ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Year Ender 2022: బాబోయ్.. 2022లో మన దేశంలో ఇన్ని జరిగాయా.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా..

ABN, First Publish Date - 2022-12-24T20:11:23+05:30

కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే తరుణంలో గత సంవత్సరంలో జరిగిన కీలక పరిణామాలను రివైండ్ చేసుకోవడం అనేది పరిపాటి. 2022లో కూడా ఆ సమయం రానే వచ్చింది. 2023లోకి అడుగుపెట్టేందుకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే తరుణంలో గత సంవత్సరంలో జరిగిన కీలక పరిణామాలను రివైండ్ (2022 Rewind) చేసుకోవడం అనేది పరిపాటి. 2022లో కూడా ఆ సమయం రానే వచ్చింది. 2023లోకి (New Year 2023) అడుగుపెట్టేందుకు 10 రోజుల సమయం కూడా లేదు. 2022 కాలగర్భంలో కలిసే సమయం, గోడకున్న పాత క్యాలెండర్లను తీసి పక్కన పెట్టాల్సిన సమయం ముంచుకొస్తోంది. ఈ క్రమంలో.. 2021 మిగిల్చిన కరోనా చేదు జ్ఞాపకాలను చెరిపేసిన 2022లో దేశవ్యాప్తంగా కొన్ని కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశ రాజకీయాల్లో (Indian Politics) అనేక కీలక మార్పులకు 2022వ సంవత్సరం వేదికగా నిలిచింది. దేశంలో కొన్ని విషాదాలకు (Key Happenings 2022) కూడా 2022వ సంవత్సరం సాక్ష్యంగా నిలిచింది. పలు రాష్ట్రాల్లో ఎన్నికలు (Elections 2022) జరిగాయి. మరికొన్ని చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. ఒక రాష్ట్రంలోని ప్రభుత్వంలో సంక్షోభం తలెత్తితే, మరో రాష్ట్రంలోని ప్రతిపక్షంలో వర్గ పోరు చర్చనీయాంశమైంది.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జోష్ నింపగా.. మరికొన్ని రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీని నీరుగార్చాయి. విపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ వరుస ఓటములతో డీలా పడిపోయినప్పటికీ.. హిమాచల్‌ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకుని బీజేపీకి షాకిచ్చింది. పంజాబ్, ఢిల్లీ కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయం ఆ పార్టీలో ఇతర రాష్ట్రాల్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న సంకల్పానికి మరింత ఊతమిచ్చింది. 2022లో కరోనా భయం పెద్దగా కనిపించనప్పటికీ దేశ రాజకీయాల్లో మాత్రం పెను మార్పులే చోటుచేసుకున్నాయని చెప్పక తప్పదు. రాజకీయంతో పాటు పలు కీలక పరిణామాలకు కూడా 2022 కారణభూతంగా నిలిచింది.

1. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం- షిండే సీఎం (Maharashtra Political Crisis)

2022లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం ‘మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం’ (Maharashtra Conflict). శివసేనలో (Shivsena Conflicts) చీలిక రావడం, రెబల్ ఎమ్మెల్యేలతో ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) క్యాంపు రాజకీయం, సీఎం పదవికి ఉద్ధవ్ రాజీనామా (Uddhav Thackeray Resign) చేయడం, ఏక్‌నాథ్ షిండే వర్గానికి బీజేపీ మద్ధతు తెలపడం (BJP Eknath Shinde), శివసేన రెబల్ ఎమ్మెల్యేల వర్గం, బీజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని (Maharashtra Government) ఏర్పాటు చేయడం, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే (Maharashtra CM Eknath Shinde) ప్రమాణ స్వీకారం, ఉప ముఖ్యమంత్రిగా ఫడణవీస్ (Deputy CM Fadnavis) ప్రమాణ స్వీకారం.. ఇలా కొన్ని రోజుల పాటు మహారాష్ట్ర సంక్షోభం ఎపిసోడ్ అనేక మలుపుల మధ్య దేశవ్యాప్తంగా హాట్ డిబేట్‌కు తావిచ్చింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీలో ఏక్‌నాథ్ షిండే కూర్చుంటారని ఎవరూ ఊహించలేదు. దేవేంద్ర ఫడణవీస్ నోట సీఎంగా షిండే పేరు వినబడినప్పుడు దేశం ఆశ్చర్యపోయింది. గోవా హోటల్‌లో మకాం వేసి ఉన్న షిండే వర్గం ఎమ్మెల్యేలు కూడా ఆశ్చర్యానందాలతో గెంతులు వేసిన దృశ్యాలు ఛానెళ్ళలో ప్రసారమయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రిగా షిండే ప్రమాణస్వీకారం చేస్తారని అంతా అనుకుంటున్న దశలో మరో ఆశ్చర్యకరమైన పరిణామం.

