ఆ సీఐని చిన్నశిక్షతో వదిలేస్తారా?
ABN , First Publish Date - 2023-06-15T03:41:36+05:30 IST
అడ్వకేట్ కమిషనర్‌పై చేయిచేసుకున్న వ్యవహారంలో హిందూపురం వన్‌టౌన్ సీఐ ఇస్మాయిల్‌పై సరైన చర్యలు తీసుకోలేదంటూ రాష్ట్ర డీజీపీపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సీఐకి మైనర్ పని్‌షమెంట్ ఇచ్చి వదిలేస్తారా? అని ప్రశ్నించింది.

అడ్వకేట్ కమిషనర్‌పై చెయ్యి చేసుకోవడం
చిన్న విషయమా? సీఐపై ఎందుకంత దయ?
సమాజానికి ఏం చెబుదామనుకుంటున్నారు?
డీజీపీని ఉద్దేశించి హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
ఏం చర్యలు తీసుకున్నదీ చెప్పాలని ఆదేశం
అమరావతి, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): అడ్వకేట్ కమిషనర్‌పై చేయిచేసుకున్న వ్యవహారంలో హిందూపురం వన్‌టౌన్ సీఐ ఇస్మాయిల్‌పై సరైన చర్యలు తీసుకోలేదంటూ రాష్ట్ర డీజీపీపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సీఐకి మైనర్ పని్‌షమెంట్ ఇచ్చి వదిలేస్తారా? అని ప్రశ్నించింది. పోలీసు ఉన్నతాధికారులు సీఐపై దయ చూపిస్తున్నట్లు కనపడుతోందని వ్యాఖ్యానించింది. ఇలాంటి చర్యల ద్వారా సమాజానికి ఏమి సందేశం ఇద్దామనుకుంటున్నారని నిలదీసింది. పోలీసుల అక్రమాలపై విచారణ జరిపేందుకు పోలీసు కంప్లయింట్ అథారిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీసింది. కోర్టు ఆదేశాలను అవహేళన చేసిన సీఐపై ఏమి చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు సైతం న్యాయస్థానం ముందుహాజరు కావాల్సిందేనని సీఐ ఇస్మాయిల్‌కు స్పష్టంచేసింది. విచారణను ఈనెల 28కి వాయిదావేసింది. మరోవైపు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కరణ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని సీఐని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. హిందూపురానికి చెందిన డి.గిరీశ్ అనే వ్యక్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యం హిందూపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వద్దకు వచ్చింది. దీనిపై వాస్తవాలు తేల్చేందుకు న్యాయవాది పి.ఉదయ్ సింహారెడ్డిని న్యాయాధికారి... అడ్వకేట్ కమిషనర్‌గా నియమించారు. గతేడాది సెప్టెంబరు 21న అడ్వకేట్ కమిషనర్... హిందూపురం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చూడగా, గిరిశ్ అక్కడే ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు ఆయనను చిత్రహింసలకు గురిచేసినట్లు నిర్ధారణ అయింది. ఈ క్రమంలో అడ్వకేట్ కమిషనర్ ఉదయ్ సింహరెడ్డి, సహాయకారిగా వెళ్లిన బెంచ్ క్లర్క్ శివశంకర్‌పై సీఐ చెయ్యి చేసుకున్నారని, ఆయనపై చర్య తీసుకోవాలని హిందూపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి...పెనుగొండ డీఎస్పీకి లేఖ రాశారు. లేఖ ప్రతులను అనంతపురం డీఐజీ, జిల్లా ప్రధాన న్యాయమూర్తికి కూడా పంపించారు. హైకోర్టు రిజిస్ట్రార్ జ్యుడీషియల్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. దీనిపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర డీజీపీని రిజిస్ట్రార్ జ్యుడీషియల్ కోరారు. డీజీపీ ఇచ్చిన నివేదికను రిజిస్ట్రార్.. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచారు. దానిని పరిశీలించిన సీజే... అడ్వకేట్ కమిషనర్, కోర్టు సిబ్బందిపై దాడి వ్యవహారాన్ని సుమోటో పిల్‌గా నమోదు చేయాలని ఆదేశించారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు వచ్చింది. గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐ ఇస్మాయిల్ బుధవారం హైకోర్టు ముందు హాజరయ్యారు. డీజీపీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సి సుమన్ వాదనలు వినిపించారు. ధర్మాసనం స్పందిస్తూ...సీఐపై ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించింది. ఎస్‌జీపీ కొంత సమయం ఇవ్వాలని అభ్యర్ధించారు.