Mallikarjun Kharge: ఖర్గే బిగ్ యూ టర్న్!
ABN, First Publish Date - 2022-12-02T23:14:19+05:30
కాంగ్రెస్ పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బిగ్ యూ టర్న్ తీసుకోబోతున్నట్లు...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బిగ్ యూ టర్న్ తీసుకోబోతున్నట్లు సమాచారం. పార్టీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఖర్గే జోడు పదవుల్లో కొనసాగే అవకాశం ఉంది. పార్టీ జాతీయ అధ్యక్ష పదవిలోనూ అలాగే రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదాలోనూ ఆయన కొనసాగే అవకాశముందని తెలుస్తోంది.
వాస్తవానికి జోడు పదవులు అడిగినందుకే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయవద్దని చెప్పింది. ఒక వ్యక్తికి ఒకే పదవి అని నాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలంతా చెప్పారు. ఉదయ్‌పూర్ సదస్సులో నిర్ణయించినట్లుగానే ఒకే వ్యక్తికి రెండు పదవులు కుదరవని తేల్చి చెప్పారు. జోడు పదవులు కుదరవని అన్నందుకు గెహ్లాట్ కూడా అధ్యక్ష పదవి ఎన్నికలకు దూరమయ్యారు. రాజస్థాన్ సీఎం పదవికే అంకితమయ్యారు.
ఖర్గే జోడు పదవుల విషయంపై నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ శనివారం సమావేశం కానుంది. ఖర్గే, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్ తదితరులు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఒక వేళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీలో ఏకాభిప్రాయం కుదరకపోతే చిదంబరం లేదా దిగ్విజయ్ సింగ్‌లలో ఒకరికి రాజ్యసభలో ప్రతిపక్ష నేత హోదా దక్కుతుంది.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి ఖర్గే రాజీనామా చేశారు. అయితే ఆ పదవిని అట్టే పెట్టుకోవాలని ఆయన యోచిస్తున్నట్లు సమాచారం. శనివారం సాయంత్రానికి ఈ విషయంలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశముంది.
Updated Date - 2022-12-02T23:14:20+05:30 IST