పోలమాంబ ఆలయంలో గోవుల గల్లంతు
ABN , First Publish Date - 2022-09-08T05:20:56+05:30 IST
పెదవాల్తేరు పోలమాంబ ఆలయంలోని గోశాలలో మూడు గోవులు గల్లంతయ్యాయి. భక్తులు అమ్మవారికి సమర్పించిన గోవులను సంరక్షించడానికి ఇక్కడ గోశాల నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం వరకు అక్కడ తొమ్మిది గోవులుండగా, వాటిలో మూడు తక్కువగా ఉన్న విషయం గుర్తించిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ శంకర్‌రెడ్డి దేవదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

విశాఖపట్నం, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): పెదవాల్తేరు పోలమాంబ ఆలయంలోని గోశాలలో మూడు గోవులు గల్లంతయ్యాయి. భక్తులు అమ్మవారికి సమర్పించిన గోవులను సంరక్షించడానికి ఇక్కడ గోశాల నిర్వహిస్తున్నారు. వారం రోజుల క్రితం వరకు అక్కడ తొమ్మిది గోవులుండగా, వాటిలో మూడు తక్కువగా ఉన్న విషయం గుర్తించిన ట్రస్ట్ బోర్డు చైర్మన్ శంకర్‌రెడ్డి దేవదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో అసిస్టెంట్ కమిషనర్ శిరీష బుధవారం సాయంత్రం అక్కడికి వెళ్లి విచారణ చేపట్టారు. ఆలయ ఈఓ శేఖర్ సెలవులో ఉండడంతో మిగిలిన ఉద్యోగులను ప్రశ్నించారు. సింహాచలం గోశాలకు పంపించామని మొదట వారు అవాస్తవాలు చెప్పారు. వారికి ఇచ్చినట్టు రశీదు చూపించాలని ట్రస్టు బోర్టు సభ్యులు డిమాండ్ చేయడంతో తెల్లముఖం వేశారు. ఆ తరువాత ఒక ఆవుకు ఆరోగ్యం సరిగా లేదని, దాంతో పాటు దూడను, ఒక ఎద్దును సాగర్‌నగర్‌లో ఒక రైతుకు ఇచ్చామని వెల్లడించారు. అవి అక్కడ కూడా ఉన్నాయో లేదోననే అనుమానంతో ట్రస్టుబోర్డు సభ్యులు వెళ్లి చూడగా, ఆవు, దూడ తప్ప ఎద్దు కనిపించలేదు. దీనిపై వారు విలేకరులతో మాట్లాడుతూ, ఆలయ అధికారులు ఏ విషయాలను ట్రస్టు బోర్డుకు చెప్పడం లేదని, వారే సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై తాము చేసిన సూచనలు పట్టించుకోవడం లేదన్నారు. ఆలయంలో విద్యుత్ వైర్లు ఎక్కడికక్కడ వేలాడుతున్నాయని, ప్రమాదాలు జరగక ముందే వైరింగ్ చేయించాలని సూచిస్తే.. నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.