అమరావతి దేశ వారసత్వ సంపద: ద్రౌపది ముర్ము

ABN , First Publish Date - 2022-12-04T20:32:22+05:30 IST

రాష్ట్రంలో ఉన్న అమరావతి, నాగార్జునకొండ, నాగార్జునసాగర్‌ (Nagarjunasagar) దేశ వారసత్వ సంపదకు ప్రతీకలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) కొనియాడారు.

అమరావతి దేశ వారసత్వ సంపద: ద్రౌపది ముర్ము

విజయవాడ: రాష్ట్రంలో ఉన్న అమరావతి, నాగార్జునకొండ, నాగార్జునసాగర్‌ (Nagarjunasagar) దేశ వారసత్వ సంపదకు ప్రతీకలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) కొనియాడారు. సాంఘిక, చారిత్రక, సాంస్కృతి కలయిన ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తుందన్నారు. రాష్ట్రం ఒక సకల కళల సమ్మేళనమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పర్యటనకు తొలిసారిగా వచ్చిన ఆమెకు కృష్ణా జిల్లా పోరంకిలోని ఎం కన్వెక్షన్‌ హాలులో రాష్ట్ర ప్రభుత్వం పౌర సత్కారాన్ని ఆదివారం ఏర్పాటు చేసింది. తొలుత రాష్ట్ర గవర్నర్ హరిచందన్‌ ఆమెను సత్కరించారు. అనంతరం సీఎం జగన్‌, తదుపరి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) సత్కరించారు. సత్కారం అనంతరం ముర్ము మాట్లాడారు. ప్రపంచానికి కూచిపూడి నాట్య రీతులు ఆంధ్రప్రదేశ్‌ నుంచే పరిచయం అయ్యాయని తెలిపారు. అమరావతిలో నాగార్జునుడు చేసిన బోధనలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. నన్నయ్య, తిక్కన, ఎర్రన వంటి మహాకవులు మహాభారతాన్ని ఇక్కడే లిఖించారన్నారు. సాంఘిక దూరాచారాలను రూపుమాపడానికి గురజాడ అప్పారావు (Gurajada Apparao) రాసిన కన్యాశుల్కం నాటకం ఇప్పటికీ ప్రజాదరణను పొందుతోందని ద్రౌపది ముర్ము పేర్కొన్నారు.

రాష్ట్రం నుంచి వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవిని అధిరోహించారని చెప్పారు. దేశానికి సుందరమైన త్రివర్ణ పతాకాన్ని ఈ నేల అందించిందన్నారు. మొల్ల రాసిన రామాయణం చరిత్రలో ఎంతో విశిష్టతను సంపాదించుకుందన్నారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, సరోజినీనాయుడు వంటి మహిళలు ఇక్కడి నుంచి స్వాతంత్య్ర పోరాటంలో ప్రధాన భూమిక పోషించారన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన బిర్సాముండా, అల్లూరి సీతారామరాజు వంటి వారిని ఈ తరం గుర్తు చేసుకుంటుందన్నారు. అంతరిక్ష విజ్ఞానానికి సంబంధించి ఇస్రోలో తెలుగు వారి సేవలు దేశానికి గర్వకారణమన్నారు. దేశాభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ కీలక భూమిక పోషిస్తుందని ద్రౌపది ముర్ము కొనియాడారు.

Updated Date - 2022-12-04T20:36:41+05:30 IST