Yanamala Ramakrishnudu: అవినీతి వద్దని అవినీతిపరుడే చెప్పడం హాస్యాస్పదం
ABN , First Publish Date - 2022-12-15T14:49:51+05:30 IST
అవినీతి వద్దని అవినీతిపరుడే చెప్పడం హాస్యాస్పదమని సీఎం జగన్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: అవినీతి వద్దని అవినీతిపరుడే చెప్పడం హాస్యాస్పదమని సీఎం జగన్‌ను ఉద్దేశించి మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు (Former Minister yanamala Ramakrishnudu) వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... ఇక నుంచి అవినీతికి వీల్లేదనడమంటే.. గత 42 నెలలుగా అవినీతికి గేట్లు తెరిచినట్లేనా? అని ప్రశ్నించారు. కామెడీలో ఛార్లీ చాప్లిన్‌తో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు జగన్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. లక్ష గొడ్లను తిన్న రాబంధు.. ఇక మాంసాహారం ముట్టుకోనంటూ ప్రమాణం చేసినట్లు జగన్ రెడ్డి (AP CM Jagan mohan reddy)వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. 24 సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లు, 16 నెలల జైలు శిక్ష అనుభవించిన అవినీతి చరిత్ర జగన్ రెడ్డిదన్నారు. మూడున్నరేళ్లుగా ల్యాండ్ - శాండ్ - వైన్ - మైన్ దోపిడీతో రాష్ట్రాన్ని సాంతం స్వాహా చేశారని ఆయన ఆరోపించారు.
దేశంలోనే అత్యంత అవినీతిమయమైన రాష్ట్రంగా ఏపీని జగన్ రెడ్డి తీర్చిదిద్దారన్నారు. మూడున్నరేళ్లలో అక్రమ మైనింగ్‌లో ఏపీ దేశంలోనే మూడో స్థానంలో ఉందని అన్నారు. లేటరైట్ పేరుతో బాక్సైట్ నుంచి... రుషికొండకు బోడిగుండు వరకు అక్రమ మైనింగ్ చేశారన్నారు. మద్య నిషేధం పేరుతో అక్రమ మద్యం వ్యాపారంతో రూ.30వేల కోట్లు స్వాహా చేశారని విమర్శించారు. రాజధాని పేరుతో రూ.40వేల కోట్ల విలువైన భూములు బొక్కేశారన్నారు. జగన్ రెడ్డి అవినీతి వద్దు అనే కామెడీలు చేయడం మాని.. రాష్ట్రాభివృద్ధి గురించి ఆలోచించాలని యనమల రామకృష్ణుడు హితవుపలికారు.