NRI: అమెరికాలో వింత చోరీ కేసు.. దొంగతనానికి వచ్చి కాఫీ తాగాడు.. చివరకు..
ABN , First Publish Date - 2022-11-20T21:53:25+05:30 IST
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో పోలీసులు ఇటీవల ఓ వెరైటీ దొంగను అరెస్ట్ చేశారు.
ఎన్నారై డెస్క్: అమెరికాలోని(USA) ఫ్లోరిడా రాష్ట్రంలో(Florida).. పోలీసులు ఇటీవల ఓ వెరైటీ దొంగను అరెస్ట్ చేశారు. దొంగతనానికి వచ్చి కేవలం కాఫీ తాగి ఉత్త చేతులతో వెళ్లిపోయిన అతడిని ఇటీవలే అరెస్ట్ చేశారు. నిందితుడిని జాకరీ సెత్ మర్డాక్‌గా గుర్తించారు. ఎస్కాంబియా కౌంటీలో మంగళవారం ఓ ఇంట్లోకి నిందితుడు ప్రవేశించాడు. ఆ తరువాత బెడ్ రూంలో ఓ చిన్న కునుకు తీసి..ఆపై కిచన్‌లో కాఫీ కలుపుకుని తాగాడు. అయితే.. అప్పటికే పోలీసులు సమాచారం అందుకుని ఘటనాస్థలానికి చేరుకోవడంతో వారి అలికిడి విని అక్కడి నుంచి పారిపోయాడు.
అదే రోజు మరో ఇంట్లో చోరీకి యత్నించాడు. అద్దాల తలుపు తీసుకుని ఆ ఇంటి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. లోపలున్న మహిళ అతడిని నువ్వెవ్వరని ప్రశ్నించింది. టోనీ అనే వ్యక్తి కోసం వెతుకుతున్నానని సమాధానం చెప్పిన అతడు.. ఆ తరువాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడి తీరు అనుమానాస్పదంగా ఉండటంతో ఆ మహిళ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో..పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసి కొన్ని గంటల్లోనే అతడిని అరెస్ట్ చేశారు. అతడిపై చోరీ కేసుతో పాటూ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే.. నిందితుడు ప్రస్తావించిన టోనీ ఎవరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.