ఫడణవీస్ తాను ఏ పదవీ చేపట్టనని ప్రకటించారు. తన సంపూర్ణ సహకారంతో షిండే మహారాష్ట్రను ఏలుకుంటారని ఆయన ప్రకటించగానే, తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయను అని షిండే వెంటనే హామీ ఇచ్చారు కూడా. కానీ, రెండు గంటల్లో కథ తారుమారై, పదిరోజులుగా అందరూ అనుకుంటున్నదానికి భిన్నంగా, ఉభయుల స్థానాలు తారుమారై ప్రమాణ స్వీకారాలు జరిగిపోయాయి. బీజేపీ అధిష్ఠానం (BJP High Command) ఆదేశాలతో ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు ఫడణవీస్ ఎట్టకేలకు అంగీకరించారు. ఇలా.. నాటకీయ పరిణామాల మధ్య మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా ఫడణవీస్ బాధ్యతలు చేపట్టడంతో మహారాష్ట్ర ప్రభుత్వంలో (BJP Shinde Alliance Government) నెలకొన్న అస్థిరతకు తెరపడింది.

2. బీహార్‌ను కోల్పోయిన బీజేపీ.. జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వ ఏర్పాటు (Nitish-Tejashwi Government)

2022లో రాజకీయంగా జరిగిన మరో కీలక పరిణామం బీజేపీతో నితీష్ తెగతెంపులు (Nitish splits with BJP). ‘డబుల్‌ ఇంజన్‌ సర్కారు’ (Double Engine Government) నినాదంతో.. అప్రతిహతంగా అప్పటివరకూ జైత్రయాత్ర సాగించి ఒక్కో రాష్ట్రాన్ని తన ఖాతాలో వేసుకుంటున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి బిహార్‌లో నితీష్ రూపంలో (Bihar Politics) ఎదురుదెబ్బ తగిలింది. ఆ రాష్ట్రం కమలదళం నుంచి చేజారిపోయింది. ఎన్డీయే సర్కారును (Bihar NDA Government) నడిపిన జనతాదళ్‌(యునైటెడ్‌) నేత నితీశ్‌ కుమార్‌.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఇలా జరిగింది. ఆ సందర్భంలో గవర్నర్‌ ఫాగు చౌహాన్‌ను కలిసి ఈ మేరకు నితీష్ తన రాజీనామాను సమర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను సీఎం పదవికి రాజీనామా చేసిన విషయాన్ని నిర్ధారించారు. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగాలని తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏకాభిప్రాయంతో నిర్ణయించారని వివరించారు. ఆ వెంటనే ఆయన మాజీ సీఎం రబ్రీదేవి నివాసానికి చేరుకున్నారు. అక్కడ రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్‌తో భేటీ అయ్యారు.

బీజేపీకి వ్యతిరేకంగా 2013లో ఏర్పాటైన మహా గఠ్బంధన్‌ను పునరుద్ధరించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై వీరు చర్చించారు. ఈ కూటమిలో 79 స్థానాలున్న ఆర్జేడీతోపాటు.. జేడీయూ(45 + 1 స్వతంత్ర), కాంగ్రెస్‌ (19), సీపీఐఎంఎల్‌(12), సీపీఐ(2), సీపీఎం(2), మాజీ సీఎం మాంఝీ నేతృత్వంలోని హెచ్‌ఏఎం(4 స్థానాలు) ఉన్నాయి. 243 స్థానాలున్న బిహార్‌ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్‌ ఫిగర్‌ 122 కాగా.. ఈ కూటమి బలం 164గా ఉంది. మహాగఠ్బంధన్‌లోని పార్టీలన్నీ నితీశ్‌కు మద్దతివ్వడంతో ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎంగా నితీశ్‌తో పాటు.. ఉపముఖ్యమంత్రిగా తేజస్వీ బాధ్యతలు స్వీకరించారు. 2015 ఎన్నికల తర్వాత మహాగఠ్బంధన్‌ ప్రభుత్వంలోనూ తేజస్వీ ఇవే బాధ్యతలను స్వీకరించారు. లాలూ మరో కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ మంత్రిగా పనిచేశారు. వీరి రెండేళ్ల కూటమికి 2017లో బ్రేక్‌ పడింది. అప్పట్లో ఆర్జేడీ అవినీతిని సాకుగా చూపిన నితీశ్‌ కుమార్‌ బీజేపీ పంచన చేరి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ జేడీయూ - బీజేపీ కూటమి విజయం సాధించింది. జేడీయూకు తక్కువ మెజారిటీ ఉన్నా.. నితీశ్‌కే సీఎంగా అవకాశం దక్కింది. అయితే.. బీజేపీ ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తోందని, తన సర్కారును రిమోట్‌ కంట్రోల్‌లా మార్చాలని చూస్తోందని నితీశ్‌ ఇంతకాలం లోలోపల రగిలిపోతూ వచ్చారు. దాంతో.. బీజేపీకి గుడ్‌బై చెప్పి.. మళ్లీ పాతకూటమితో ప్రభుత్వాన్ని (Nitish-Tejashwi Government) ఏర్పాటు చేశారు.

3. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ఘన విజయం (President Election 2022)

2022 జూలైలో జరిగిన 15వ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము (Draupadi Murmu Won) తిరుగులేని మెజారిటీతో విజయం సాధించారు. పది గంటల పాటు జరిగిన ఓట్ల లెక్కింపులో ఆమె 64 శాతం ఓట్లు సాధించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్ట్రోరల్‌ కాలేజీలో ఆమెకు 6,76,803 ఓట్లు దక్కగా, ప్రత్యర్థి, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు (Yashwant Sinha) 3,80,177 ఓట్లు లభించాయి. రిటర్నింగ్‌ అధికారి పీసీ మోదీ అధికారికంగా ద్రౌపది ముర్మును (President Draupadi Murmu) విజేతగా ప్రకటించారు. ఇప్పటివరకు రాష్ట్రపతి పదవిని అధిరోహించిన వారిలో ముర్ముయే అత్యంత పిన్న వయస్కురాలు. తూర్పు భారతంలోని మారుమూల గ్రామంలో గిరిజన కుటుంబంలో జన్మించిన ఆడబిడ్డను రాష్ట్రపతిగా ఎన్నుకున్న అరుదైన పరిణామం. ముర్ముకు ముందున్న రాష్ట్రపతులంతా స్వాతంత్య్రం రాకముందు జన్మించిన వారు కాగా ఆమె స్వాతంత్ర్యానంతర తరానికి చెందిన వారు. నరేంద్ర మోదీ కూడా స్వాతంత్ర్యానంతరం జన్మించిన తొలి ప్రధాని.

రాష్ట్రపతి పదవికి ముర్ము ఎన్నిక తరం మార్పునకు సంకేతం. మూడో రౌండ్‌లోనే ముర్ముకు చెల్లిన ఓట్లలో 53 శాతం రావడంతో ఆమె విజయం ఖాయమైంది. అప్పటికి ఇంకా పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్‌ ఫలితాలు రాగానే యశ్వంత్‌ సిన్హా తన ఓటమిని అంగీకరించి, కాబోయే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. భయం, పక్షపాతం లేకుండా ఆమె రాజ్యాంగ పరిరక్షకులుగా వ్యవహరిస్తారని ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారన్నారు. తనను విపక్ష అభ్యర్థిగా ఏకాభిప్రాయంతో నిలబెట్టి, ఓట్లేసిన పార్టీలకు ప్రజాప్రతినిధులకు సిన్హా కృతజ్ఞతలు తెలిపారు. గీతలో కృష్ణుడు చెప్పినట్లుగా కర్మయోగ సిద్ధాంతాన్ని అనుసరించి, విపక్షాల అభ్యర్థి ఆఫర్‌ను స్వీకరించానన్నారు. దేశంపై ప్రేమతో మనస్సాక్షిని అనుసరించి బాధ్యతను నెరవేర్చానన్నారు.

4. 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్‌ ధన్‌ఖడ్‌ (14th Vice President Jagdeep Dhankhar)

ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌ (Jagdeep Dhankhar Won) ఘన విజయం సాధించడం 2022లో జరిగిన మరో కీలక పరిణామం. ఆగస్ట్ 11న ఆయన దేశ 14వ ఉపరాష్ట్రపతిగా (14th Vice President Jagdeep Dhankhar) ప్రమాణ స్వీకారం చేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 725(92.94%) ఓట్లు పోలయ్యాయి. నిజానికి పార్లమెంట్‌ ఉభయ సభల్లో సభ్యుల సంఖ్య 788 కాగా.. 8 ఖాళీలున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) ఓటింగ్‌కు దూరంగా ఉంది. అయినా.. ఆ పార్టీకి చెందిన శిశిర్‌ కుమార్‌ అధికారి, దివ్యేందు అధికారి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలో మొత్తం 725 ఓట్లు పోలవ్వగా.. 15 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మిగతా వాటిల్లో ధన్‌ఖడ్‌కు 528, యూపీఏ బలపరిచిన అభ్యర్థి మార్గరేట్‌ అల్వాకు (Margaret Alva) 182 ఓట్లు వచ్చాయి. ధన్‌ఖడ్‌కు 346 ఓట్ల ఆధిక్యం లభించింది. ధన్‌ఖడ్‌ 1951 మే 18న రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లా కితానా గ్రామంలో ఓబీసీ వర్గానికి (జాట్‌) చెందిన కుటుంబంలో.. గోఖల్‌ చంద్‌, కేసరి దేవి దంపతులకు జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పుచ్చుకున్నారు.

రాజస్థాన్‌ హైకోర్టు, సుప్రీంకోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు. పారిస్‌లోని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ కోర్టులో సభ్యుడిగా సేవలందించారు. 1989 లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్‌(జేడీ) తరఫున ఎంపీగా గెలుపొందారు. 1990లో కేంద్రమంత్రి(పార్లమెంటరీ వ్యవహారాలు)గా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రె్‌సలో చేరారు. 1993-98 మధ్య అజ్మీర్‌ జిల్లాలోని కిషన్‌గఢ్‌ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై.. రాజస్థాన్‌ అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించారు. 2008లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2019 నుంచి.. ఈ ఎన్నిక వరకు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా కొనసాగారు. గవర్నర్‌గా ఉన్నప్పుడు ఆయన పలుమార్లు మమత ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేసి, వార్తల్లో నిలిచారు.

5. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు (Five States Elections)

2022 ఆరంభంలో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అంశం ఏదన్నా ఉందంటే అది ఐదు రాష్ట్రాలు ఎన్నికలని (Five States Elections) చెప్పక తప్పదు. ఉత్తరప్రదేశ్‌ను (Uttar Pradesh Election Result 2022) బుల్డోజర్‌ దున్నేసింది. రికార్డులను బద్దలు కొడుతూ యోగి ఆదిత్యనాథ్‌ పార్టీని (CM Yogi Adityanath) విజయ పథంలో నడిపారు. గత ఎన్నికలతో పోలిస్తే సీట్లు కాస్త తగ్గినా.. అప్పటి కంటే ఎక్కువ ఓట్లను సాధించారు. యూపీ చరిత్రలో మూడున్నర దశాబ్దాల తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాయకుడిగా నిలిచారు.

ఉత్తరాఖండ్‌ (Uttarakhand), మణిపూర్‌ (Manipur), గోవాల్లో (Goa) మరోసారి కాషాయ జెండా రెపరెపలాడింది. వరుసగా రెండుసార్లు గెలవరని పేరున్న యూపీ, ఉత్తరాఖండ్‌లను బీజేపీ వరుసగా రెండోసారి దక్కించుకోవడం విశేషం. క్రైస్తవులు గణనీయంగా ఉండే గోవా, మణిపూర్‌ల్లో కాషాయ జెండా ఎగిరింది. ఉత్తరప్రదేశ్‌లోని ముస్లిం ప్రాబల్య నియోజకవర్గాల్లోనూ కమలం పైచేయి సాధించింది. అన్ని వర్గాలూ అక్కున చేర్చుకున్న పార్టీగా బీజేపీ నిలిచింది. ఐదు రాష్ట్రాల్లో నాలుగుచోట్ల కమలం మరింతగా విరబూసింది. మిగిలిన పంజాబ్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఊడ్చేసింది.

6. అన్నాడీఎంకేలో ఎడతెగని సంక్షోభం (OPS vs EPS)

తమిళనాట ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) చేతుల్లోకి వెళ్లాయి. అందుకు 2022 వేదికైంది. ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ ఎన్నికయ్యారు. దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ స్థాపించిన ఆ పార్టీ.. మరో దివంగత ముఖ్యమంత్రి జయలలిత చేతుల్లో పెరిగి పెద్దదైంది. జయ మరణానంతరం శశికళను వరించిన ఆ పార్టీ.. తదనంతరం జరిగిన పరిణామాల్లో ఎడప్పాడి పళనిస్వామి, ఒ.పన్నీర్‌సెల్వం నేతృత్వంలోని ద్వంద్వ నాయకత్వం చేతుల్లోకి వెళ్లింది. అయితే పార్టీపై పూర్తి పట్టు సాధించిన ఎడప్పాడి.. పగ్గాలను పన్నీర్‌సెల్వంతో పంచుకోవడానికి విముఖత చూపడంతో పాటు ఆ మేరకు చక్రం తిప్పారు. దాంతో సర్వసభ్యమండలి సమావేశం పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ను ఎన్నుకుంది.

అంతేగాక అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శిగా దివంగత జయలలితను ఎన్నుకుంటూ గతంలో చేసిన తీర్మానాన్ని రద్దు చేసింది. అదే సమయంలో పార్టీ నియమ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్)ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. సర్వసభ్యమండలి సమావేశంలో ఈపీఎస్‌ మాట్లాడుతూ.. ఓపీఎస్‌ పార్టీ ద్రోహానికి పాల్పడ్డారని, తమ ప్రత్యర్థులతో చేతులు కలిపి పార్టీని బలహీనపరిచేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. పన్నీరు సెల్వం ఈ పరిణామాలపై న్యాయస్థానాలను ఆశ్రయించడంతో అన్నాడీఎంకేలో ఈ సంక్షోభానికి ముగింపు ఎప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది.

