Bank Locker Rules : జనవరి 1 నుంచి కొత్త బ్యాంక్ లాకర్ రూల్స్
ABN , First Publish Date - 2022-12-25T17:52:24+05:30 IST
సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుత లాకర్ కస్టమర్లతో లాకర్ అగ్రిమెంట్లను జనవరి 1నాటికి

న్యూఢిల్లీ : సవరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుత లాకర్ కస్టమర్లతో లాకర్ అగ్రిమెంట్లను జనవరి 1నాటికి రెన్యువల్ చేసుకోవాలని అన్ని బ్యాంకులను భారతీయ రిజర్వు బ్యాంక్ (RBI) ఆదేశించింది. రెన్యూవ్డ్ లాకర్ అరేంజ్‌మెంట్ కోసం అర్హత ఉన్నట్లు తెలిపే రుజువును ప్రస్తుత లాకర్ డిపాజిటర్లు సమర్పించాలని తెలిపింది. నిర్దిష్ట తేదీకి ముందే ఈ రెన్యువల్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాలని పేర్కొంది. సవరించిన ఈ మార్గదర్శకాలను 2021 ఆగస్టులో మొదటిసారి జారీ చేసింది.
ఐబీఏ ముసాయిదా
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) రూపొందించిన మోడల్ లాకర్ అగ్రిమెంట్‌ను బ్యాంకులు ఉపయోగించుకోవాలని ఆర్బీఐ తెలిపింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ అగ్రిమెంట్‌ను కుదుర్చుకోవాలని తెలిపింది. అనుచితమైన నిబంధనలు లేదా షరతులు లేకుండా జాగ్రత్తవహించాలని పేర్కొంది. బ్యాంకు ప్రయోజనాలను కాపాడేందుకు సాధారణ కార్యకలాపాలలో అవసరమైనదాని కన్నా ఎక్కువ బాధ్యత ఉండేవిధంగా ఈ నిబంధనలు ఉండకూడదని స్పష్టం చేసింది.
సీసీటీవీ కెమెరాలు
స్ట్రాంగ్ రూమ్‌లోకి ప్రవేశించే చోట, బయటకు వెళ్ళే చోట, కార్యకలాపాలు జరిగే కామన్ ఏరియాస్‌లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. దీనికి సంబంధించిన రికార్డింగులను కనీసం 180 రోజులపాటు సురక్షితంగా ఉంచాలని తెలిపింది. తన లాకర్‌ను తన అనుమతి లేకుండా, తనకు తెలియకుండా తెరిచినట్లు కస్టమర్ ఫిర్యాదు చేసినపుడు, లేదా దొంగతనం జరిగినట్లు, భద్రతా ఉల్లంఘన జరిగినట్లు గుర్తించినపుడు, సీసీటీవీ రికార్డింగ్‌ను పోలీసు దర్యాప్తు పూర్తయ్యే వరకు , వివాదం పరిష్కారమయ్యే వరకు భద్రపరచాలని బ్యాంకులకు తెలిపింది.
అగ్ని ప్రమాదం వల్ల లేదా భవనం కుప్పకూలిపోవడం వల్ల లాకర్లలోని విలువైన వస్తువులకు నష్టం జరిగితే, బ్యాంకు ఛార్జిలకు 100 రెట్లు వరకు కస్టమర్లు పొందవచ్చునని ఈ కొత్త మార్గదర్శకాలు చెప్తున్నాయి. ప్రకృతి వైపరీత్యాలు లేదా భగవంతుని చర్యల కారణంగా లాకర్లలోని వస్తువులకు నష్టం జరిగితే బ్యాంకుకు ఎటువంటి బాధ్యత ఉండదని పేర్కొన్నాయి.
ప్రభుత్వ అధికారుల సోదాలు
లాకర్‌ను లేదా లాకర్‌లోని వస్తువులను జప్తు చేయడానికి లేదా రికవరీ చేయడానికి ప్రభుత్వ అధికారులు వచ్చినపుడు, ఆ విషయాన్ని బ్యాంకులు సంబంధిత కస్టమర్లకు లేఖ ద్వారా, అదేవిధంగా ఈ-మెయిల్/ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలని పేర్కొంటున్నాయి.
టెర్మ్ డిపాజిట్
లాకర్ కోసం వసూలు చేసే అద్దెగా మూడేళ్ల టెర్మ్ డిపాజిట్‌ను బ్యాంకులు దానిని కేటాయించే సమయంలో కోరవచ్చునని ఆర్బీఐ తెలిపింది. కానీ ప్రస్తుత లాకర్ హోల్డర్లు, సంతృప్తికరమైన ఆపరేటివ్ అకౌంట్స్ ఉన్న కస్టమర్లను టెర్మ్ డిపాజిట్ కోసం పట్టుబట్టకూడదని స్పష్టం చేసింది.