Hijab Iran : ఇరాన్‌లో హిజాబ్‌పై తకరారు
ABN , First Publish Date - 2022-12-05T03:58:20+05:30 IST
హిజాబ్ చట్టాలపై నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. గడిచిన రెండున్నర నెలలుగా మహిళలు చేస్తున్న ఆందోళనలకు ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు తలవంచిందని.. హిజాబ్ చట్టాలను సమీక్షిస్తోందని, నైతిక పోలీసుల విభాగాన్ని రద్దు చేసిందని

ఆ చట్టాన్ని సమీక్షిస్తున్నాం.. 1-2 వారాల్లో ఫలితం
మొరాలిటీ పోలీసు విభాగాలూ రద్దు చేశాం
న్యాయవ్యవస్థతో ఆ విభాగాలకు సంబంధం లేదు
ఆ దేశ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ వెల్లడి!
ఆయన ప్రకటనపై ఇరాన్ హోం శాఖ మౌనం
దేశంలో మూడు రోజుల ఆర్థిక బహిష్కరణకు
పిలుపు ఇచ్చిన నిరసనకారులు
టెహ్రాన్, డిసెంబరు 4: హిజాబ్ చట్టాలపై నిరసనలతో అట్టుడుకుతున్న ఇరాన్‌లో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. గడిచిన రెండున్నర నెలలుగా మహిళలు చేస్తున్న ఆందోళనలకు ఇరాన్ ప్రభుత్వం ఎట్టకేలకు తలవంచిందని.. హిజాబ్ చట్టాలను సమీక్షిస్తోందని, నైతిక పోలీసుల విభాగాన్ని రద్దు చేసిందని పేర్కొంటూ స్థానిక వార్తా సంస్థ ఐఎ్‌సఎన్‌ఏ ప్రచురించిన కథనం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ‘‘నైతిక పోలీసులకు న్యాయవ్యవస్థతో సంబంధం లేదు. ఆ విభాగాన్ని రద్దు చేశాం’’ అని ఇరాన్ అటార్నీ జనరల్ మొహమ్మద్ జాఫర్ మోంటజేరి శనివారం రాత్రి ప్రకటించినట్టు ఐఎ్‌సఎన్‌ఏ తన కథనంలో పేర్కొంది. స్థానికంగా జరిగిన ఒక మత సదస్సులో.. ‘నైతిక పోలీసుల విభాగాన్ని ఎందుకు మూసేశారు?’ అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు అటార్నీ జనరల్ ఈ సమాధానం ఇచ్చారని పేర్కొంది. అంతేకాదు.. ‘‘హిజాబ్‌కు సంబంధించిన చట్టాన్ని మార్చాల్సిన అవసరం ఉందా? అనే అంశంపై పార్లమెంటు, న్యాయవ్యవస్థ పనిచేస్తున్నాయి. ఈ మేరకు సమీక్ష బృందం బుధవారం పార్లమెంటు సాంస్కృతిక కమిషన్‌తో భేటీ అయ్యింది. ఒకటి రెండువారాల్లో ఏ విషయం తేలుతుంది’’ అని ఆయన తెలిపినట్టు వెల్లడించింది. అయితే.. నైతిక పోలీసుల విభాగాన్ని రద్దు చేశారన్న ఏజీ వ్యాఖ్యలను ఇరాన్ హోం శాఖ అధికారికంగా ధ్రువీకరించకపోవడం.. అసలు ఈ అంశానికి, అటార్నీ జనరల్‌కు ఎలాంటి సంబంధమూ లేదని ఆ దేశ అధికారిక మీడియా పేర్కొనడం గమనార్హం. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దేశంలోని నిరసనకారులు మూడు రోజుల ఆర్థిక బహిష్కరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అనంతరం బుధవారం టెహ్రాన్‌లోని ఆజాదీ కూడలిలో ర్యాలీ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. విద్యార్థి దినోత్స వం సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ విద్యార్థులను ఉద్దేశించి టెహ్రాన్‌లో ప్రసంగించనున్నారు.