7. అగ్నిపథ్‌పై అట్టుడికిన దేశం.. ఆగని నియామకాలు (Aagnipath Scheme)

ఆర్మీ యూనిఫాం వేసుకుని, సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం గస్తీకాయడం ఓ అదృష్టం! అలాంటి అవకాశం అందరికీ రాదు! లక్షల మంది ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొంటే వేల మందికే జవాన్‌‌గా అవకాశం దొరుకుతుంది! కానీ, యువతకు ఆర్మీలో చేరాలనేది ఓ సాహసం.. ఓ కల! అలాంటి యువకుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్‌’ పేరుతో ‘టూర్‌ ఆఫ్‌ డ్యూటీ’ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా స్వచ్ఛందంగా సైన్యంలో సేవలందించేందుకు యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు. సైన్యంలో మూడేళ్ల పాటు సేవలందించే అవకాశం కల్పిస్తారు. అగ్నిపథ్‌లో సైన్యంలో చేరే జవాన్లను ‘అగ్ని వీర్‌’గా పిలుస్తారు. వీరు జనరల్‌(యుద్ధ సైనికులు), టెక్నికల్‌ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. భారత రక్షణ శాఖలో 2.47 లక్షల ఖాళీలున్నాయి. వీటిలో 1.25 లక్షలకు పైగా ఆర్మీలోనే ఖాళీలున్నాయని, వాటిలో సింహభాగం జవాన్‌ పోస్టులేనని అంచనా. ‘అగ్నిపథ్’లో భాగంగా సైన్యం/త్రివిధ దళాల్లో మూడేళ్ల పాటు సేవలందించిన యువకులకు ఇతర ప్రభుత్వోద్యోగాలు, కార్పొరేట్‌ కొలువుల్లో ప్రాధాన్యత ఉంటుంది. పలు కార్పొరేట్‌ సంస్థలు ఇప్పటికే దీనిపై కేంద్రానికి హామీ ఇచ్చినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. మూడేళ్ల సేవల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని ఆయా విభాగాల్లో ‘శాశ్వత’ ఉద్యోగి/జవానుగా కొనసాగించే అవకాశాలుంటాయి. అయితే.. ఈ ‘అగ్నిపథ్’ ప్రకటనతో దేశవ్యాప్తంగా రేగిన ఆందోళన అంతాఇంతా కాదు. సైన్యంలో నియామకాల కోసం కేంద్రం కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్‌’పై.. ఆర్మీ అభ్యర్థులు ఆగ్రహంతో రగిలిపోయారు.

ఆర్మీ ర్యాలీల్లో అర్హత సాధించి.. వైద్యపరీక్షలు కూడా పూర్తిచేసుకుని పరీక్షలు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న వేళ కొత్త పథకాన్ని ప్రకటించడంతో మండిపడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారం దాదాపు రెండు వేల మంది సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశించి పలు రైళ్లను ధ్వంసం చేశారు. ఇంజన్లు, బోగీలకు నిప్పు పెట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. వారిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు జరిపిన కాల్పుల్లో.. వరంగల్‌ జిల్లాకు చెందిన యువకుడు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం 8.45 గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల దాకా.. జరిగిన ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారుల దాడిలో పలువురు పోలీసులు, ఆర్పీఎఫ్‌ సిబ్బందికి గాయాలయ్యాయి. మొత్తం ఏడు రాష్ట్రాల్లో ‘అగ్నిపథ్’పై ఆగ్రహ జ్వాల రేగింది.

8. నోయిడాలో ట్విన్ టవర్స్ కూల్చివేత (Noida Twin Tower Demolition)

2022వ సంవత్సరం భారతదేశ చరిత్రలోనే ఒక శిథిల చిత్రానికి సాక్ష్యంగా నిలిచింది. దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్‌) పరిధిలోని నోయిడా సెక్టార్‌ 93ఏలో.. నిబంధనలను ఉల్లంఘించి గ్రీన్‌జోన్‌లో అక్రమంగా నిర్మించిన ‘సూపర్‌టెక్‌ జంటహర్మ్యాల’ను 2022, ఆగస్ట్‌లో కూల్చివేశారు. ఈ రెండు భవనాల్లో ఒకటి (ఎపెక్స్‌).. 32 అంతస్తుల భవనం కాగా, రెండోది (సియాన్‌) 29 అంతస్తుల భవంతి. వీటిని ‘వాటర్‌ఫాల్‌ టెక్నిక్‌’ అనే నియంత్రిత విధానంలో చుట్టుపక్కల భవనాలకు ఎలాంటి ప్రమాదమూ లేకుండా కూల్చివేశారు. ఇందుకోసం భవనాల పునాదుల్లో 9640 రంధ్రాలు చేసి వాటిలో 3,700 కిలోల పేలుడు పదార్థాలను కూరి 20 వేల సర్క్యూట్లను అమర్చి.. అవి పేలిపోయేలా 100 మీటర్ల దూరం నుంచి స్విచ్‌ నొక్కారు! అంతే.. చూస్తూచూస్తూండగానే అంతెత్తు భవనాలూ.. 12 సెకన్లలో కాళ్ల కింద నేల కదిలిపోయినట్టుగా పేకమేడల్లా కూలిపోయాయి! ఆ సమయంలో పెద్ద ఎత్తున రేగిన ధూళి మేఘం.. ఇసుక తుఫానును, అణ్వస్త్రప్రయోగాలు జరిపినప్పుడు ఏర్పడే అణు ధూళిని తలపించిందంటే అతిశయోక్తి కాదు.

