాస చరితం, అన్నమయ్య పద నర్తన శోభ, శ్రీకృష్ణ పారిజాతం, రాధేశ్రీ కృష్ణామృత్, వజ్రభారతి, సీతా స్వయంవరం, సీజన్ ఆఫ్ ఫ్లవర్స్, నమస్తే ఇండియా, రామాయణం వంటి అంశాలను ఇతివృత్తాలుగా స్వీకరించి కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కాకతీయ రాజుల చరిత్ర ఆధారంగా ప్రత్యేక నృత్య రూపకాన్ని రూపొందించారు. 1979లో సర్ శ్రీనగర్ సంసద్ నృత్య విహార్ అవార్డు అందుకున్న ఆమె 1990లో కల్కి కళాకార్ అవార్డు, 1994 లో నాట్య విశారద అవార్డును అందుకున్నారు. 2001లో సంస్కృతి రత్న, అభినయ సత్యభామ అవార్డులను పొందారు. అక్కినేని నాగేశ్వరరావు చేతుల మీదుగా ఏఎన్‌ఆర్ గోల్డ్ మెడల్‌ను అందుకున్నారు. 2005లో అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచీ డాక్టరేట్ పట్టా పొందారు. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచీ కళారత్న (హంస) పురస్కారాన్ని స్వీకరించారు. 2007లో త్యాగరాజ ఉత్సవ కమిటీ విద్వాన్ మంత్ అవార్డుతో సన్మానించింది. 2012లో నేషనల్ టూరిజం అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్‌గా పని చేశారు. 2014లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అవార్డు, యూరోపియన్ తెలుగు అసోసియేషన్ అవార్డు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా నుంచీ ద డ్యాన్సింగ్ క్వీన్ అవార్డులను స్వీకరించారు. 2015లో సంగీత నాటక అకాడమీ అవార్డును అందుకున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. 2017 వరకూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ జనరల్ అసెంబ్లీ సభ్యురాలిగా పని చేశారు. 20022లో పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు.
ఎన్‌ఆర్‌ఐ విద్యార్థినికి పీహెచ్‌డీ పట్టా
ఎన్‌ఆర్‌ఐ విద్యార్థిని ఆముక్త మాల్యద సుష్మా ఈ స్నాతకోత్సవంలో పీహెచ్‌డీ డిగ్రీ అందుకోనున్నారు. 2013-15 విద్యా సంవత్సరం ఆమె సంగీతంలో (ఎం.ఏ) పూర్తి చేశారు. సంగీత, నృత్య విభాగంలో ప్రొఫెసర్ శైలేశ్వరి పర్యవేక్షణలో 2016లో పీహెచ్‌డీలో చేరి పూర్తి చేశారు.