Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

ABN , First Publish Date - 2023-04-30T20:31:29+05:30 IST

తిరుమల (Tirumala)లో ఆదివారం భక్తుల (Devotees) రద్దీ పెరిగింది. వేసవి సెలవులు మొదలైన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల రాక మొదలైంది.

Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

తిరుమల: తిరుమల (Tirumala)లో ఆదివారం భక్తుల (Devotees) రద్దీ పెరిగింది. వేసవి సెలవులు మొదలైన నేపథ్యంలో శనివారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తుల రాక మొదలైంది. ఈక్రమంలో ఆదివారం ఉదయం నుంచి స్వామి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 22 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉండగా వీరికి దాదాపు 20 గంటల దర్శన సమయం పడుతోంది. స్లాటెడ్‌ టికెట్లు, టోకెన్‌ ఉన్న భక్తులకు రెండు గంటల్లో దర్శనం పూర్తవుతోంది. మరోవైపు గదుల కోసం భక్తులు సీఆర్వో, పద్మావతి, ఎంబీసీ 34 వద్దనున్న కౌంటర్ల వద్ద గంటలకొద్దీ నిరీక్షిస్తూ కనిపించారు. గదిని పొందడానికి దాదాపు మూడు గంటల సమయం పడుతోంది. తలనీలాలు సమర్పించే కళ్యాణకట్టలు, లడ్డూ కౌంటర్‌, కొబ్బరికాయలు సమర్పించే అఖిలాండం, మాడవీధులు, అన్నదాన కాంప్లెక్స్‌, బస్టాండ్లు యాత్రికుల రద్దీతో కనిపించాయి.

తిరుమలేశుడి సేవలో న్యాయమూర్తులు

ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రవి చీమలపాటి, జస్టిస్‌ శ్రీనివాసరెడ్డి (Justice Srinivasa Reddy) ఆదివారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో వేర్వేరుగా ఆలయంలోకి వెళ్లిన వీరు ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు. కాగా, వేకువజామున ఆలయంలో జరిగిన సుప్రభాత సేవలో సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఇందిరా బెనర్జీ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.

Updated Date - 2023-04-30T20:31:29+05:30 IST