హరితహారానికి సన్నద్ధం

ABN , First Publish Date - 2022-06-16T05:46:44+05:30 IST

హరితహారం పథకంలో భాగంగా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 40 లక్షల 27 వేల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.

హరితహారానికి సన్నద్ధం
కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెగడపల్లిలోని నర్సరీలో మొక్కలను పరిశీలిస్తున్న డీఎల్‌పీఓ(ఫైల్‌)

- జిల్లాలో 315 నర్సరీల్లో 85.69 లక్షల మొక్కలు

- 40.27 లక్షల మొక్కలను నాటడమే లక్ష్యం

- వివిధ శాఖలకు లక్ష్యాల కేటాయింపు

- ఉపాధిహామీ పథకం ద్వారా గుంతల తవ్వకం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

హరితహారం పథకంలో భాగంగా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 40 లక్షల 27 వేల మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ మేరకు 315 నర్సరీల్లో 85లక్షల 69 వేల మొక్కలను పెంచుతున్నారు. వర్షాలు కురియగానే మొక్కలను నాటేందుకు ఉపాధిహామీ పథకం ద్వారా గుంతలను కూడా తవ్వుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత మొక్కలు నాటడానికి పెద్దఎత్తున ప్రాధాన్యం ఇస్తున్నది. రాష్ట్రంలో ఉండాల్సిన మేరకు అడవులు లేవు. ఆ అడవుల శాతాన్ని పెంచి ప్రకృతి సమతుల్యతను కాపాడేందుకు అధికార టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరితహారం పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాకాలంలో మొక్కలు నాటుతున్నారు. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా మొక్కలను నాటేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో, పట్టణంలో ఒక నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచుతున్నారు. రవాణాపరంగా కూడా ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ స్థలాలు, రోడ్లకు ఇరువైపులా, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాల ఆవరణలు, గుట్టలు, మైదాన ప్రాంతాల్లోనూ మొక్కలను పెంచుతున్నారు. అలాగే ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు పెంచాలని తీసుకున్న నిర్ణయం మేరకు ఇంటింటికి మొక్కలను అందజేస్తున్నారు. నర్సరీల్లో నీడనిచ్చే మొక్కల కానుగ, వేప, నెమలినార, చింత, గుల్‌మహర్‌, అడవితంగేడు, సీమతంగేడుతో పాటు పండ్ల మొక్కల్లో జామ, మామిడి, దానిమ్మ, బొప్పాయి, నిమ్మ, సీతాఫలం, మునగ, కరివేపాకు, పూల మొక్కల్లో గులాబీ, మందార, మల్లె తదితర మొక్కలను పెంచుతున్నారు.

శాఖల వారీగా లక్ష్యాలు..

జిల్లాలో అటవీ శాఖ ద్వారా 5 నర్సరీలను ఏర్పాటు చేసి లక్షా 62 వేల మొక్కలను పెంచుతున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 266 నర్సరీల్లో 69 లక్షల 25 వేల మొక్కలు, రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా 23 నర్సరీల్లో 3లక్షల 50వేలు, పెద్దపల్లి మున్సిపాలిటీ ద్వారా 11 నర్సరీల్లో లక్షా 48 వేల మొక్కలు, మంథని మున్సిపాలిటీ ద్వారా 3 నర్సరీల్లో 80 వేల మొక్కలు, సుల్తానాబాద్‌ మున్సిపాలిటీ ద్వారా 4 నర్సరీల్లో లక్షా 20 వేల మొక్కలు, సింగరేణి సంస్థ ద్వారా 7లక్షల 84 వేల మొక్కలను పెంచుతున్నారు. ఈ మొక్కలు ప్రస్తుతం ఒక అడుగు ఎత్తు నుంచి మీటర్‌ వరకు పెరిగాయి. ఇందులో 10శాతం వరకు మొక్కలు దక్కకుండాపోయాయి. మొక్కలు నాటేందుకు వివిధ శాఖలకు లక్ష్యాలను కేటాయించారు. అటవీశాఖకు 2 లక్షలు, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 23 లక్షల 51 వేలు మొక్కలు నాటాలని నిర్ణయించారు. ఇందులో 16 లక్షల 27 వేల 600 మొక్కలను నాటనుండగా, మిగతా మొక్కలను ఇంటింటికి అందజేయనున్నారు. రామగుండం కార్పొరేషన్‌లో 3లక్షల 50 వేలు, మంథని మున్సిపల్‌ పరిధిలో 80వేలు, సుల్తానాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో 96వేలు, పెద్దపల్లి మున్సిపల్‌ పరిధిలో లక్షా 60 వేలు నాటాలని లక్ష్యంగా పెట్టారు. రోడ్లు, భవనాల శాఖ ద్వారా 40 వేలు, పంచాయతీ రాజ్‌ శాఖ ద్వారా 32 వేలు, నీటి పారుదల శాఖ ద్వారా 24 వేలు, ఎక్సైజ్‌ శాఖ ద్వారా 4వేలు, పరిశ్రమల శాఖ ద్వారా 6 లక్షల 90వేల మొక్కలను పరిశ్రమలుగల ఎన్టీపీసీ, ఆర్‌ఎఫ్‌సీఎల్‌ సింగరేణి తదితర చోట్ల నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈమేరకు ఉపాధిహామీ పథకం ద్వారా గుంతలను తవ్వుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో 30వేల గుంతలను తవ్వినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖాధికారి శ్రీధర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-16T05:46:44+05:30 IST