నోయిడా ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతకు దాదాపు రూ.18 కోట్ల దాకా ఖర్చయింది. ఇందులో రూ.5 కోట్లను మాత్రమే సూపర్‌టెక్‌ సంస్థ చెల్లించింది. మిగతా రూ.13 కోట్లనూ శిథిలాలను విక్రయించడం ద్వారా ఎడిఫిస్‌, జెట్‌ డెమాలిషన్‌ సంస్థలు సమకూర్చుకోనున్నాయి. మనదేశంలో ఇలా హైరైజ్‌ బిల్డింగ్‌ను కూల్చివేయడం ఇదే మొదటిసారి కాదు. కోస్టల్‌ రెగ్యులేషన్‌ జోన్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను.. కొచ్చి(కేరళ)లోని మరదు మునిసిపాలిటీలో 2020లో 18 అంతస్తుల భవనాన్ని కూల్చివేశారు. ఆ కూల్చివేతను కూడా ఎడిఫిస్‌ ఇంజనీరింగ్‌, జెట్‌ డెమాలిషన్స్‌ కలిసే చేపట్టడం గమనార్హం. కాకపోతే.. అవి ఈ జంట హర్మ్యాలంత పెద్దవి కావు. కాగా.. జెట్‌ డెమాలిషన్స్‌ సంస్థ దక్షిణాఫ్రికాలోని జొహాన్నె్‌సబర్గ్‌లో 108 మీటర్ల ఎత్తయిన బ్యాంక్‌ ఆఫ్‌ లిస్బన్‌ భవనాన్ని 2019 నవంబరులో కూల్చివేసింది.

9. 2022లోనే పెను విషాదం- మిగిల్చిన చేదు జ్ఞాపకం (Gujarat Morbi Bridge Collapse)

2022లో గుజరాత్‌లోని మోర్బీలో పెను విషాదం జరిగింది. అక్కడి మచ్చు నదిపై వందేళ్ల క్రితం ఎప్పుడో బ్రిటిషర్ల కాలంలో కట్టిన బ్రిడ్జి అక్టోబర్ 30న సాయంత్రం 6.42 గంటలకు కూలిపోవడంతో 141 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికిపైగా గల్లంతయ్యారు. ఈత వచ్చినవారు మాత్రం ఆ చీకట్లోనే.. ప్రాణాలు అరచేత పెట్టుకుని ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. బ్రిడ్జి కూలే సమయానికి దానిపై 500 మందికి పైగా ప్రజలు ఉన్నట్టు సమాచారం. 230 మీటర్ల పొడవుండే ఈ తీగల వంతెన చాలా పాతది కావడంతో తరచుగా మరమ్మతులు చేయాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఆరునెలల క్రితం దీన్ని మూసివేసి మరమ్మతులు నిర్వహించారు. గుజరాతీల ఉగాది సందర్భంగా అక్టోబరు 26న పునరుద్ధరించి.. మళ్లీ ప్రజల రాకపోకలకు అనుమతిచ్చారు. ఆరునెలల తర్వాత తెరవడం, ఆదివారం కావడంతో ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ ప్రమాదం జరగడానికి ముందు.. పగటి సమయంలో తీసిన పలు వీడియోల్లో ఆ బ్రిడ్జి ప్రమాదకర రీతిలో ఊగడం కనిపించింది. సమయం గడిచేకొద్దీ బ్రిడ్జిపైకి వచ్చే ప్రజల సంఖ్య ఎక్కువ కావడమో.. మరమ్మతుల్లో లోపమో.. కారణమేదైనాగానీ కుప్పకూలిపోయింది.

10. రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ (Rahul Bharat Jodo Yatra)

కాంగ్రెస్‌ పునరుజ్జీవానికి, ప్రజలతో తిరిగి మమేకం కావడానికి ఆ పార్టీ తలపెట్టిన ‘భారత్‌ జోడో యాత్ర’ ఈ 2022లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కీలక నిర్ణయంగా చెప్పవచ్చు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన ఈ యాత్ర 100 రోజులు పూర్తి చేసుకుని అప్రతిహతంగా సాగుతోంది. రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలుకుతుండటం విశేషం. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’ తమిళనాడులో మొదలై కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ల మీదుగా హర్యానాకు చేరుకుంది. నెక్ట్స్ ‘భారత్ జోడో యాత్ర’ ఢిల్లీలో కొనసాగనుంది. శ్రీనగర్‌ వరకు మొత్తం 3,570 కిలోమీటర్ల మేర ‘భారత్ జోడో యాత్ర’లో భాగంగా రాహుల్ కాలినడకన పాదయాత్ర చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఐదు నెలల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతా(యూటీ)ల గుండా సాగే పాదయాత్రలో ఆయన వెంట 119 మంది సీనియర్‌ నేతలు నడుస్తారు. వీరంతా కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు రాహుల్‌ వెంటే ఉంటారు.