ఆందోళనల్లో 448 మంది మృతి..
మహ్సా అమిని మరణానంతరం చెలరేగిన ఆందోళనలను అణచివేసేందుకు భద్రతా దళాలు చేపట్టిన చర్యల్లో సుమారు 448 మంది మరణించారు. 14,000మందికిపైగా ఇప్పటికీ జైళ్లలో ఉన్నారు. హిజాబ్‌ను తప్పనిసరి చేసిన చట్టాన్నే రద్దు చేయాలని ఇరాన్‌లో ప్రధానమైన రిఫార్మిస్ట్ పార్టీ సెప్టెంబరులో పిలుపునిచ్చింది. ఆ చట్టాన్నే రద్దు చేసేలా చర్యలు చేపట్టాలని మాజీ అధ్యక్షుడుమొహమ్మద్ ఖతామీ నేతృత్వంలోని ది యూనియన్ ఆఫ్ ఇస్లామిక్ ఇరాన్ పీపుల్ పార్టీ కూడా శనివారం డిమాండ్ చే సింది.
నెజాద్ హయాం నుంచి మొరాలిటీ పోలీస్..
కరుడుగట్టిన అహ్మదీ నెజాద్ దేశాధ్యక్షుడిగా ఉన్న సమయంలో మొరాలిటీ పోలీసు విభాగాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. గష్ట్-ఎ-ఇర్షాద్, గైడెన్స్ పెట్రోల్ పేర్లతో ఈ విభాగాలను పిలిచేవారు. 2006 నుంచి ఈ విభాగాలు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించడం సహా వారి వస్త్రధారణ సంప్రదాయబద్ధంగా ఉండేలా వీరు కఠిన చర్యలు తీసుకుంటారు. అమెరికా మద్దతుతో కొనసాగిన రాచరిక వ్యవస్థను 1979 విప్లవం ద్వారా కూలగొట్టి ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడింది. ఆ తర్వాత నాలుగేళ్లకు (1983 నుంచి) ఇరాన్‌లో హిజాబ్ తప్పనిసరి చేశారు. తొలుత 15 ఏళ్లపాటు మొరాలిటీ పోలీసులు హెచ్చరికలతో సరిపెట్టారు. ఆ తర్వాత నుంచి అరెస్టు చేయడం, కఠిన చర్యలు చేపట్టడం మొదలెట్టారు. ఈ బృందాల్లో పురుషులు ఆకుపచ్చ యూనిఫాం ధరించగా, మహిళలు తల, ఇతర శరీరభాగాలు పూర్తిగా కప్పి ఉంచే నల్లటి యూనిఫాం ధరించేవారు. ఈ విభాగాల పాత్ర క్రమక్రమంగా పెరుగుతూ, ఎల్లప్పుడూ వివాదాస్పదంగా ఉండేది.
రౌహానీ పాలనలో సడలించినా..
మితవాద హసన్ రౌహానీ దేశాధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో వస్త్రధారణపై సడలింపులు ఇచ్చారు. దీంతో మహిళలు బిగుతు జీన్స్, రంగురంగుల వస్ర్తాన్ని హిజాబ్‌గా ధరించడం మొదలైంది. అయితే, ఈ ఏడాది జూలైలో అతి సాంప్రదాయవాది ఇబ్రహీం రైసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హిజాబ్ చట్టం అమలుకు అన్ని ప్రభుత్వ విభాగాలనూ మోహరించారు. ఇరాన్‌కు శత్రుదేశమైన సౌదీ అరేబియా కూడా మహిళల డ్రెస్ కోడ్, ఇతర ప్రవర్తనలపై నిబంధనల అమలుకు మొరాలిటీ పోలీసులను నియమించడం మొదలైంది. అయితే, కఠినమైన ముద్రను తొలగించుకునే చర్యల్లో భాగంగా 2016 నుంచి సౌదీలోని సున్నీ ముస్లిం రాజ్యం ఆ విభాగాన్ని వేరే విధులకు మళ్లించింది.