చౌటుప్పల్ మండలంలో పటిష్ఠ నిఘా
ABN , First Publish Date - 2022-10-24T19:24:46+05:30 IST
మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకుంది.
చౌటుప్పల్ రూరల్: మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ పార్టీలు డబ్బు, మద్యంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుండటంతో ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకుంది. ఇప్పటికే ఉన్న పోలీస్ చెక్‌పోస్టులతోపాటు అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మండలాల సరిహద్దుల్లో మాత్రమే పోలీసు చెక్‌పోస్టులు ఉండగా ఇప్పుడు గ్రామ గ్రామాన చెక్‌పోస్టులు నిర్వహించనున్నారు. చౌటుప్పల్‌లో పంతంగి, తూప్రాన్‌పేట, పెద్దకొండూర్‌లో మాత్రమే చెక్‌పోస్టులు ఉన్నాయి. ఇకపై మండలంలోని అన్ని గ్రామాల్లో చెక్‌పోస్టులు రానున్నాయి. ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఎస్‌ఐ లేదా ఏఎ్‌సఐతోపాటు 5 నుంచి 10 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. వీరు గ్రామానికి వచ్చే ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తారు. ఇప్పటికే పలు చెక్‌పోస్టుల్లో భారీ మొత్తంలో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.
శనివారం ఒక్కరోజే ఉమ్మడి జిల్లాలో రూ.77లక్షల నగదును స్వాధీనం చేసుకోగా, ఆదివారం చింతపల్లి మండలం వింజమూరు, సుద్దపల్లి సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ.8లక్షల నగదును పట్టుకున్నారు. అదేవిధంగా ఇటీవల చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం ఓటర్లను యాదగిరిగుట్ట దేవాలయం దర్శనానికి బస్సుల్లో తరలించడంపై ఎన్నికల సంఘం విచారణ నిర్వహించింది. మల్కాపురం గ్రామ ఇన్‌చార్జిగా వ్యవరిస్తున్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఈనెల 20న 15 బస్సుల్లో ఓటర్లను యాదగిరిగుట్టకు తరలించగా, ఆ ఖర్చును అభ్యర్థి వ్యయంలో నమోదుచేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. మద్యం అమ్మకాలను కట్టడి చేసేందుకు ఆబ్కారీశాఖను అప్రమత్తం చేసి అదనంగా మరో తొమ్మిది తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నారు.