ఇదిలా ఉండగా.. రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’లో ఉండగానే కాంగ్రెస్‌కు మునుగోడు ఉప ఎన్నిక షాక్ తగిలింది. తెలంగాణలో రాహుల్ పాదయాత్ర ముగించుకుని వెళ్లే చివరి రోజు మునుగోడు ఫలితం వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయిందని వినాల్సిన పరిస్థితి రావడం రాహుల్‌కు చేదు జ్ఞాపకం అని చెప్పక తప్పదు. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీకి కాస్తంత ఊరట కలిగించే అంశంగా చెప్పొచ్చు.

11. ఏఐసీసీ అధ్యక్షుడిగా గాంధీ కుటుంబేతరుడు ఖర్గే (Kharge Takes Charge as Congress President)

కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించి 2022లో జరిగిన మరో కీలక పరిణామం ఆ పార్టీకి జరిగిన అధ్యక్ష ఎన్నికలు. ఏఐసీసీ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున్‌ ఖర్గే (80) ఘన విజయం సాధించారు. 24 ఏళ్ల తర్వాత ఈ పదవి చేపట్టిన తొలి గాంధీ కుటుంబేతరుడిగా.. 137 ఏళ్ల కాంగ్రెస్‌ చరిత్రలో ఆరో గాంధీ కుటుంబేతరుడిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. అనంతరం ఫలితాన్ని పార్టీ సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసూదన్‌ మిస్త్రీ ప్రకటించారు. పోలింగ్‌లో మొత్తం 9,385 ఓట్లు పోలయ్యానని.. వీటిలో ఖర్గేకు అత్యధికంగా 7,897 ఓట్లు రాగా.. థరూర్‌కు 1,072 ఓట్లు వచ్చాయని వెల్లడించారు. 416 ఓట్లు చెల్లలేదన్నారు. 6,825 ఓట్ల ఆధిక్యంతో ఖర్గే భారీ విజయం సాధించారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి పలువురు దక్షిణాది నేతలు పార్టీ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.

భోగరాజు పట్టాభి సీతారామయ్య (1948-49), నీలం సంజీవరెడ్డి (1960-62), దామోదరం సంజీవయ్య (1963-64), కామరాజ్‌ (1964-66), నిజలింగప్ప (1968-69), పి.వి.నరసింహారావు (1992-94) అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. అయితే 1970లో బాబూ జగ్జీవన్‌రామ్‌ తర్వాత.. అంటే 52 ఏళ్లకు పార్టీకి ఓ దళిత నేత అధ్యక్షుడిగా ఎన్నికవడం ఇదే మొదటిసారి. దామోదరం సంజీవయ్య, నిజలింగప్ప కూడా దళిత నేతలే. మల్లిఖార్జున్ ఖర్గే అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక హిమాచల్ ప్రదేశ్‌‌ను కాంగ్రెస్ పార్టీ ‘హస్త’గతం చేసుకోవడం గమనార్హం.

12. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆప్ విజయఢంకా (AAP Wins Delhi MCD Election)

దేశ రాజధాని ఢిల్లీ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) విజయఢంకా మోగించింది. బీజేపీ 15 ఏళ్ల అప్రతిహత పాలనకు చరమగీతం పాడింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీని ఆప్‌ తుడిచిపెట్టేస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు నిజం కాలేదు. కాషాయ పార్టీ గట్టి పోటీయే ఇచ్చింది. కార్పొరేషన్‌లో మొత్తం 250 వార్డులు ఉండగా.. దానిని కైవసం చేసుకోవడానికి మేజిక్‌ మార్కు 126! ఆప్‌ 134 వార్డుల్లో గెలిచి సాధారణ మెజారిటీ సాధించింది. బీజేపీ పరాజయం పాలైనా 104 స్థానాల్లో గెలవడం విశేషం. షీలా దీక్షిత్‌ సారథ్యంలో ఢిల్లీని 15 ఏళ్లు పాలించిన కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దిగజారింది. కేవలం 9 స్థానాలకు పరిమితమైంది. ముగ్గురు స్వతంత్రులు కూడా విజయం సాధించారు.

13. నుపుర్ శర్మ వ్యాఖ్యలపై పెను దుమారం (Nupur Sharma Controversy)

2022లో దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన ఒకేఒక్క అంశం ఏదైనా ఉందంటే.. నుపుర్‌ శర్మ ఎపిసోడ్ అనే చెప్పాలి. మహమ్మద్‌ ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మను పార్టీ క్రమశిక్షణ కమిటీ సస్పెండ్‌ చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ‘‘మీ అభిప్రాయాలు పార్టీ వైఖరికి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇది పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే. పార్టీలోని అన్ని బాధ్యతల నుంచి మిమ్మల్ని తక్షణమే తొలగిస్తున్నాం’’ అని నుపుర్‌ శర్మకు పంపిన సందేశంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ పేర్కొంది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం అధ్యక్షుడు నవీన్‌కుమార్‌ జిందాల్‌ను కూడా పార్టీ బహిష్కరించింది.

