Amaravati Farmers: ఇంకా వీడని వైసీపీ వాసనలు.. ప్రభుత్వ ఉద్యోగుల తీరు మారేదెప్పుడు..
ABN , Publish Date - Mar 08 , 2025 | 07:30 PM
రాజధాని అమరావతి విషయంలో గత వైసీపీ సర్కార్ మూడు ముక్కలాట ఆడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయి.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిది నెలలు గడుస్తున్నా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్లో మాత్రం వైసీపీ మత్తు ఇంకా వీడినట్లు లేదు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నిరంతరం కృషి చేస్తుంటే సదరు అధికారులు మాత్రం అడుగడుగునా అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా జీతం తీసుకుంటూ వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఇవాళ (శనివారం) గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఘటన.
రాజధాని అమరావతి విషయంలో గత వైసీపీ సర్కార్ మూడు ముక్కలాట ఆడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమాలు జరిగాయి. అమరావతి రైతుల సైతం 1631 రోజులపాటు సుదీర్ఘంగా శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై ఆగ్రహించిన జగన్ సర్కార్ ఒక్క రాజధాని రైతులపైనే ఏకంగా 80కి పైగా కేసులు నమోదు చేసింది. వారికి మద్దతు తెలుపుతూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన వారిపైనా 350కి పైగానే కేసులు నమోదు చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ కేసులన్నీ ఎత్తివేసేలా చర్యలు తీసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారం చేపట్టిన తర్వాత లోక్ అదాలత్‍ల ద్వారా కేసులు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. దీంతో ఇప్పటికే వందల మంది రైతులపై నమోదైన పదుల కొద్దీ కేసులు పరిష్కారం అయ్యారు. రాజధాని రైతులపై నమోదైన 30 కేసులు గతేడాది డిసెంబర్ 14న ఒకేసారి పరిష్కారం అయ్యాయి.
అయితే ఇవాళ (శనివారం) నాడు మంగళగిరి కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించారు. దీంతో కేసులు పరిష్కరించుకునేందుకు అమరావతి రైతులు కోర్టు వద్దకు వచ్చారు. కానీ, సంతకం పెట్టాల్సిన కానిస్టేబుల్ మాత్రం రాలేదు. అతనికి ఫోన్ చేసినా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో వారంతా కానిస్టేబుల్ వస్తాడేమోనని కోర్టు ప్రాంగణంలోనే గంటల తరబడి ఎదురు చూసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అనే వచ్చింది. కానిస్టేబుల్ వ్యవహారంపై ఆగ్రహించిన అన్నదాతలు ఎస్పీకి సమాచారం ఇవ్వాలని వారి తరఫు న్యాయవాదిని కోరారు. ఈ మేరకు కానిస్టేబుల్ తీరుపై ఎస్పీకి సదరు న్యాయవాది ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Lokesh :తగ్గేదేలే.. ఇండియా టుడే కాంక్లేవ్‌లో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు..
Chandrababu International Womens Day: మీ గౌరవాన్ని మరింత పెంచుతా.. మహిళా దినోత్సవంలో సీఎం