MLC elections: టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి
ABN, First Publish Date - 2023-03-07T18:46:37+05:30
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC elections)పై పార్టీనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు.
అమరావతి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC elections)పై పార్టీనేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. టీడీపీ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కొన్ని సందర్భాల్లో రెండో ప్రాధాన్య ఓటు కీలకంగా మారుతుందని, రెండో ప్రాధాన్య ఓటు టీడీపీ అభ్యర్థికే పడేలా చూడాలని చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి.చిరంజీవి రావు, తూర్పు రాయల సీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్, పశ్చిమ రాయల సీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి (Bhumi Reddy RamgopalReddy) గెలుపుకోసం కృషిచేయాలని కోరారు. ఎన్నికల్లో అక్రమాలకు అలవాటు పడిన వైసీపీ.. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ అక్రమాలకు తెరతీసిందని దుయ్యబట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో వేల సంఖ్యలో బోగస్ ఓట్లు.. నమోదు చేయడమే అందుకు నిదర్శనమన్నారు. పట్టభద్రులు కాని వారిని ఓటర్లుగా చేర్చడం, స్థానికేతరులకు ఓట్లు రాయించడం నీచమైన చర్య అని మండిపడ్డారు. బోగస్ ఓటర్లపై, చేర్పించిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లోనూ ఓటర్లకు డబ్బు పంచి.. ఓట్లు వేయించుకోవాలని అధికార పార్టీ ప్రయత్నిస్తొందని చంద్రబాబు ఆరోపించారు.
ఎన్నికల వేడి
సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఏడాదికి ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు రాజకీయ వేడిని రగిలించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును సొమ్ము చేసుకునేందుకు అటు టీడీపీ, మిత్రపక్షాలు ముమ్మర ప్రయత్నాలుచేస్తుండగా ఇటు అధికార బలంతో వ్యతిరేక ఓటును అధిగమించేందుకు అధికార పార్టీ నేతలు అంతకంటే ఎక్కువగా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలో కూడా నువ్వా నేనా అనిపిస్తోంది. టీడీపీ నుంచి రాంగోపాల్‌రెడ్డి పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి వెన్నపూస రవీంద్రారెడ్డి, పీడీఎఫ్ నుంచి నాగరాజు తదితరులు బరిలో ఉన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులను కూడా మోసం చేసినట్లు విమర్శలు ఉన్నాయి. సచివాలయ ఉద్యోగాలను మినహాయిస్తే టీచరు పోస్టుల భర్తీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలు భర్తీ చేయకపోవడం, ప్రతి యేటా జాబ్‌క్యాలెండరు అంటూ జగన్ ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడం, చంద్రబాబు హయాంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి నిలిపివేయడం, ఉపాధి అవకాశాల కోసం ఎలాంటి పరిశ్రమలు లేకపోవడంతో ప్రభుత్వంపై నిరుద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎన్నికలు వైసీపీకి సవాల్‌గా మారాయి. దీంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎలాగైనా గెలుపొందేందుకు కుయుక్తులు చేస్తున్నారనే ఆరోపణలు ఉనాయి.
Updated Date - 2023-03-07T18:46:37+05:30 IST