Lokesh Letter: అనంత ప్రేమని వరంగా పొందా... మీ అభిమానానికి కృతజ్ఞతలు.. లోకేష్ బహిరంగ లేఖ
ABN, First Publish Date - 2023-04-13T12:05:52+05:30
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో విజయవంతంగా సాగింది.
అనంతపురం: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) జిల్లాలో విజయవంతంగా సాగింది. నేటితో జిల్లాలో పాదయాత్ర పూర్తి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. మొత్తం 24 రోజుల పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర కొనసాగింది. ఇప్పటి వరకు చిత్తూరు, అనంతపురం జిల్లాలో 874.1 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర చేశారు. అనంతలో పాదయాత్ర విజయవంతంగా ముగిసిన సందర్భంగా అభిమానులకు యువనేత లేఖ రాశారు. ‘‘జిల్లాలో ప్రజల బాధలు విన్నాను.. సమస్యలు చూశాను.. పరిష్కార బాధ్యత నేనే తీసుకుంటాను’’... పాదయాత్రను ఆదరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ లోకేష్ బహిరంగ లేఖ రారు.
యువగళం పాదయాత్రలో భాగంగా అనంతలోకి పాదయాత్ర ప్రవేశించిన సమయంలో ఎండను కూడా లెక్క చేయకుండా ప్రజలు తనపై అభిమానాన్ని కురిపిస్తూ ఘన స్వాగతం పలికారన్నారు. ప్రజాభిమానమే బలమై, జనమే దళమై, తెలుగుదేశం నేతలే సారధులై, కార్యకర్తలే వారధులై పాదయాత్రను విజయవంతం చేశారని తెలిపారు. అనంతపురం జిల్లా ప్రేమని వరంగా అందించిన ప్రజలు, తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు, అభిమానులు, మీడియా మిత్రులు, వలంటీర్లు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
హంద్రీనీవాకు నీళ్లిచ్చే బాధ్యత నాది..
టీడీపీ (TDP) ఆరంభించిన ప్రాజెక్టులు అర్ధంతరంగా ఆపేసి వైసీపీ సర్కారు (YCP Government) జిల్లాకి చేసిన అన్యాయం చూసి ఎంతో బాధపడ్డానని తెలిపారు. రాయలసీమని పట్టిపీడిస్తున్న కరవును శాశ్వతంగా పారదోలాలని హంద్రీనీవా సుజల స్రవంతి (Handriniva Sujala sravanti) పనులను చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) పరుగులు పెట్టించారు. తొలిదశ కాలువ పనులను పూర్తి చేయడంతో పాటు మల్యాల నుండి జీడిపల్లి దాకా ప్రధాన కాలువను వెడల్పు చేయడానికి వెయ్యి కోట్ల నిధులిచ్చి 70 శాతం పనులను పూర్తి చేయించారని చెప్పారు. అయితే ఈ జిల్లా మనవడినని హంద్రీనీవా కాలువను రెండు దశల్లో పదివేల క్యూసెక్కులకు విస్తరిస్తామని మాయ హామీలిచ్చారు. విస్తరణ మాట విస్మరించి సాగుతున్న పనులను నిలిపివేశారు. నాలుగేళ్లలో హంద్రీనీవా పథకాన్ని నిర్లక్ష్యం చేసి అనంతపురం జిల్లాకు జగన్ మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) తీరని ద్రోహం చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం (TDP Government) కొలువుతీరగానే హంద్రీనీవా విస్తరణ పనులను కొనసాగించడంతో పాటు ఆయకట్టుకు నీళ్లిచ్చే బాధ్యత తనది అని స్పష్టం చేశారు.
ఆ పనులన్నీ పూర్తి చేస్తాం...
అనంతపురం జిల్లాలోనే అత్యంత వెనుకబడిన రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సాగు, తాగు నీటిని అందించే జీడిపల్లి- భైరవానితిప్ప ప్రాజెక్టు (Jeedipalli-Bhairavanithippa Project) కి చంద్రబాబు ప్రభుత్వం రూ.967కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించిందని గుర్తుచేశారు. అయితే సీఎం అయ్యాక జగన్ రెడ్డి ఈ ప్రాజెక్టుని మూలనపడేశారు. వైసీపీ పాలనలో అంతులేని నిర్లక్ష్యానికి గురైన భైరవానితిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాల తరలింపు పథకాన్ని పూర్తిచేసి ప్రజలు, రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఉరవకొండ నియోజకవర్గంలో 50వేల ఎకరాలకు నీళ్లిచ్చే బిందుసేద్యం పథకాన్ని వైసీపీ సర్కారు నిలిపేసిందని.. తాము అధికారంలోకి రాగానే దాన్ని మళ్లీ ఆరంభిస్తామని చెప్పారు జిల్లాకు జీవనాధారమైన తుంగభద్ర (Tungabhadra) ఎగువ కాలువ ఆధునికీకరణ పనులను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు. టీడీపీ సర్కారు రాగానే ఈ పనులను పూర్తి చేస్తామన్నారు.
అనంతకే కియా అనుబంద సంస్థలు...
హెచ్చెల్సీ నీటి సక్రమ వినియోగానికి రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలంలో ఉంతకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు (Untakallu Balancing Reservoir)ను నిర్మించాలని గతంలో టీడీపీ ప్రభుత్వం సిద్ధం చేసిన డీపీఆర్‌ను జగన్ రెడ్డి సీఎం కాగానే పక్కనపడేశారని విమర్శించారు. తెలుగుదేశం అధికారం చేపట్టాక ఉంతకల్లు రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మడకశిర బ్రాంచ్ కెనాల్, జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టు పూర్తిచేసి సాగునీరు అందిస్తామన్నారు. నాటి టీడీపీ ప్రభుత్వం కృషితో వచ్చిన కియా కరవునేలలో కార్లతో పాటు ఉద్యోగాల పంట పండిస్తోంది. మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారని.. కియా అనుబంధ సంస్థలని అనంతపురం జిల్లాకే తీసుకొచ్చి వేలాది మందికి ఉద్యోగ - ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చడానికి గతంలో టీడీపీ ప్రభుత్వం పెద్దఎత్తున రైతులకు డ్రిప్ సబ్సిడీని అందించింది. వైసీపీ పాలకులు డ్రిప్ సబ్సిడీని మూడేళ్లు మూలనపడేసి, ఇప్పుడు తూతూమంత్రంగా అమలు చేస్తామంటున్నారని మండిపడ్డారు. చంద్రన్న ముఖ్యమంత్రి కాగానే డ్రిప్ సబ్సిడీ పథకానికి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పారు.
సదా మీ ప్రేమకు బానిసను.. శిరస్సు వంచి నమస్కరిస్తున్నా...
ఈ జిల్లా తోటల్లో పండే ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం చేసి, అధిక ధరలు అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వేరుశెనగకు గిట్టుబాటు ధరలు అందేలా అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు. వైసీపీ భూబకాసురులు కబ్జా చేసిన లేపాక్షి భూములని స్వాధీనం చేసుకుని, ఆ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటుకి కృషి చేస్తామన్నారు. జిల్లాలో ఉన్న చేనేత కార్మికులను ఆదుకుంటామని.. ప్రత్యేక క్లస్టర్స్ ఏర్పాటు చేయడంతో పాటు మగ్గం ఉన్న వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తామని యువనేత పేర్కొన్నారు. టిడ్కో ఇళ్లు అందజేస్తామని, కామన్ వర్కింగ్ షెడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేనేతకు జీఎస్టీని రద్దు చేస్తామన్నారు. ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ పోటీ చేసేందుకు ఈ జిల్లాను ఎంచుకున్నారంటే...మీ ప్రేమ, ఆప్యాయతల గొప్పతనం తెలుస్తోందన్నారు. ఆత్మీయంగా ఆదరిస్తున్న అనంతపురం జిల్లాకి రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలు పరిష్కరించి, జిల్లాని అభివృద్ధి చేసి ఆ రుణం తీర్చుకుంటానని తెలిపారు. ‘‘అనంతపురం జిల్లాలో పాదయాత్రని ప్రభంజనం చేసిన మీ ప్రేమకి సదా బానిసను. యువగళాన్ని జనస్వరం చేసిన మీ అభిమానానికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను’’ అంటూ లోకేష్ లేఖలో పేర్కొన్నారు.
Updated Date - 2023-04-13T12:27:35+05:30 IST