Amazon : దేశంలో రెండోది..

ABN , First Publish Date - 2022-11-23T03:20:19+05:30 IST

ఏటా 48 వేల పూర్తికాల ఉద్యోగావకాశాలు కల్పించే అమెజాన్‌ డేటా సెంటర్‌ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది! 2011లో ఢిల్లీ కేంద్రంగా భారత్‌లో కార్యకలాపాలు

Amazon : దేశంలో రెండోది..

దేశంలో రెండోది.. కార్యకలాపాలు ప్రారంభం

81 ఎకరాల్లో కందుకూరు, చందనవెల్లిలో నిర్మాణం

2030 నాటికి రూ.36 వేల కోట్ల మేర పెట్టుబడులు

ఏటా 48 వేలకు పైగా ఫుల్‌టైమ్‌ ఉద్యోగావకాశాలు

అమెజాన్‌ ఉపాధ్యక్షుడు ప్రసాద్‌కళ్యాణరామన్‌ వెల్లడి

స్వాగతించిన కేంద్ర ఐటీమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌

ఆవిష్కరణలకు మరింత ప్రోత్సాహం: మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): ఏటా 48 వేల పూర్తికాల ఉద్యోగావకాశాలు కల్పించే అమెజాన్‌ డేటా సెంటర్‌ మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది! 2011లో ఢిల్లీ కేంద్రంగా భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన అమెజాన్‌ 2016లో తన తొలి డేటా కేంద్రాన్ని ముంబైలో ప్రారంభించింది. దాని తర్వాత.. ఆ సంస్థ మనదేశంలో ఏర్పాటు చేసిన డేటా కేంద్రం ఇదే. 2030 వరకు ఈ కేంద్రంపై 4.4 బిలియన్‌ డాలర్ల మేర (రూ. 36,300 కోట్లు) ప్రణాళికాబద్ధంగా పెట్టుబడులు పెడతామని.. దేశంలో డిజిటల్‌ రంగంలో కొత్త ఉద్యోగాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని అమెజాన్‌ డేటా సర్వీసెస్‌ ఉపాధ్యక్షుడు ప్రసాద్‌ కళ్యాణరామన్‌ పేర్కొన్నారు. ‘ఏడబ్ల్యూఎస్‌ (అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌) ఆసియా పసిఫిక్‌ కేంద్రం’ పేరుతో.. దీని ద్వారా భారత్‌ కేంద్రంగా వినియోగదారులకు నూతన సేవలు అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించారు. అమెజాన్‌ సంస్థ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో 30 డేటా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ ఏడాది యూఏఈలో మిడిల్‌ ఈస్ట్‌ సెంటర్‌, యూరప్‌ దేశాలకు సంబంధించిన డేటా స్పెయిన్‌, జ్యూరిక్‌లో ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది ప్రపంచంలోనే 31వది కాగా.. ఇది మనదేశంలో రెండో కేంద్రం. నిజానికి అమెజాన్‌ సంస్థ రెండేళ్ల క్రితమే..హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో 30 లక్షల చదరపుటడుగుల్లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రారంభించిన డేటా సెంటర్‌ కోసం నగరంలోని రెండుచోట్ల కేంద్రాలను నిర్మించింది. హైదరాబాద్‌ ఫార్మాసిటీ సమీపంలో (రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌ పేట గ్రామంలో) 48 ఎకరాల్లో రూ.5809 కోట్లతో, షాబాద్‌ మండలం చందన్‌వెల్లిలో 33 ఎకరాల్లో రూ. 5821 కోట్లతో నిర్మించింది. మొత్తం 81 ఎకరాల్లో నిర్మించిన ఈ రెండు కేంద్రాలపై అమెజాన్‌ రూ. 11630 కోట్ల పెట్టుబడులు పెట్టింది. నగరంలో ఈ డేటా కేంద్రం ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కేంద్రం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు స్టార్టప్స్‌, ఆవిష్కర్తలకు సేవలు అందిస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కూడా ఈ కేంద్రం ఏర్పాటును స్వాగతించారు. దేశంలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఈ నూతన కేంద్రం ఊతమిస్తుందన్నారు. కాగా.. ఈ కేంద్రం నిర్మాణం, కార్యకలాపాల వల్ల 2030 నాటికి దేశ జీడీపీకి 7.6 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.63,600 కోట్లు) జమ అవుతాయని అంచనా.

దేశ ప్రజల డేటా నిక్షిప్తం ఇక్కడే

హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభమైన ఈ కేంద్రం డేటా నిక్షిప్తంలో కీలకంగా మారనుంది. ప్రభుత్వ, ప్రైవేటు, వాణిజ్య అవసరాల కోసం సంస్థలు సేకరించే ప్రజల సమాచారాన్ని విదేశీ ఐటీ సంస్థలు విదేశాల్లో నిల్వ చేస్తున్నాయి. ప్రజల వ్యక్తిగత సమాచారం విదేశాల్లో సురక్షితం కాదని, దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్రం కొన్ని నిబంధనలు పెట్టింది. ఈ నేపథ్యంలోనే.. అమెజాన్‌ సంస్థ దేశంలో ఐటీ కేంద్రంగా వెలుగొందుతున్న హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ ఏర్పాటుకు మూడేళ్లుగా ఏర్పాట్లు చేసింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ, కేంద్ర ఐటీ శాఖతో పాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని ప్రభుత్వ శాఖలకూ అమెజాన్‌ ప్రస్తుతం సేవలు అందిస్తోంది. అలాగే పేటీఎం, ఏయిర్‌టెల్‌, ఓఎల్‌ఎక్స్‌, జొమాటో, బిగ్‌ బాస్కెట్‌తో పాటు అనేక కార్పొరేట్‌ సంస్థలూ అమెజాన్‌ సేవలను వినియోగించుకుంటున్నాయి. ఇప్పుడీ కేంద్రం అందుబాటులోకి రావడంతో.. ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేటు సంస్థలకు అందిస్తున్న వెబ్‌ సర్వీసెస్‌ సేవల్లో భాగంగా భారత వినియోగదారులకు సంబంధించిన డేటాను ఈ కేంద్రం భద్రపరుస్తామని అమెజాన్‌ పేర్కొంది.

Updated Date - 2022-11-23T11:03:25+05:30 IST