లక్ష్యం చేరని హరితహారం
ABN , First Publish Date - 2022-05-24T04:51:46+05:30 IST
హరితహారం పథకం లక్ష్యం చేరడం లేదు. నాటిక మొక్కల్లో 60 శాతం మేర సంరక్షించినట్లు అధికారులు లెక్కులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.

ఏటా లక్షల్లో నాటుతున్న మొక్కలు 8 సంరక్షణ గాలికి
కాగితాల్లో సగానికిపైగా బతికినట్లు చూపుతున్న అధికారులు
పట్టణాల్లో నాటిన చోటే మళ్లీ నాటుతున్న వైనం
బడ్జెట్‌లో 10 శాతం నిధుల కేటాయింపు
హరితహారం పథకం లక్ష్యం చేరడం లేదు. నాటిక మొక్కల్లో 60 శాతం మేర సంరక్షించినట్లు అధికారులు లెక్కులు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. గ్రామాల్లో కొంత మేర మొక్కలు కనిపిస్తున్నా, పట్టణాల్లో అయితే అదికూడా లేదు. నాటిన చోటే మొక్కలు నాటడం, కౌన్సిలర్లు పట్టించుకోకపోవడంతో పట్టణాల్లో పథకం పరిస్థితి దుర్భరంగా మారింది.
- మహబూబ్‌నగర్
తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తుండగా, వాటి సంరక్షణపై అదేస్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. ఈ కార్యక్రమం కోసం గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మునిసిపాలిటీ బడ్జెట్‌లలో 10 శాతం నిధులు కేటాయిస్తున్నారు. ఈ ఏడాది మహబూబ్‌నగర్ జిల్లాలో 60 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఐదేళ్లలో బతికిన 50 శాతం మొక్కలు
జిల్లాలో గడిచిన ఐదేళ్లలో నాటిన మొక్కల్లో 50 శాతం మొక్కలు బతికినట్లు అధికారులు లెక్కలు చూయిస్తున్నా, సగానికన్నా తక్కుగానే సంరక్షించబ డినట్లుగా తెలుస్తోంది. అధికారుల లెక్కల ప్రకారం గతేడాది 64.21 లక్షల మొక్కలను నాటారు. 2020లో 84.23 లక్షల మొక్కలు నాటగా, అందులో 57.99 లక్షల మొక్కలు బతికాయి. 2019లో 1.10 కోట్ల మొక్కలు నాటగా 57.38 లక్షలు, 2018లో 88.72 లక్షల మొక్కలు నాటగా 35.85 లక్షలు, 2017లో కోటి మొక్కలు నాటగా అందులో 35.86 లక్షల మొక్కలను సంరక్షించారు. మొత్తంమీద నాటిన మొక్కల్లో 50 శాతం మొక్కలు సంరక్షించినట్లు లెక్కలు చెబుతున్నాయి. అటవీశాఖ భూముల్లో నాటిన మొక్కల్లో మాత్రం 64 శాతం మొక్కలు సంరక్షించబడినట్లుగా చెబుతున్నారు.
పట్టణాల్లో అధ్వానం
పట్టణాల్లో అయితే సంరక్షణ శాతం మరీ తక్కువగా ఉంటోంది. ఎక్కడ మొక్కలు నాటాలో ప్రణాళిక లేకుండానే అడ్డదిడ్డంగా నాటుతున్నారు. మొక్కలు నాటాక, అక్కడ డ్రైనేజీ, సీసీరోడ్లు వేయడంతో మొక్కలను తొలగిస్తున్నారు. విద్యుత్ తీగల కింద నాటిన మొక్కలు పెరగగానే తీసేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు పెట్టే శ్రద్ద పట్టణాల్లో కౌన్సిలర్లు చూపించడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. చాలామంది కౌన్సిలర్లు హరితహారం జోలికే వెళ్ళడం లేదు. కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు హడావుడి చేసి, ఆ తరువాత పట్టించుకోవడం లేదు. నాటిన చోటనే మళ్లీ మళ్లీ మొక్కలు నాటుతున్నారు. పట్టణాలలో మూడో వంతు మొక్కలు కూడా బతకడం లేదు. వీటిపై యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఈ ఏడాది 60 లక్షలు
ఈ సంవత్సరం జిల్లాలో 60 లక్షల మొక్కలు నాటాలని యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 45 లక్షలు కాగా, అటవీశాఖకు 15 లక్షలు కేటాయించారు. డిపార్ట్‌మెంట్‌ల వారీగా ఎవరెన్ని మొక్కలు నాటాలో టార్గెట్‌లు ఫిక్స్ చే శారు. నర్సరీలలో దాదాపు 50-60 రకాల రకాల కోటిన్నర మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. వర్షాలు పడితే జూన్ మూడో వారంలో హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది.