వానర సైన్యం స్వైరవిహారం
ABN , First Publish Date - 2022-12-01T01:15:26+05:30 IST
జిల్లాలో అనకాపల్లి మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో కోతుల బెడద అధికంగా వుంది. సుమారు పదేళ్ల క్రితం గ్రామాల్లో ఒకటీ అరా కోతులు కనిపించగా, ఇప్పుడు అవి పదులు.. వందల సంఖ్యకు చేరాయి. పంట పొలాలు, ఖాళీ స్థలాల్లో చెట్లను ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. గుంపులుగా బయలుదేరి సమీపంలోని పొలాల్లో పంటలపై దాడి చేసి నష్టపరుస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి ఆహార పదార్థాలను, వస్తువులను ఎత్తుకెళుతున్నాయి. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కోతుల బెడద తీవ్రంగా వున్న మండలాల్లో పలువురు రైతులు వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు మానేసి సరుగుడు, సుబాబుల్ వంటి తోటలు వేసుకుంటున్నారు.

గ్రామాల్లో పెరిగిపోతున్న కోతుల బెడద
గుంపులు గుంపులుగా సంచారం
పంటలను నాశనం చేస్తున్నాయని రైతుల ఆవేదన
అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణ
ఆహార పంటల సాగుకు స్వస్తి
సరుగుడు, సుబాబుల్ తోటలు వేసుకోవాల్సిన పరిస్థితి
బుచ్చెయ్యపేట/ రావికమతం/ పాయకరావుపేట/ మాడుగుల/ కోటవురట్ల/ ఎలమంచిలి, నవంబరు 30:
జిల్లాలో అనకాపల్లి మినహా మిగిలిన అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల్లో కోతుల బెడద అధికంగా వుంది. సుమారు పదేళ్ల క్రితం గ్రామాల్లో ఒకటీ అరా కోతులు కనిపించగా, ఇప్పుడు అవి పదులు.. వందల సంఖ్యకు చేరాయి. పంట పొలాలు, ఖాళీ స్థలాల్లో చెట్లను ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. గుంపులుగా బయలుదేరి సమీపంలోని పొలాల్లో పంటలపై దాడి చేసి నష్టపరుస్తున్నాయి. ఇళ్లల్లో చొరబడి ఆహార పదార్థాలను, వస్తువులను ఎత్తుకెళుతున్నాయి. ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా కోతుల బెడద తీవ్రంగా వున్న మండలాల్లో పలువురు రైతులు వ్యవసాయ, ఉద్యాన పంటల సాగు మానేసి సరుగుడు, సుబాబుల్ వంటి తోటలు వేసుకుంటున్నారు.
జిల్లాలోని మైదాన ప్రాంతంలో కోతుల బెడద అధికంగా వున్న మండలాల్లో బుచ్చెయ్యపేట మొదటి స్థానంలో ఉంది. పొలాలపై గుంపులుగా దండెత్తి తిన్నంత వరకు తినేసి, మిగిలిన పంటను నాశనం చేస్తున్నాయి. అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే దాడి చేసి గాయపరుస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ సమస్యను పలుమార్లు రెవెన్యూ, అటవీ శాఖల అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా... తామేమీ చేయలేమని చేతులెత్తేశారని రైతులు వాపోతున్నారు. మండలంలో పది వేలకుపైగా కోతులు వుంటాయని, వీటివల్ల ఏటా రూ.4 కోట్ల మేర పంటలు నష్టపోతున్నామని వారు చెబుతున్నారు.
రావికమతం మండలంలో కొమిర, మత్స్యపురం, కవ్వగుంట, బుడ్డిబంద, రావికమతం తదితర గ్రామాల్లో కోతుల బెడద అధికంగా ఉంది. వుర్లలోవ కొండలను ఆవాసంగా చేసుకుని, సమీపంలోని పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. గతంలో పెసర, మినుము, బొబ్బర, తదితర అపరాల పంటను సాగు చేసేవాళ్లమని, కోతులు గుంపులుగా వచ్చి పిందెలు, కాయలను తినేస్తున్నాయని, చెరకు గడలు విరిచేస్తుండడంతో వేలాది రూపాయలు నష్టపోయామని గొర్లె రాము, కె.ఈశ్వరావు, గొంతిన సత్యారావు, రమణ, అప్పారావు, అల్లం పెదబ్బాయి తదితర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాయకరావుపేట మండలంలోని సత్యవరం, మంగవరం, అరట్లకోట, గోపాలపట్నం, పెంటకోట, పెదరాంభద్రపురం, శ్రీరాంపురం, మాసాహెబ్‌పేట గ్రామాల్లో కోతుల బెడద అధికంగా వుంది. గుంపులుగా వచ్చి అరటి, కొబ్బరి, తమలపాకు తోటలను నాశనం చేస్తున్నాయి. వీటి బెడదను నివారించడానికి కొండముచ్చులను రప్పించారు. తరువాత రైతులే ఎలుగుబంటి, పులి వేషాలు వేసుకుని పంట పొలాల్లో కాపలా ఉన్నారు. బాణసంచా కాల్చారు. అప్పటికి సమస్య పరిష్కారమైనా, కొద్దిరోజుల తరువాత పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చిందని సత్యవరం గ్రామానికి చెందిన కర్రి వీరబాబు అనే రైతు వాపోయారు.
మాడుగుల మండలంలో కోడూరు, ఘాటీరోడ్డు, తాటిపర్తి, గరికిబంద, మాడుగుల గ్రామాల్లో , కోటవురట మండలంలో యండపల్లి, కైలాసపట్నం, జల్లూరు, కోటవురట్ల, రాట్నాలపాలెం, గొట్టివాడ గ్రామాల్లో కోతుల సంతతి అధికంగా వుంది.
ఎలమంచిలి పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీ, మిలట్రీ కాలనీ, కొత్తపేట, యానాద్రి కాలనీ, నాగేంద్ర కాలనీ, గాంధీనగర్ ప్రాంతాల్లో వానర సైన్యం స్వైరవిహారం చేస్తున్నది. గుంపులు గుంపులుగా ఇళ్లల్లోకి చొరబడి వస్తువులు, తినుబండారాలను ఎత్తుకెళుతున్నాయి. వారిద్దామంటే దాడి చేసి కరుస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. వీధుల్లో కూడా సంచరిస్తుండడంతో మహిళలు, చిన్నపిల్లలు భయపడుతున్నారు. గతంలో మునిసిపల్ అధికారులు కొన్ని కోతులను పట్టించినప్పటికీ, తరువాత కాలంలో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.