సోషల్‌ మీడియాలో ఆయన పెట్టిన పోస్టులు మత సామరస్యానికి విఘాతం కలిగించాయని పేర్కొంది. అంతర్జాతీయంగా కూడా నుపుర్ శర్మ వ్యాఖ్యలపై భారత్‌కు సెగ తగిలింది. నుపుర్‌ శర్మ వ్యాఖ్యలపై అరబ్‌ దేశాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. భారత రాయబారులు దీపక్‌ మిట్టల్‌ (ఖతర్‌), సీబీ జార్జిలను (కువైత్‌) ఆయా దేశాలు పిలిపించి నిరసన తెలిపాయి. నుపుర్ శర్మ వ్యాఖ్యలు రచ్చకు దారితీయడంతో తన వ్యాఖ్యలను ఆమె వెనక్కి తీసుకున్నారు. ట్విటర్‌లో ఆమె బేషరతుగా క్షమాపణలు చెప్పారు.

14. సీజేఐ పదవికి జస్టిస్ రమణ పదవి విరమణ.. (Justice NV Ramana Retirement)

2022లో న్యాయపరంగా జరిగిన కీలక పరిణామం జస్టిస్ రమణ పదవి విరమణ. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ రమణ పదవీకాలం ఆగస్టు 26తో ముగిసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న కాలంలో దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో సుప్రీం కోలీజియం దాదాపు 224 మంది న్యాయమూర్తులను నియమించినట్టు సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ ఆ సందర్భంలో పేర్కొన్నారు. 2013 సెప్టెంబరు నుంచి 2014 ఫిబ్రవరి దాకా ఢిల్లీ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా కూడా రమణ వ్యవహరించారు. జస్టిస్ రమణ 16 నెలలపాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. కరోనా కారణంగా.. ఇందులో 50 రోజులు మాత్రమే పూర్తి స్థాయిలో విచారణలు జరిగాయి.

ఎన్వీ రమణ పదవి విరమణ అనంతరం భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ (యూయూ లలిత్‌) నియమితులయ్యారు. జస్టిస్‌ యూయూ లలిత్‌ భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయన పదవీకాలం మూడు నెలల్లోపే ముగియడంతో భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ధనంజయ్‌ యశ్వంత్‌ (డీవై) చంద్రచూడ్‌ ప్రమాణం చేశారు. జస్టిస్‌ చంద్రచూడ్‌.. 2024 నవంబరు 10న పదవీవిరమణ చేయనున్నారు.

15. సంవత్సరాంతంలో ఆసక్తి రేపిన గుజరాత్, హిమాచల్ ఫలితాలు (Gujarat Himachal Election 2022)

2022 సంవత్సరాంతంలో దేశవ్యాప్తంగా గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపాయి. గుజరాత్ మోదీ సొంత రాష్ట్రం కావడం, హిమాచల్‌ప్రదేశ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడైన జేపీ నడ్డా రాష్ట్రం కావడంతో ఫలితాలపై ఎన్నో అంచనాలు వినిపించాయి. అయితే.. డిసెంబర్ 8న వెల్లడైన ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొంత తీపి, కొంత చేదును మిగిల్చాయి. గుజరాత్‌లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం బీజేపీలో జోష్ నింపగా, శీతల రాష్ట్రమైన హిమాచల్‌లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం మాత్రం బీజేపీ ఝలక్ అనే చెప్పక తప్పదు. గుజరాత్‌లో 53 శాతం ఓట్లు.. 156 సీట్లతో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించింది. ఏడు వరుస విజయాలతో పశ్చిమ బెంగాల్‌లో ‘ఎర్ర దండు’ నెలకొల్పిన రికార్డును.. గుజరాత్‌లో ‘కాషాయ దళం’ సమం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ 17 సీట్లకు పరిమితం కాగా.. 12 శాతం ఓట్లు, ఐదు సీట్లతో ఆప్‌ సత్తా చాటింది. హిమాచల్‌ ప్రదేశ్‌ ‘హస్త’గత మైంది.

మొత్తం 68 సీట్లకుగాను 40 సీట్లు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ.. అక్కడ రెండు పార్టీల మధ్య ఓట్ల తేడా 0.9 శాతమే. గుజరాత్‌లో బీజేపీ అఖండ విజయం గొప్ప విషయమేగానీ.. కాంగ్రెస్‌ అంత నిరుత్సాహ పడే పరిస్థితీ లేదు. ఎందుకంటే.. అక్కడ ఓడినా బీజేపీ అధ్యక్షుడైన నడ్డా సొంతరాష్ట్రం హిమాచల్‌లో విజయం ఆ పార్టీ భవిష్యత్తు ఆశలను కొంతలో కొంత సజీవంగా ఉంచింది. ఇక ఈ 2 రాష్ట్రాల ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఏడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి వచ్చినవి రెండు సీట్లే. ఢిల్లీ మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఆప్‌ చేతిలో కాషాయ పార్టీ ఓడింది.

Updated Date - 2022-12-24T20:15:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising