Share News

పాన్‌ ఇండియా పయనమెటు..

ABN , Publish Date - Mar 02 , 2025 | 10:20 AM

‘పాన్‌ ఇండియా’ అనే కొత్త పదం చిత్ర పరిశ్రమలో జోరుగా వినిపిస్తోంది. నిజానికి కరోనా తర్వాత సినిమారంగం కోలుకోవడం కష్టమన్నారంతా. అప్పటికే ఓటీటీలు వచ్చేశాయి. ప్రేక్షకులు అటువైపు షిఫ్ట్‌ అయ్యారు. ‘ఇక జనం థియేటర్లకు రారు’ అనుకునే సమయంలోనే ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది.

పాన్‌ ఇండియా పయనమెటు..

‘పాన్‌ ఇండియా’ అనే కొత్త పదం చిత్ర పరిశ్రమలో జోరుగా వినిపిస్తోంది. నిజానికి కరోనా తర్వాత సినిమారంగం కోలుకోవడం కష్టమన్నారంతా. అప్పటికే ఓటీటీలు వచ్చేశాయి. ప్రేక్షకులు అటువైపు షిఫ్ట్‌ అయ్యారు. ‘ఇక జనం థియేటర్లకు రారు’ అనుకునే సమయంలోనే ఎవరూ ఊహించని అద్భుతం జరిగింది. ఉత్తరాది, దక్షిణాది అనే సరిహద్దులు చెరిగిపోయి... అప్పటిదాకా ఆయా భాషలకే పరిమితమైన హీరోలు బాలీవుడ్‌ స్టార్లను కూడా అధిగమించి, ఒక్కసారిగా జాతీయ, అంతర్జాతీయ స్టార్లుగా మారారు. మిగతావాళ్లూ అదే బాటలో నడవాలని చూసున్నారు. అయితే ఈ సరికొత్త ‘పాన్‌ ఇండియా’ సినిమా ఏ దిశగా వెళ్తుందనేదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న?


‘కట్టప్ప బాహుబలి కో క్యోం మారా?’... పదేళ్ల క్రితం దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి వందకోట్లకు పైగా వెచ్చించి తీసిన ‘బాహుబలి 1’ (ద బిగినింగ్‌) కాస్త హడావిడిగా, అసంపూర్తిగా, అసంతృప్తిగానే విడుదల చేశామని మేకర్స్‌ భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా ఈ ప్రశ్న వైరల్‌ అయ్యింది. ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న. ట్రెండింగ్‌గా మారింది. రాజమౌళి స్ట్రాటజీ బాగా వర్కవుట్‌ అయ్యింది. ఆ సినిమా దేశవ్యాప్తంగా వందల కోట్లను కొల్లగొట్టింది. ఒక్కమాటలో చెప్పాలంటే రాజమౌళి ‘బాహుబలి’ పాన్‌ ఇండియాకు బాటలు వేసింది.

ww.jpg

దక్షిణాదికి చెందిన ప్రభాస్‌ ఒక్కసారిగా పాన్‌ ఇండియా స్టార్‌ అయ్యాడు. ఇక ‘బాహుబలి 2’ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి మొదలయ్యింది. చందమామ కథను చక్కగా అల్లుకుని రాజమౌళి చేసిన మ్యాజిక్‌ ఆబాలగోపాలాన్ని మెప్పించింది. ముఖ్యంగా అప్పటిదాకా ఉన్న బాలీవుడ్‌ స్టార్‌ హీరోల కలెక్షన్లు కూడా ‘బాహుబలి’ ధాటికి చెల్లాచెదురయ్యాయి. మరో మూడేళ్లకు వచ్చిన ‘బాహుబలి 2’ (ది కన్‌క్లూజన్‌ ) అందరూ ఊహించినట్టుగానే రికార్డులు సృష్టించింది. ఈసారి కలెక్షన్లు హాలీవుడ్‌ సినిమా రేంజ్‌లో వేల కోట్లకు దూసుకెళ్లాయి. అయితే ఈ పదేళ్ల కాలంలో (ప్రధానంగా గత రెండు మూడేళ్లుగా) క్రమక్రమంగా రూపం మార్చుకుంటున్న ‘పాన్‌ ఇండియా’ సినిమాలో జరుగుతున్న మార్పులు చాలానే ఉన్నాయి.


యాక్షన్‌ ప్రధానం...

కరోనా తర్వాత మనుషుల్లో సున్నితత్వపు లక్షణం బాగా తగ్గిందనేది మానసిక నిపుణుల అభిప్రాయం. సమాజంలోని అన్ని వర్గాల్లో ఒకరకమైన నిస్తేజం చోటుచేసుకోవడంతో ప్రస్తుతం ఏదైనా ‘అతి’గా ఉంటేనే జనాలకు ఎక్కుతోంది. సునిశిత హాస్యం కనుమరుగయ్యింది. ‘జబర్దస్త్‌’ తరహాలో అతి చేస్తేనే ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తున్నారు. యూట్యూబ్‌లో జబర్దస్త్‌ స్కిట్‌లు ఒక్కోదానికి కోట్లలో వ్యూస్‌ ఉంటున్నాయంటే పరిస్థితి అర్థం అవుతోంది.

అదే తరహాలో సినిమాల్లో కూడా యాక్షన్‌ పేరిట వయొలెన్స్‌ విపరీతంగా పెరిగింది. సరిగ్గా పాన్‌ ఇండియా చిత్రాలకు ఈ తరహా యాక్షనే కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ‘కేజీఎఫ్‌’, ‘సలార్‌’, ‘యానిమల్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘పుష్ప’... ఇలా అన్నీ కూడా యాక్షన్‌ ప్రధానంగానే ఆకట్టుకున్నాయి. సాధారణంగా యాక్షన్‌ అనేది మాస్‌ అంశాలతో ముడిపడి ఉంటుంది. యూత్‌ను, మాస్‌ను ఆకట్టుకునేది కూడా ఇలాంటి యాక్షన్‌ సన్నివేశాలే కాబట్టి పాన్‌ ఇండియా కథలన్నీ అనివార్యంగా ఈ ఫార్ములా చుట్టే తిరుగుతున్నాయి. అందుకే పాన్‌ ఇండియా స్టార్‌ అంటే... నూటికి నూరుపాళ్లు యాక్షన్‌ హీరోగా ముద్రపడిపోతున్నారు.


book4.3.jpg

ఈ యాక్షన్‌ (నిజానికి హింస) కొన్నిసార్లు శృతి మించుతోందనే విమర్శలు కూడా లేకపోలేదు. కన్నడ దర్శకుడు ప్రశాంత్‌నీల్‌ తీసిన ‘కేజీఎఫ్‌’లో హీరో రాఖీ (యష్‌) కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో చేసేది ఊచకోతే. ఇక తెలుగు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌బీర్‌ కపూర్‌తో తీసిన ‘యానిమల్‌’ (2023)లో హింస తారాస్థాయికి చేరింది. స్కూల్లోనే ఏకే 47 తుపాకీతో విద్యార్థులను బెదిరించిన విజయ్‌ (రణ్‌బీర్‌ కపూర్‌)... తండ్రిపై ప్రత్యర్థులు జరిపిన హత్యాయత్నం అనంతరం నిజంగానే జంతువులా మారతాడు. హోటల్‌లో ‘వార్‌ మిషన్‌గన్‌’తో అతడు సృష్టించే బీభత్సం తెరమీద రక్తపుటేరులను పారించిందనే చెప్పాలి. నేపథ్యసంగీతంతో ప్రేక్షకులను ఉన్మాద జగత్తులోకి తీసుకెళ్లడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. కావునే ‘యానిమల్‌’కు కాసులవర్షం కురిసింది.


హీరోలు యమా సీరియస్‌...

సాధారణంగా సినిమాలో ఏ హీరో అయినా నవరసాలు పోషించాలని కోరుకుంటాడు. రకరకాల పాత్రలతో ఆకట్టుకోవాలని ఆశిస్తాడు. అయితే పాన్‌ ఇండియా సినిమాల్లో అలాంటి అవకాశం ఎవరికీ దక్కట్లేదు. కథానాయకుడితో పాటు ప్రతినాయకుడు కూడా ఎప్పుడు చూసినా సీరియస్‌ లుక్‌తోనే కనిపిస్తాడు. ‘దేవర’ సినిమాలో టైటిల్‌ రోల్‌లో కనిపించే ఎన్టీఆర్‌ ‘ఎర్ర’ సముద్రంలాగే గంభీరంగా ఉంటాడు. సినిమా మొత్తం అదే మూడ్‌ను కొనసాగించాడు. ‘సలార్‌’లో దేవ (ప్రభాస్‌) కూడా అంతే. పైగా సినిమాలో ఎక్కువ భాగం నలుపు దుస్తులతో, దుమ్ము కొట్టుకుపోయి, రగ్డ్‌గా కనిపించడమే పాన్‌ ఇండియా స్టయిల్‌గా మారింది. మిగతా జానర్‌లలో హీరోలు రకరకాలుగా వేషాలేస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతారు. అయితే ఇక్కడ మాత్రం కేవలం సీరియస్‌, స్టయిలిష్‌ లుక్‌... ఎలివేషన్లతోనే అభిమానులను మంత్రముగ్ధులను చేస్తున్నారు.

book4.4.jpg


కామెడీకి చోటు లేదు

పాన్‌ ఇండియా సినిమాల్లో సీన్లు, ఎపిసోడ్‌ల వారీగా వినోదాన్ని పంచుతాయే తప్ప రిలీఫ్‌ కోసం కామెడీ అనేది కనిపించదు. ఇప్పటిదాకా వచ్చిన పాన్‌ ఇండియా సినిమా దేనిని తీసుకున్నా... వాటిల్లో రెగ్యులర్‌ కమెడియన్లకు చోటుండదు. ప్రత్యేకంగా కామెడీ ట్రాక్‌లు లేకపోవడం వల్ల కమెడియన్లతో పని ఉండట్లేదు. ఈ తరహా సినిమాలు పలు భాషల్లో విడుదలవుతాయి కాబట్టి... ఒక భాషకు చెందిన కమెడియన్లు మరో భాషకు మిస్‌మ్యాచ్‌ అవుతారనేది కూడా ఒక కారణం. అలాంటి సందర్భాల్లో కామెడీ వికటిస్తుంది. అంతేగాక పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమాల్లో బలవంతంగా కామెడీని జొప్పించడం కుదరని పని. అందుకే ఆయా దర్శకులు సినిమాలో ఆకట్టుకునే గ్రాఫ్‌ చూస్తున్నారేగానీ, ప్రత్యేకంగా కామెడీ వైపు దృష్టి సారించడం లేదు. దీంతో ఆయా భాషల్లోని కమెడియన్లకు పాన్‌ ఇండియా సినిమాల్లో పని దొరకడం లేదు.


అన్ని భాషల నుంచి...

కథ అల్లుకోవడం దగ్గరి నుంచి, నటీనటులను ఎంపికచేసుకోవడం దాకా అన్నీ కొన్ని లెక్కలతో ప్రణాళికాబద్ధంగానే జరుగుతున్నాయి. పాన్‌ ఇండియా సినిమా అన్ని ప్రధాన భాషల్లోకి వెళుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల ప్రేక్షకులకు ఆసక్తి కలిగేందుకు హిందీ, మలయాళ, తమిళ, కన్నడ, తెలుగు భాషల నుంచి నటీనటులను తీసుకుంటున్నారు. హిందీ నుంచి అమితాబ్‌ బచ్చన్‌, బాబీ డియోల్‌, అజయ్‌ దేవగన్‌, సైఫ్‌ అలీఖాన్‌, సంజయ్‌దత్‌, దీపికా పదుకొణే, రవీనాటాండన్‌, అలియాభట్‌... మలయాళం నుంచి ఫహాద్‌ ఫాజిల్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, రోషన్‌ మాథ్యూ... తమిళం నుంచి సత్యరాజ్‌, నాజర్‌, ప్రకాశ్‌రాజ్‌... కన్నడం నుంచి వశిష్ట ఎన్‌ సింహా, అనంత్‌నాగ్‌, బాబీ సింహా... తెలుగు నుంచి రానా దగ్గుబాటి, జగపతిబాబు, రావు రమేష్‌, సునీల్‌, రమ్యకృష్ణ, శ్రీకాంత్‌ మొదలైనవారికి స్థానం కల్పిస్తూ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. అప్పటిదాకా ఆయా ప్రాంతాలకు పరిమితమైన చాలామంది నటీనటులు పాన్‌ ఇండియా సినిమాల ద్వారా యావత్‌ ప్రపంచానికి పరిచయం అవుతున్నారు.


సీక్వెల్‌... సీక్వెల్‌...

అత్యధిక బడ్జెట్‌తో తయారవుతున్న ఈ తరహా చిత్రాల ద్వారా అంతే మొత్తంలో వసూళ్లను రాబట్టుకునేందుకు దర్శకులు కథను రెండు భాగాలుగా (అంటే రెండు సినిమాలుగా) చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీబడ్జెట్‌తో ‘బాహుబలి’ని రూపొందిస్తున్నప్పుడే రాజమౌళి ఈ ప్లాన్‌కు తెరతీశాడు. కథను ఒక ట్విస్ట్‌తో మధ్యలోనే ఆపేసి, సీక్వెల్‌పై దర్శకులు ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. అది వర్కవుట్‌ కావడంతో మిగతా వారంతా అదే బాటలో నడుస్తున్నారు.

book4.5.jpg

ఇప్పటిదాకా వచ్చిన పాన్‌ ఇండియా సినిమాలన్నింటిదీ అదే దారి. తాజాగా ‘పుష్ప2’ సహా... ఇంతకుముందు ‘కేజీఎఫ్‌’, ‘పొన్నియన్‌ సెల్వన్‌’ కూడా రెండో చాప్టర్‌తో హిట్‌ కొట్టేశాయి. ‘యానిమల్‌’కు సీక్వెల్‌గా ‘యానిమల్‌ పార్క్‌’ను ఇప్పటికే ప్రకటించారు. ‘కల్కి’, ‘దేవర’, ‘కాంతారా’ వంటివి రెండో పార్ట్‌కు సిద్ధమవుతున్నాయి. హిట్స్‌ను బట్టి కొందరు దర్శకులు మూడో సినిమా (ట్రయాలజీ)కి ప్రణాళికలు వేసుకుంటున్నారు. ‘యానిమల్‌ పార్క్‌’ తర్వాత ‘యానిమల్‌ కింగ్‌డమ్‌’, ‘పుష్ప2...ది రూల్‌’ తర్వాత ‘పుష్ప 3... ది రాంపేజ్‌’ వస్తాయనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.


పులి మీద స్వారీ

ఇదంతా నాణేనికి ఒకవైపు... మరోవైపు ‘పాన్‌ ఇండియా’ సినిమాలపై భిన్నాభిప్రాయాలున్నాయి. ఇవన్నీ భారీ బడ్జెట్‌తో (వందల కోట్లతో) రూపొందుతాయి కాబట్టి కథను కూడా అదే కోణంలో ఆలోచిస్తారు. అంటే వ్యాపారకోణంలోనే కథ కొనసాగుతుంది. అంతేకాదు కేవలం హీరో ప్రధానంగానే కథ నడుస్తుంది. దానివల్ల అనివార్యంగా హింస (యాక్షన్‌) పెరుగుతుంది. ఒకవేళ సక్సెస్‌ విషయంలో అంచనాలు ఏమాత్రం తారుమారు అయినా (ఉదాహరణకు ‘ఆదిపురుష్‌’, ‘లైగర్‌’) నష్టాలు కూడా అదే రేంజ్‌లో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే పాన్‌ ఇండియా సినిమా అనేది పులి మీద స్వారీలాంటిది.


‘‘బాహుబలి సక్సెస్‌ తర్వాత పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌... పాన్‌ ఇండియా ట్రెండ్‌ కొనసాగేందుకు దోహదపడ్డాయి. ‘కార్తికేయ2’ హిందీ వెర్షన్‌ కూడా బాగా ఆడింది. అయితే ‘లైగర్‌’, ‘ఆదిపురుష్‌’, కిచ్చా సుదీప్‌ ‘విక్రాంత్‌ రోణ’ వంటివి వర్కవుట్‌ కాలేదు. అలాంటప్పుడు నష్టాలు కూడా భారీగానే ఉంటాయి’’ అని ప్రముఖ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరుణ్‌ ఆదర్శ్‌ అంటున్నారు. ఈ క్రమంలో తమిళ హీరో సూర్య ‘కంగువా’, కన్నడ హీరో ఉపేంద్ర ‘కబ్జా’ కూడా ప్రేక్షకుల్ని నిరాశ పరిచాయి. ఈ ట్రెండ్‌ వల్ల హీరోలు ఒక్కో సినిమా కోసం ఏళ్లపాటు నిరీక్షించాల్సి వస్తోంది. మరో సమస్య ఏమిటంటే భిన్నమైన కథల ఎంపికకు వారికి ఛాయిస్‌ తగ్గుతోంది. అందుకే ప్రాంతీయ సినిమాల్లో నటించేందుకు సిద్ధమవుతున్నారు.


ప్రభాస్‌, అల్లు అర్జున్‌, విక్రమ్‌, సూర్య, షారుక్‌ఖాన్‌ వంటి స్టార్లు ఆ దిశగా దృష్టి సారించారు. ‘‘పాన్‌ ఇండియా వల్ల ప్రధానంగా కథకు సమస్య వస్తోంది. వివిధ ప్రాంతాలకు స్థానిక భాష, సంస్కృతి అనేది ఉంటుంది. ఈ కోణంలో చూస్తే పాన్‌ ఇండియా సినిమాతో అందర్నీ సంతృప్తి పరచాలంటే కష్టమవుతుంది. దీనివల్ల ఒకరకంగా రీమేక్స్‌ ఫ్లేవర్‌ కనుమరుగవుతోంది. దానిని గమనించాలి’’ అని ప్రముఖ కన్నడ హీరో ఉపేంద్ర అంటున్నారు. గతంలో ఒక భాషకు చెందిన సినిమా డబ్బింగ్‌ ద్వారానో, లేదంటే రీమేక్‌ ద్వారానో మరో భాషకు పరిచయమై అక్కడ కూడా విజయవంతం అయ్యేది. పాన్‌ ఇండియా ట్రెండ్‌ వచ్చిన తర్వాత హీరోల ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. భారీ పారితోషికాల కోసం, ఇమేజ్‌ కోసం పాన్‌ ఇండియా మంత్రాన్ని జపిస్తున్నారు.


‘‘ఇదొక మార్కెటింగ్‌ టూల్‌ మాత్రమే. ఎక్కువ బడ్జెట్‌... ఉత్తరాది, దక్షిణాది నటీనటుల కలయిక... యాక్షన్‌ సన్నివేశాలు.. ఇదే పాన్‌ ఇండియా అంటే ఎలా? కంటెంట్‌ కూడా ఉండాలి కదా. అసలు విషయం లేకుండా జిమ్మిక్కులు చేస్తే చివరికి మిగిలేది శూన్యం’’ అంటూ ప్రముఖ ట్రేడ్‌ పండితుడు అతుల్‌ మోహన్‌ హెచ్చరిస్తున్నారు. ఇటీవల ప్రాంతీయ సినిమాలు (సంక్రాంతికి వస్తున్నాం, తండేల్‌, లక్కీభాస్కర్‌, మీయజగన్‌... తెలుగులో సత్యం సుందరం, మంజుమల్‌ బాయ్స్‌, ఛావా వంటివి) కూడా బలమైన కథ, కథనాలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ విజయాలను నమోదు చేస్తున్నాయి. ఈ విజయాలతో పోల్చితే పాన్‌ ఇండియా సినిమాలు కచ్చితంగా ఫ్యాన్సీగానే కనిపిస్తున్నాయి కానీ ఆబాలగోపాలాన్ని ఆకట్టుకునే మ్యాజిక్‌ను మిస్సవుతున్నాయనేది సర్వత్రా వినిపిస్తున్న అభిప్రాయం. మొత్తానికి పదేళ్ల క్రితం మొదలైన ‘పాన్‌ ఇండియా’ పయనం ఏవైపునకు సాగుతుందో వేచి చూడాలి.

- చల్లా


ఛాయిస్‌ మాత్రమే

‘పొన్నియన్‌ సెల్వన్‌’తో (రెండు సినిమాలు) పాన్‌ఇండియా బరిలోకి దిగి, విజయాన్ని సొంతం చేసుకున్న ప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం అభిప్రాయం ప్రకారం ఈ తరహా సినిమాలు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ‘పాన్‌ ఇండియా’ పేరు మాత్రం కొత్తగా చేరింది. ‘‘మనం ఈ తరహా సినిమాలను ‘చంద్రలేఖ’ (1948) నుంచే చూస్తున్నాం కానీ వాటిని పాన్‌ ఇండియా అని పిలిచేవాళ్లం కాదు. దక్షిణాది సినిమాలను ఉత్తరాది ప్రేక్షకులు కూడా ఆదరించడం ఎప్పటి నుంచో ఉంది. ‘కాంతారా’ వంటి ప్రాంతీయ చిత్రాన్ని, ఒక ప్రాంతపు సంస్కృతిని దేశవ్యాప్తంగా మెచ్చుకోవడం మంచి పరిణామం. పాన్‌ ఇండియా సినిమా అనేది ఒక ట్రాప్‌ ఎంతమాత్రం కాదు... అదొక ఛాయిస్‌ మాత్రమే’’ అంటున్నారు మణిరత్నం.

Updated Date - Mar 02 , 2025 | 09:33 PM