11న జాతీయ లోక్‌అదాలత్
ABN , First Publish Date - 2022-11-05T01:08:23+05:30 IST
జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 11న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.భారతి తెలిపారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారతి
ఒంగోలు (కలెక్టరేట్), నవంబరు 4: జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో ఈనెల 11న జాతీయ లోక్‌అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎ.భారతి తెలిపారు. స్థానిక జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో శుక్రవారం బీమా న్యాయవాదులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ లోక్ అదాలత్‌లో రాజీపడదగిన అన్ని క్రిమినల్, సివిల్, వివాహ సంబంధ, చెక్‌బౌన్స్, మోటార్ వాహన బీమా పరిహారం చెల్లింపు కేసుల్లో కక్షిదారులు ఇరువర్గాల వారు వచ్చి ఎటువంటి ఖర్చులేకుండా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఎక్కువ సంఖ్యలో కేసుల పరిష్కారం, బాధితులకు ఆమోదయోగ్యమైన పరిహారం కోసం న్యాయవాదులు, బీమా అధికారులు సహకరించాలని కోరారు. ప్రధానంగా చెల్లని చెక్కు కేసుల్లో ఇరు వర్గాలను పిలిపించి సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.శ్యాంబాబు, న్యాయవాదులు కరేటి శ్రీనివాసరావు, విశ్వేశ్వరరావు, రవిశంకర్ పాల్గొన్నారు.