PV Raghava Sharma's family doctors:వైద్య రంగంలో ఆ కుటుంబమే ‘ప్రత్యేకం’
ABN , First Publish Date - 2022-12-16T02:20:45+05:30 IST
రాష్ట్ర వైద్య రంగంలో ఆ కుటుంబానిది ‘ప్రత్యేక’ స్థానం. గుంటూరుకు చెందిన పీవీ రాఘవ శర్మ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లుగా రాణించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమమని వైద్య వర్గాలు చెబుతున్నాయి.

ఆరుగురు కుటుంబ సభ్యులు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లే
రాఘవశర్మ కార్డియాలజిస్ట్.. ఆయన భార్య విజయ న్యూరాలజిస్ట్
వారి పెద్ద కుమారుడు కార్డియాలజిస్ట్.. అతడి భార్య ఆంకాలజీ స్పెషలిస్ట్
తాజాగా చిన్న కుమారుడు, కోడలికి ఆలిండియా నీట్ సూపర్ స్పెషాలిటీ ఎంట్రన్స్‌లో ర్యాంకులు
గుంటూరు మెడికల్, డిసెంబరు 15: రాష్ట్ర వైద్య రంగంలో ఆ కుటుంబానిది ‘ప్రత్యేక’ స్థానం. గుంటూరుకు చెందిన పీవీ రాఘవ శర్మ కుటుంబంలోని ఆరుగురు సభ్యులు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లుగా రాణించడం రాష్ట్ర చరిత్రలోనే ప్రప్రథమమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ కుటుంబంలోని పి.నరేన్, ఆయన భార్య సిరి చందన ఆలిండియా నీట్ సూపర్ స్పెషాలిటీ కోర్సు ఎంట్రన్స్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించి, న్యూరాలజీ, నెఫ్రాలజీలో సీట్లు సాధించారు. నరేన్ న్యూరాలజీలో ఆలిండియా సెకండ్ ర్యాంక్ సాధించారు. డాక్టర్ రాఘవ శర్మ, విజయ దంపతులు గుంటూరులో లలితా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నెలకొల్పి మూడు దశాబ్దాలుగా రోగులకు సేవలు అందిస్తున్నారు. రాఘవశర్మ కార్డియాలజిస్ట్. విజయ న్యూరాలజిస్ట్. వీరి పెద్ద కుమారుడు అనురాగ్ కార్డియాలజీ పూర్తి చే శారు. అమెరికాలో వ్యాస్క్యులర్ సర్జరీలో స్పెషలైజేషన్ పూర్తి చేసిన అతడు... తాజాగా అయోర్టిక్ వాల్వ్ రీప్లే్‌సమెంట్ స్పెషలైజేషన్ చేసేందుకు హంగేరి రాజధాని బుడాపెస్ట్ వెళ్లారు. ఇతడి భార్య స్రవంతి కేన్సర్ స్పెషలిస్ట్. మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఆమె ఆంకాలజీ పూర్తి చేశారు. ఆమె కూడా కేన్సర్ వైద్య రంగంలో ఉన్నత శిక్షణ కోసం మాంఛెస్టర్ (ఇంగ్లాండ్)లోని క్రిస్టీ హాస్పిటల్‌కు వెళుతున్నారు. తాజాగా వారి చిన్న కుమారుడు నరేన్ మద్రాస్ మెడికల్ కాలేజీలో న్యూరాలజీ కోర్సులో చేరగా, ఆయన సతీమణి సిరి చందనకు శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ (చెన్నై)లో సీటు సాధించారు.
రోగులకు మెరుగైన సేవలే లక్ష్యం
తండ్రి రాఘవ శర్మ వారసత్వాన్ని నిలబెడుతూ పెద్ద కుమారుడు ఇంటర్వెన్షల్ కార్డియాలజి్‌స్టగా ఎదగ్గా, తల్లి విజయ వారసత్వాన్ని తీసుకుంటూ చిన్నకుమారుడు నరేన్ న్యూరాలజీ కోర్సును ఎంచుకోవడం విశేషం. అరుదైన ఘనతను సాధించిన రాఘవశర్మ కుటుంబాన్ని గుంటూరు ఐఎంఏ ప్రతినిధులు అభినందించారు. నీట్ న్యూరాలజీ విభాగంలో ఆలిండియా సెకండ్ ర్యాంక్ సాధించిన నరేన్, ఇంటర్వెన్షల్ న్యూరాలజిస్టుగా ఎదిగి, పక్షవాత రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు.