జై షాకు బీసీసీఐ పగ్గాలు ?
ABN , First Publish Date - 2022-09-17T09:54:30+05:30 IST
సుప్రీం కోర్టు తీర్పు అనంతరం త్వరలో బీసీసీఐలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా అంటే..క్రికెట్ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి.

ఐసీసీ చీఫ్‌గా గంగూలీ?
త్వరలో బోర్డు ఏజీఎం
న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు తీర్పు అనంతరం త్వరలో బీసీసీఐలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా అంటే..క్రికెట్ వర్గాలు అవుననే సమాధానమిస్తున్నాయి. జస్టిస్ లోధా సంస్కరణల మేరకు రూపొందించిన బోర్డు నూతన రాజ్యాంగానికి చేసిన కీలక సవరణలకు సుప్రీం కోర్టు ఓకే చెప్పిన నేపథ్యంలో.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా మరో దఫా పదవుల్లో కొనసాగేందుకు అవకాశం ఏర్పడింది. ప్రస్తుత బోర్డు పాలకవర్గం మూడు సంవత్సరాల వ్యవధి ఈనెలతో ముగియనుంది. దాంతో కొత్త కార్యవర్గ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈనేపథ్యంలో త్వరలో బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ఏర్పాటు చేసి..ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నట్టు సమాచారం.ఎన్నికల్లో..ప్రస్తుత కార్యదర్శి జై షా అధ్యక్ష పదవికి పోటీ చేస్తే మద్దతు ఇచ్చేందుకు 15 రాష్ట్ర సంఘాలు సుముఖత వ్యక్తంజేశాయి. కొవిడ్ సమయంలోనూ ఐపీఎల్ నిర్విఘ్నంగా జరిగిందంటే అందుకు షా ప్రయత్నాలే కారణమని ఆ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఐపీఎల్ ప్రసార హక్కుల ధర ఊహించని స్థాయిలో రూ. 48,390 కోట్లకు చేరడాన్ని ఈ సందర్భంగా ఆ సంఘాలు ప్రస్తావిస్తున్నాయి.
తద్వారా బోర్డు ఆర్థికంగా మరింత పరిపుష్టమైందని చెబుతున్నాయి. ‘జై షా బోర్డు పగ్గాలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైంది. అన్ని సంఘాలూ ఆయనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి’ అని ఓ కీలక రాష్ట్ర సంఘానికి చెందిన ముఖ్యుడొకరు వెల్లడించారు. లోధా కమిటీ సిఫారసుల మేరకు రూపొందిన రాజ్యాంగం తర్వాత 2019లో గంగూలీ, షా బోర్డు అధ్యక్షకార్యదర్శులుగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన బోర్డు ఏజీఎంలో..మూడేళ్ల ‘కూలింగ్ ఆఫ్ పీరియడ్’తో పాటు ఇతర రాజ్యాంగ సవరణలను ప్రతిపాదించగా, సుప్రీం కోర్టు వాటిని ఆమోదించిన విషయం విదితమే. ఇటు బీసీసీఐలో ఆరేళ్లు, అటు రాష్ట్ర క్రికెట్ సంఘాలలో ఆరు సంవత్సరాలు కలిపి ఏకబిగిన 12 సంవత్సరాలు ఆఫీసు బేరర్లుగా కొనసాగవచ్చని సుప్రీం కోర్టు పేర్కొంది. దాంతో 2025 వరకు సౌరవ్, షా బోర్డు పదవుల్లో కొనసాగే వీలు ఏర్పడింది.
ఐసీసీలోకి దాదా!
జై షా బోర్డు చీఫ్ పదవికి పోటీచేస్తే..గంగూలీ పరిస్థితి ఏమిటన్న అనుమానం రావొచ్చు. అయితే దాదా ఐసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికల్లో తలపడనున్నట్టు సమాచారం. ఐసీసీ ప్రస్తుత చీఫ్ గ్రెగ్ బార్క్‌లే పదవీకాలం వచ్చే నవంబరులో ముగియనుంది. ఇటీవల బర్మింగ్‌హామ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో చైర్మన్ పదవి ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభించారు. అధ్యక్ష ఎన్నికకు 2/3 వంతు మెజార్టీ కూడా అవసరంలేదు. 51 శాతం ఓట్లు పొందిన అభ్యర్థి చైర్మన్‌గా ఎన్నికవుతాడు. అంటే..16మంది ఐసీసీ బోర్డు సభ్యుల్లో తొమ్మిది మంది మద్దతు ఉంటే సరిపోతుంది. దాంతో..ఆ ఓట్లు కనుక గంగూలీ సాధించి ఐసీసీ చీఫ్‌గా వెళ్తే..బీసీసీఐ అధ్యక్ష పదవి ఖాళీ అవుతుందన్నమాట. దాంతో షా ఆ పదవికి ఎన్నికకానుండగా..ప్రస్తుత కోశాధికారి అరుణ్ ధూమల్ తదుపరి కార్యదర్శిగా ఎన్నికవుతారని సమాచారం. 33 ఏళ్ల షా కనుక అధ్యక్షుడిగా ఎన్నికైతే..ఈ పదవిని అలంకరించనున్న అతిపిన్న వయస్కుడిగా రికార్డు సృష్టిస్తాడు.
శ్రీనివాసన్‌కు నో చాన్స్!
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ఐసీసీ చీఫ్ పదవికి పోటీపడతారని వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుత బోర్డు పెద్దలు అందుకు సముఖంగా లేరని తెలుస్తోంది.
